ETV Bharat / state

పొగాకు ఏ రూపంలోనైనా ప్రమాదకరమే - ఏ టెక్నాలజీ క్యాన్సర్​ను పూర్తిగా తొలగించలేకపోతుందంటున్న కిమ్స్​ వైద్యులు

ఒక అలవాటు, ఎన్నో క్యాన్సర్లు, అంతులేని పశ్చాత్తాపం - ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న అత్యంత ప్రమాదకర వ్యసనం - పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లు ఒక్క అవయవానికే పరిమితం కావంటున్న వైద్యులు

Dr. Madhu Devarashetti, Senior Consultant Surgical Oncologist
Dr. Madhu Devarashetti, Senior Consultant Surgical Oncologist (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 2:24 PM IST

4 Min Read
Choose ETV Bharat

Cancer is the Most Dangerous Addiction : 'టెన్షన్‌లో ఒక సిగరెట్, భోజనం తర్వాత ఒక గుట్కా ప్యాకెట్, స్నేహితులతో అప్పుడప్పుడు పొగ తాగడం' ఇలా సరదాగా మొదలైన అలవాటు, కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద శస్త్ర చికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు, జీవితాంతం మారిపోయే పరిస్థితులు, కొన్నిసార్లు ప్రాణనష్టం వరకు తీసుకెళ్తుంది. అదే పొగాకు నిజ స్వరూపం. నెమ్మదిగా నిశ్శబ్దంగా కానీ నిర్దాక్షిణ్యంగా శరీరాన్ని నాశనం చేస్తుంది.

ప్రజారోగ్య సమస్య నుంచి నిశ్శబ్ద మహమ్మారి వరకు : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 70 లక్షల మందికిపైగా పొగాకు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలోనే సుమారు 13.5 లక్షల మరణాలకు పొగాకే కారణమవుతోంది. పొగాకు శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్నీ దెబ్బతీస్తుంది. రక్తనాళాలను దెబ్బతీసి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. ముఖ్యంగా అనేక రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణంగా మారుతుంది. ప్రతి నాలుగు క్యాన్సర్ మరణాల్లో ఒకటి పొగాకు, జీవనశైలి కారణాలతో సంబంధం కలిగి ఉంటుంది. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లు ఒక్క అవయవానికే పరిమితం కావు.

పెదాలు, నాలుక, చెంపలు, గొంతు, స్వరతంత్రులు, ఊపిరితిత్తులు, ఆహారనాళం, కడుపు, అండశయం, మూత్రాశయం వంటి అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి. క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులుగా ప్రతిరోజూ ఇలాంటి పొగాకు సంబంధిత క్యాన్సర్ కేసులను చూస్తూనే ఉంటామని డా.మధు దేవరశెట్టి, సీనియర్​ కన్సల్టెంట్​ సర్జికల్​ ఆంకాలజిస్ట్​, రోబోటిక్​ సర్జన్​ తెలిపారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ క్యాన్సర్లలో చాలా వరకు పూర్తిగా నివారించవచ్చని కిమ్స్​ హాస్పిటల్స్​ వైద్యులు చెబుతున్నారు.

ఏ రూపంలోనైనా పొగాకు ప్రమాదకరమే : మన దేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో గుట్కా, ఖైనీ, పొగాకు కలిపిన పాన్ మసాలా, నమిలే పొగాకు వంటి ఉత్పత్తులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ చాలామంది ఇవి సిగరెట్ కంటే తక్కువ హానికరమని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇవే నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణాలు. మన దేశంలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ ఒకటి. ఇటీవల యువతలో వేగంగా పెరుగుతున్న మరో ప్రమాదం వెపింగ్, కొత్తరకం నికోటిన్ ఉత్పత్తులు. వీటిని ఫ్యాషన్‌గా లేదా సేఫ్ ప్రత్యామ్నాయాలుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవి కూడా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

ఇది ఇక వృద్ధుల వ్యాధి కాదు : ఇప్పటి అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే యువతలో కూడా పొగాకు సంబంధిత క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ముప్పై, నలభై ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్ బారిన పడుతున్న వారిని చూస్తున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తి వ్యాధి కాదు. ప్రతి నిర్ధారణ వెనుక ఒక కుటుంబం భావోద్వేగ ఒత్తిడి, ఆర్థిక భారం, భవిష్యత్తుపై అనిశ్చితిని ఎదుర్కొంటోంది. పశ్చాత్తాపం కాకుండా ఇంకా కాపాడుకునే భవిష్యత్తు ఉంది.

లక్షణాలు ఏంటంటే? : నోరులో మానని పుండు, గొంతు బొంగురుపోవడం, మింగడంలో ఇబ్బంది, అకారణ బరువు తగ్గడం, మలవిసర్జన అలవాట్లలో మార్పులు, మూత్రంలో రక్తం, తీవ్ర బలహీనత వంటి లక్షణాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వెంటనే ఆంకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

ముందే మానేసి ఉండాల్సింది : పొగాకు మానేందుకు ఎప్పుడూ ఆలస్యం కాదు. ఏ దశలోనైనా మానేస్తే శరీరం మళ్లీ కోలుకోవడం ప్రారంభిస్తుంది. కొన్ని వారాల్లోనే శ్వాస మెరుగుపడుతుంది. రక్తప్రసరణ బాగుపడుతుంది. భవిష్యత్తులో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా, పొగాకు మానడం ద్వారా కేవలం మనల్ని మాత్రమే కాదు మన కుటుంబాన్ని కూడా రక్షిస్తున్నాం అంటున్నారు వైద్యులు.

కలిసి పోరాడితేనే విజయం : క్యాన్సర్ ఒక వ్యక్తిని ప్రభావితం చేయొచ్చు. కానీ దానితో పోరాడేందుకు కుటుంబం, వైద్యులు, క్యాన్సర్ నుంచి బయటపడినవారు, సమాజం అందరూ కలిసి రావాలి. తల్లిదండ్రులు పిల్లలతో పొగాకు ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడాలి. విద్యాసంస్థలు యువతలో అవగాహన పెంచాలి. ఉద్యోగ సంస్థలు, ప్రజాస్థలాలు పొగాకు రహిత వాతావరణాన్ని ప్రోత్సహించాలి. వైద్యులు పొగాకు విరమణ, ప్రారంభ దశ స్క్రీనింగ్‌పై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలి. నేటి వైద్యరంగంలో క్యాన్సర్ చికిత్సలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఆధునిక శస్త్రచికిత్సలు, రోబోటిక్ టెక్నాలజీ, టార్గెటెడ్ థెరపీ, మెరుగైన రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే నివారించగలిగే పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల కలిగే బాధను ఏ టెక్నాలజీ పూర్తిగా తొలగించలేకపోతుంది.

ఈ ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా మన కోసం, మన కుటుంబం కోసం, రాబోయే తరాల కోసం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుందాం. మీరు పొగాకు వినియోగిస్తుంటే, ఈరోజే మానేందుకు తొలి అడుగు వేయండి. మీరు వినియోగించకపోతే మానేందుకు ప్రయత్నిస్తున్న వారిని ప్రోత్సహించండి. పొగాకు సంబంధిత క్యాన్సర్లతో పోరాడే ఉత్తమ మార్గం అవి మొదలుకాకముందే నివారించాలి అంటున్న వైద్యులు సూచనలు చేస్తున్నారు.

మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబానికే నష్టం - ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పరీక్షలు అవసరమంటున్న కిమ్స్​ కడల్స్​ వైద్యులు

లివర్ మార్పిడి లేకుండానే అరుదైన వ్యాధి నుంచి యువతిని కాపాడిన కిమ్స్ వైద్యులు