ETV Bharat / state

నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర - తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు - నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్‌ గుర్తింపు - వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టుతో వెలుగులోకి కీలక అంశాలు

Ghee_adulteration_case
Ghee_adulteration_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 30, 2025 at 8:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Key Turning Point in Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు ప్రత్యేత దర్యాప్తు బృందం గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అప్పటి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్రకోణాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ప్రస్తావించింది.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను 24వ నిందితుడిగా సిట్ చేర్చింది. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను సంప్రదించిన అప్పన్న నెయ్యి సరఫరా కంపెనీల వివరాలను తీసుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్‌ చేసిన అప్పన్న ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయలు కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించింది. కమీషన్‌ ఇవ్వడానికి బోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించగా డెయిరీపై అనర్హత వేటు వేసేలా చిన్న అప్పన్న కుట్ర పన్నారని సిట్ పేర్కొంది.

రూ.50 లక్షల వరకు ముడుపులు: భోలేబాబా డెయిరీని తనఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చారని సిట్ తెలిపింది. భోలేబాబా డెయిరీపై అనర్హత వేటు వేసేలా అజ్ఞాతవ్యక్తులతో పిటిషన్లు వేయించారని రిమాండ్ రిమార్డులో ప్రస్తావించింది. చిన్నఅప్పన్న కుట్రతో భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణ నిలిచిపోయిందని పేర్కొంది. చిన్నఅప్పన్న కుట్రతో నిష్క్రమించిన భోలేబాబా డెయిరీ స్థానంలోకి ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ సంస్థ వచ్చి చేరింది.

భోలేబాబా కంటే కిలోకు 138 రూపాయలు ఎక్కువ కోట్‌ చేసిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్‌ సంస్థ పోటీ లేకపోవడంతో తిరుమల లడ్డూ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో చిన్నఅప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు సిట్ గుర్తించింది. చిన్నఅప్పన్న బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన సిట్‌ అక్రమాలను నిగ్గుతేల్చింది. లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కుట్ర ఛేదన కోసం సిట్‌ చిన్నఅప్పన్నను కస్టడీకి కోరనుంది. అప్పన్న విచారణతో సిట్‌ మరికొందరిని నిందితులుగా చేర్చింది.

తిరుమల లడ్డూ కల్తీ కేసు - హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం - ముగ్గురికి బెయిల్‌