ETV Bharat / state

30 ఏళ్ల వన వాసం వీడి జన జీవన స్రవంతిలోకి - చొక్కారావు కోసం కుటుంబసభ్యుల ఎదురుచూపులు

మావోయిస్టు కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగుబాటు - దాదాపు 30 ఏళ్లు అడవిలోనే అజ్ఞాత జీవితం గడిపిన దామోదర్ - దామోదర్ లొంగుబాటుతో ఆనందంతో భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు

Key Maoist Leader Bade Chokka Rao Surrenders
Key Maoist Leader Bade Chokka Rao Surrenders (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 11:54 AM IST

2 Min Read
Choose ETV Bharat

Key Maoist Leader Bade Chokka Rao Surrenders : కారడవిలోనే 30 ఏళ్ల అజ్ఞాత వాసం. కుటుంబ సభ్యులకూ ఆచూకీ తెలియని వైనం. కనీసం ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి. అడవిలో ఎప్పుడు తుపాకులు గర్జించినా వీరికి భయమే. ఇన్నాళ్లకు వీరి వేదన ఇప్పుడు తీరింది. ఎదురు చూపులు ఫలించాయి. మంగళవారం మావోయిస్టు చరిత్రలోనే అత‌్యంత కీలక లొంగుబాటు జరిగింది. ఒకేసారి నలుగురు అగ్రనేతలు అరణ్యం వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పొలిట్​బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగన్నతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ కూడా ఉన్నారన్న సమాచారం వారి కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది.

30 ఏళ్లుగా అడవిలోనే అజ్ఞాతం : మలుగు జిల్లా త్వాడాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ తన పెద్ద నాన్న కుమారుడైన నాగేశ్వరరావు ప్రోద్బలంతో పీపుల్స్‌వార్ వైపు అడుగులు వేసి, దాదాపు 30 ఏళ్లు అడవిలోనే అజ్ఞాత జీవితం గడిపారు. ఏటూరునాగారం మహదేవపూర్ దళ సభ్యుడి నుంచి ప్రస్థానం మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఇల్లు విడిచి వెళ్లిన దామోదర్ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. అతని క్షేమ సమాచారం తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.

అడవిలో కాల్పులు జరిగినప్పుడల్లా అలజడి : ఎప్పుడు అడవిలో కాల్పులు జరిగినా, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన పడ్డారు. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్న క్రమంలో చొక్కారావు ప్రాణాలకు హాని జరుగుతుందని కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. ఉద్యమ బాట పట్టిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో లొంగిపోయి ఇంటికి తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. అనూహ్యంగా వారు కోరుకున్నట్లుగానే చొక్కారావు లొంగుబాటు సమాచారం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న తల్లి బతుకమ్మ, వదిన పైడక్క సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు.

లొంగిపోయావు. తొందరగా మా ఇంటికి రావాలని కోరుతున్నా. కుటుంబ సభ్యులను కలుసుకుని అందరం కలిసి బతకాలి. అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. అందరూ దామోదర్​ చనిపోయారని నమ్మారు. కానీ మేము మాత్రం నమ్మలేదు. ఎందుకంటే అతనికి భుజంపై పుట్టు మచ్చ ఉండటం నాకు గుర్తుండటంతో చనిపోలేదని నమ్మాను. - పైడక్క, దామోదర్ వదిన

నాగేశ్వరరావు మురళిలు ఎన్​కౌంటర్లలో మృత్యువాత : బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కుటుంబం నుంచి నలుగురికి ఉద్యమ చరిత్ర ఉంది. దామోదర్ పెదనాన్న కుమారుల్లో రాంబాబు అలియాస్ జనార్దన్ ముందుగా పీపుల్స్ వార్‌లోకి వెళ్లగా, ఆ తరువాత ఆయన సోదరులు నాగేశ్వర రావు, మురళి కూడా ఉద్యమ బాట పట్టారు. రాంబాబు చనిపోగా నాగేశ్వర రావు, మురళిలు ఎన్​కౌంటర్లలో మృత్యువాతపడ్డారు. వీరి చిన్నాన్న కుమారుడైన దామోదర్ బయ్యక్కపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం, గోవిందరావుపేటల్లో ఇంటర్ వరకూ చదివారు. కడుపున పుట్టిన కుమారున్ని కళ్లారా చూసుకోవాలని దామోదర్ తల్లి బతుకమ్మ వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తోంది. కనీసం తను పోయేముందైనా కుమారుడిని ఒక్కసారైనా చూస్తానా అని బాధ పడిన ఆ తల్లి హృదయం ఇప్పటికి కుదుటపడింది.

లొంగిపోతున్న మావోయిస్టులు - కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న ఆనందాలు

మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ - లొంగిపోయిన కీలక నేతలు బండి ప్రకాశ్, చంద్రన్న