"పదేళ్ల బాలుడికి అరుదైన వెన్నెముక క్యాన్సర్" - ప్రాణాలు కాపాడిన కిమ్స్ కొండాపూర్ డాక్టర్లు
రోబోటిక్ స్పైన్ శస్త్రచికిత్సతో కొత్త జీవితం - రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా రోబోటిక్ ఎన్-బ్లాక్ వెర్టిబ్రా తొలగింపు - రోబోటిక్స్ శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం, భద్రత

Published : May 15, 2026 at 1:42 PM IST
Kims Doctors Save Rare Disease Kid : అరుదైన వెన్నెముక క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ 10 ఏళ్ల బాలుడికి కొత్త జీవితాన్ని అందించారు కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ డాక్టర్లు. హైదరాబాద్ నగరానికి చెందిన హిమసాయి అనే బాలుడు మొదట పొత్తికడుపు నొప్పి, వెన్నముక దిగువ భాగంలో నొప్పితో స్థానిక వైద్యులను సంప్రదించారు. వివిధ పరీక్షలు, ముఖ్యంగా ఎంఆర్ఐలో స్పష్టమైన నిర్ధారణ రాకపోవడంతో కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ పూర్తి స్థాయి క్లినికల్, రేడియాలజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎఫ్‌డీజీ - పెట్ స్కాన్ చేయించారు.
పిల్లల్లో వచ్చే అరుదైన ఎముకల క్యాన్సర్ : స్కానింగ్‌లో వెన్నెముకలోని ఒక ఎముక బాగా సన్నబడ్డట్లు కనిపించడంతో పాటు, అరుదుగా కనిపించే ఒక ఎముక సంబంధిత వ్యాధి ఉండొచ్చని అనుమానం వచ్చింది. అయితే తర్వాత తీసిన టిష్యూ పరీక్షల్లో క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు చేసిన ప్రత్యేక పరీక్షల్లో ఇది ఈవింగ్ సార్కోమా అనే క్యాన్సర్ అంటే చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే ఒక రకమైన ఎముకల క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆంకాలజీ బృందం పర్యవేక్షణలో బాబుకు ముందుగా రెండు సైకిళ్ల కీమోథెరపీ ఇచ్చారు. చికిత్సకు మంచి స్పందన రావడంతో అత్యంత క్లిష్టమైన రోబోటిక్ మార్గదర్శకత్వంలో L4 వెర్టిబ్రా ఎన్ - బ్లాక్ తొలగింపు, ఫిక్సేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు.
న్యూరోలాజికల్ లోపాలు నుంచి కోలుకున్న బాలుడు : రోబోటిక్ సాంకేతికతతో శస్త్రచికిత్సకు ముందస్తు ప్రణాళిక మరింత ఖచ్చితంగా చేయగలిగామని కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డా. కృష్ణ చైతన్య తెలిపారు. అసాధారణ నిర్మాణాల్లో కూడా పెడికల్ స్క్రూలను సరిగ్గా అమర్చగలిగామని ఆయన చెప్పారు. ట్యూమర్‌ను పూర్తిగా తొలగించడానికి నియంత్రితంగా కట్స్ చేయగలిగామన్నారు. శస్త్రచికిత్స అనంతరం బయాప్సీ నివేదికల్లో ట్యూమర్ పూర్తిగా తొలగించినట్లు, క్లియర్ మార్జిన్స్ ఉన్నట్లు నిర్ధారితమైందన్నారు. బాలుడు ఎటువంటి న్యూరోలాజికల్ లోపాలు లేకుండా స్వయంగా నడుస్తున్నా, కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడని చెప్పారు. రోబోటిక్స్ శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం, భద్రతను పెంచుతుందన్నారు. అయితే ఇది వైద్యుని నైపుణ్యాన్ని భర్తీ చేయదు, కానీ తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్ బ్లాక్ రీసెక్షన్ అనేది చాలా క్లిష్టమైనది. అనేక సమస్యలతో కూడుకున్నది. అయినందువల్ల దీనిని అరుదుగా చేస్తారని వైద్యులు తెలిపారు. ఇది వెన్నెముక క్యాన్సర్ చికిత్సలో ఒక ముఖ్యమైన మైలురాయి అని వారు పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్స ప్రక్రియకు డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ హర్ష విక్రమ్ నాయకత్వం వహించగా, ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సహకారం అందించారు.
రోబో సర్జరీతో త్వరగా రికవరీ : ఈవింగ్ సార్కోమా ప్రధానంగా చిన్నారులు, యవన దశలోని వారికి కనిపించే క్యాన్సర్. దీని చికిత్సలో కీమోథెరపీతో పాటు అవసరమైనప్పుడు శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సను రోబో ద్వారా చేశామని, దీంతో క్లిష్టమైన స్పైన్ ట్యూమర్ గుర్తించగలిగామని కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ కృష్ణ చైతన్య తెలిపారు. అంతేకాకుండా ఇతర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సర్జరీ చేశామని ఆయన పేర్కొన్నారు. రోబో సర్జరీ కావడంతో బాబు వేగంగా కోలుకున్నాడని చెప్పారు.
కిమ్స్‌లో ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు - తొలి ఫెలోషిప్ ప్రారంభం
కిమ్స్ సన్‌షైన్‌లో సేఫ్ స్పైన్ సర్జరీ సూట్ - సర్జరీల్లో అత్యంత ఖచ్చితత్వంతో ట్రీట్మెంట్

