పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే - అధికారుల ఏర్పాట్లు
తగ్గనున్న హైదరాబాద్-విశాఖపట్నం మధ్య దూరం - నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే - ఖమ్మం జిల్లాలో 105.22 కి.మీ - ఏపీలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 56.88 కి.మీ - మొత్తం 162.10కి.మీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 10:22 AM IST
Khammam to Devarapalli Greenfield Highway: హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఖమ్మం-దేవరపల్లి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే వచ్చే నెల పాక్షికంగా తెరుచుకోనుంది. ఇందులో అటు ఖమ్మం వైపు, ఇటు దేవరపల్లి వైపు ప్యాకేజీల్లో పనులు సాగుతున్నాయి. మధ్యలో నిర్మాణం పూర్తయినందున వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు వాహనాలను అనుమతించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
120 కి.మీ. మేర హైవే పూర్తి:
- నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేలో ఖమ్మం జిల్లా పరిధిలో 105.22 కి.మీ., ఏపీలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 56.88 కి.మీ. కలిపి 162.10 కి.మీ. ఉంది.
- ఖమ్మం వద్ద మున్నేరు వాగుపై వంతెన, దానికి సమీపంలోని రైల్వే లైన్‌పై వంతెన పూర్తికావాలి. ఇందుకు 3 నెలలు పడుతుంది.
- దేవరపల్లి వైపు కొయ్యలగూడెం మండలంలోని ఎర్రంపేట, కన్నాయిగూడేల వద్ద భూసేకరణ విషయమై కోర్టు కేసు కారణంగా 2 కి.మీ. నిర్మాణం ఆగిపోయింది. కొంతకాలం కిందట పరిష్కారమైంది. ఇటీవల పనులు మొదలయ్యాయి. పూర్తయ్యేందుకు 3 నెలలు పడుతుందని భావిస్తున్నారు.
- మధ్యలో దాదాపు 120 కి.మీ. మేర హైవే పూర్తయ్యింది.
- ఖమ్మం దాటాక వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలకు అనుమతించాలని భావిస్తున్నారు.
- ప్రస్తుతమున్న హైవేలో వైరా వద్ద నుంచి కిలోమీటరున్నర దూరం వెళ్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేలోకి చేరుకోవచ్చు. జంగారెడ్డిగూడెం సమీపంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి బయటకు వచ్చి పాత హైవేపైకి చేరుకుని ప్రయాణించొచ్చు.
టోల్ ఏజెన్సీ ఎంపిక కాగానే:
- ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో 12 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఓ టోల్ గేట్ నుంచి వాహనం హైవేలోకి ప్రవేశించాక ఎంత దూరం ప్రయాణిస్తుందో, అంత మేరకే టోల్ వసూలు చేస్తారు. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు 8 టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
- హైవేపై టోల్ వసూలు ఏజెన్సీని ఎంపిక చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ ఎంపికై, ఎన్‌హెచ్‌ఏఐతో ఒప్పందం చేసుకున్నాక వాహనాల రాకపోకలను అనుమతిస్తారు.
అనుమతించాలా? వద్దా?
సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ వైపు నుంచి ఏపీకి పెద్దఎత్తున వాహనాలు వస్తాయి. వీటిని గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు అనుమతించాలా? వద్దా? అని అధికారులు పరిశీలిస్తున్నారు. సంక్రాంతి సమయంలో టోల్ వసూలు చేయకుండానే వాహనాలను అనుమతిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఖమ్మం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్చించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు ఖమ్మం - దేవరపల్లి 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది పూర్తి అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య సుమారు 125 కి.మీ దూరం తగ్గనుంది. గతేడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. మొదట్లో ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అనుకున్న ఏలూరు - తూర్పు గోదావరి జిల్లా మధ్య కొంత భూమికి సంబంధించి వివాదం న్యాయం స్థానం పరిధిలో ఉండడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం వివాదం పరిష్కారం కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
5 ప్యాకేజీలుగా - గ్రీన్‌ఫీల్డ్ హైవే పైకి ప్రయాణికులు: గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం 5 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. నేషనల్ హైవే 365 బీజీ కింద నిర్మితమవుతున్న ఈ రహదారి ఖమ్మంలో మొదలై జిల్లాలోని దేవరపల్లిలో ముగుస్తుంది. వీటి మధ్య 162 కి.మీ మేర రహదారి నిర్మిస్తున్నారు. దేవరపల్లి మధ్య 8 టోల్ ప్లాజాలు, 9 పెద్ద, 51 చిన్న వంతెనలు నిర్మించారు. ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలం రేచర్ల, జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పైకి మాత్రమే ప్రయాణికులు చేరుకునే అవకాశం ఉంది.
125 కి.మీ. దూరం తగ్గినట్టే: సుమారు రూ.4,609 కోట్లతో 4 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలి అంటే విజయవాడ మీదుగా 676 కి.మీ మేర 12 గంటలు ప్రయాణించాలి. ఈ రోడ్డు పూర్తి అయితే సుమారు 125 కి.మీ.దూరం తగ్గుతుంది.
తుది దశకు ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు
గత రికార్డులను అధిగమించేలా హైవే నిర్మాణం - గిన్నిస్ రికార్డే లక్ష్యం!

