లక్షలాది మందిని వేధిస్తోన్న వీనస్ అల్సర్లు - 'వాక్‌ఫ్రీ' ద్వారా అవగాహన కల్పించిన కిమ్స్ వైద్యులు
దేశంలో అధికంగా వేధిస్తోన్న కాళ్లపై పుండ్ల సమస్య - అవగాహన కల్పించేందుకు 'వాక్‌ఫ్రీ' కార్యక్రమం నిర్వహించిన సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు - రక్తనాళాల్లోని సమస్యలతో వచ్చే పుండ్లకు అందుబాటులో ఆధునిక చికిత్స

Published : August 29, 2026 at 4:52 PM IST
Venous Ulcers Awareness By KIMS Doctors : దేశంలో సుమారు 22 లక్షల నుంచి 65 లక్షల మంది వరకు కాళ్లలోని సిరలకు సంబంధించిన సమస్యల కారణంగా వచ్చే దీర్ఘకాలిక పుండ్లతో బాధపడుతున్నట్లు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, వాస్క్యులర్ సర్జన్ డా.నరేంద్ర మేడా పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఉర్గో ఫౌండేషన్ ద్వారా 'వాక్‌ఫ్రీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా భారతదేశంలో ఈ సమస్యకు సంబంధించి ఇదే తొలి అవగాహన కార్యక్రమం కావడంతో భారీ సంఖ్యలో రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమస్య ఉపాధిపై ప్రభావం చూపుతోంది : సిరల్లో రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కాళ్లపై ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం మానకపోవచ్చని డా.మేడా తెలిపారు. దాదాపు 40 శాతం మంది రోగుల్లో రెండు నుంచి నాలుగేళ్ల వరకు పుండ్లు కొనసాగుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయన్నారు. ఒకసారి మానిన తర్వాత కూడా తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. ఐదేళ్లలో 70 శాతం వరకు పుండ్లు మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ సమస్య 36 నుంచి 60 ఏళ్ల వయసు వారిలో గణనీయంగా కనిపిస్తుండటంతో కుటుంబాలపై, ఉపాధిపై కూడా ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ కాలం పుండ్లతో బాధపడటం వల్ల నడక, రోజువారీ కార్యకలాపాలు, ఉద్యోగ సామర్థ్యం, జీవన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు.
"కాళ్లపై ఏర్పడే పుండ్లను సాధారణ గాయాలుగా భావించకూడదు. ఇవి దీర్ఘకాలం కొనసాగడంతో పాటు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. రోగులు చికిత్సను సక్రమంగా పాటించడం, వ్యాధిపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం" - డా.నరేంద్ర మేడా, వాస్క్యులర్ సర్జన్ , కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్
కంప్రెషన్ బ్యాండేలతో ఉపశమనం : కార్యక్రమంలో ప్రధానంగా కంప్రెషన్ థెరపీపై వైద్యులు అవగాహన కల్పించారు. కాళ్లపై ప్రత్యేకమైన కంప్రెషన్ బ్యాండేజీలు ఉపయోగించడం ద్వారా సిరల్లో రక్తప్రసరణను మెరుగుపరచడంలో, పుండ్లు మానడంలో సహాయపడొచ్చని వివరించారు. ముఖ్యంగా మల్టీకాంపోనెంట్ కంప్రెషన్ బ్యాండేజీలు నిరంతర కుదింపును అందించడంతో పాటు రోగులకు ధరించే సమయంలో సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు తెలిపారు.
ఒకే రకమైన బ్యాండేజీపై ఆధారపడటం కంటే వైద్యుల సూచన మేరకు మల్టీకాంపోనెంట్ కంప్రెషన్ విధానాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు వివరించారు. చికిత్సను మధ్యలో ఆపకుండా, వైద్యులు సూచించిన విధంగా చికిత్సను కొనసాగించడం ఎంత ముఖ్యమో కూడా తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రోగులు, కుటుంబ సభ్యులు వైద్య నిపుణులను తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంతో : వెరికోస్ వెయిన్స్ తదితర సిరల సమస్యలతో వచ్చే దీర్ఘకాలిక కాళ్ల పుండ్లపై అవగాహనను కేవలం ఆసుపత్రులకే పరిమితం చేయకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడమే వాక్‌ఫ్రీ కార్యక్రమం లక్ష్యమని ఉర్గో ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. వ్యాధిని తొలిదశలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, వైద్యుల సూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా పుండ్ల తీవ్రతను తగ్గించడంతో పాటు తిరిగి వచ్చే అవకాశాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. అవగాహన, క్రమం తప్పని చికిత్స, సరైన సంరక్షణతో దీర్ఘకాలిక కాళ్ల పుండ్ల నుంచి బయటపడేందుకు మరింత మంది రోగులకు సహాయపడటమే వాక్‌ఫ్రీ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
28 రోజుల శిశువుకు తీవ్ర శ్వాసకోస సమస్య - ప్రాణాలు కాపాడిన 'కిమ్స్ కడల్స్' వైద్యులు
ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంట అత్యంత కీలకం : డా.భాస్కర్రావు

