రాష్ట్రంలో కొత్త మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ - 236 కి.మీ నుంచి 123 కి.మీలకు తగ్గిన ప్రాజెక్టు దూరం
తెలంగాణలో కొత్త మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ - భారత్ సిటీ-డ్రైపోర్ట్-హాలియా-వాడపల్లి మీదుగా బుల్లెట్ ట్రైన్ - హైదరాబాద్-చెన్నై ప్రాజెక్ట్ ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేసిన రైల్వేశాఖ

Published : May 30, 2026 at 1:31 PM IST
Key changes in Hyderabad-Chennai project alignment : హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌కి సంబంధించి ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణలో మొదటగా ఈ కారిడార్‌ను శంషాబాద్‌లో ప్రారంభించి బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు సర్వేలో ఎలైన్మెంట్ మారింది. ఇప్పుడు దీన్ని శంషాబాద్ నుంచి భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా ప్రతిపాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.
తగ్గుతున్న ప్రాజెక్టు దూరం : హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టు తెలంగాణలో మొదలై ఏపీ మీదుగా తమిళనాడులో ముగిసేలా రూపకల్పన చేశారు. మొదట ప్రతిపాదించిన మేరకు తెలంగాణలో ఈ ప్రాజెక్టు దూరం 236 కి.మీ ఉండగా ఇందుకు 790 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గుర్తించారు. ఈ కొత్త ఎలైన్మెంట్ ప్రకారం ఈ దూరం 123 కి.మీ మేర ఉంటుంది. ఇదే విషయాన్ని నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల తెలిపింది.
నాలుగు స్టేషన్లో రైళ్లు ఆగేలా ఏర్పాట్లు : శంషాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలో భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి ఈ నాలుగు ఏరియాలో బుల్లెట్ రైళ్లు ఆగేలా స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ ప్రతిపాదించింది. వీటిలో డ్రైపోర్ట్, వాడపల్లి, హాలియా స్టేషన్ల ప్రాంతాలన్నీ నల్గొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. గతంలో భారత్ సిటీ, వాడపల్లి మార్గంలో చెన్నై హైస్పీడ్ కారిడార్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే కోరింది. ఈ మేరకు కొత్త ఎలైన్‌మెంట్‌లో సర్వే చేస్తున్నట్లు సమాచారం.
డ్రైపోర్ట్‌కు స్పెషల్ స్టేషన్ : హైదరాబాద్-చెన్నై ప్రాజెక్టులో డ్రైపోర్ట్ స్టేషన్ ప్రతిపాదించడం ఓ ప్రత్యేకత ఉంది. ఇది తెలంగాణకు సముద్ర తీరప్రాంతం లేకపోవడంతో ఈ స్టేషన్న్ని ప్రత్యేకంగా సరకు రవాణా కోసం డ్రైపోర్టును ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలున్నాయి. ఈ నేపథ్యంలోనే హైస్పీడ్ రైలు స్టేషన్నూ ప్రతిపాదించారు. డ్రైపోర్టులో సముద్రతీరంలోని పోర్ట్ నుంచి జరిగే ఎగుమతులు, దిగుమతులు సరకులను నిల్వ చేయడం వంటివి అలాగే లోడింగ్ వంటి పనులు, కస్టమ్స్ క్లియరెన్స్‌లు కూడా నిర్వహిస్తారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు, దిగుమతుల రవాణా మరింత వేగవంతంగా జరిగేందుకు వీలుగా డ్రైపోర్ట్ ప్రణాళికలపై ప్రభుత్వం కొంతకాలంగా దృష్టి సారించింది.
చుట్టు పక్కల ఏమున్నాయంటే? : ప్రతిపాదిత స్టేషన్లకు సమీపంలోని ప్రాంతాలు, రహదారుల గురించి నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదకలో వివరాల ఇలా ఉన్నాయి.
డ్రైపోర్ట్ : ఎన్‌హెచ్-19కి 12 కి.మీ దూరం ఉంది. దానికి సమీప ప్రాంతం మాల్ 15 కి.మీలో ఉంటుంది.
హాలియా : స్టేట్ హైవే-167కి కి.మీ దూరం. ఈ స్టేషన్ హాలియా మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉంటుంది. దగ్గరి రైల్వేస్టేషన్ మిర్యాలగూడ 35 కి.మీ నల్గొండకు 55 కి.మీ దూరం ఉంది.
వాడపల్లి : స్టేట్ హైవే-167 కి 15 కి.మీ దూరంలో హాలియాకు 33, మిర్యాలగూడకు 60 కి.మీ దూరం ఉంటుంది.
హైస్పీడ్ రైల్వేకు కంట్రోల్ సెంటర్ ఇదే : విమానం దిగిన తర్వాత హైస్పీడ్ రైలు ఎక్కేందుకు వీలుగా శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్ ముందు భాగంగా హైస్పీడ్ రైల్వే స్టేషన్ ప్రతిపాదనలోకి వచ్చింది. అయితే ఇది భవిష్యత్తులో విమానాశ్రయం ముందు భాగంగా విస్తరణ జరుగుతుందని జీఎంఆర్ సంస్థ తెలిపింది. విమానం దిగాక హైస్పీడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు సుమారు 3 నుంచి 4 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంది. దీనికోసం మోనో రైళ్లను వినియోగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడే ఈ రైళ్ల ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్‌ను, ప్రధాన మెయింటెన్స్ డిపోను ఏర్పాటు చేస్తామని ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ తెలంగాణ సర్కారుకి వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె వైపు ప్రతిపాదించిన మార్గాల్లో నడిచే హైస్పీడ్ రైళ్లకు కంట్రోల్ సెంటర్‌గా కానుంది.
3 గంటల్లోనే హైదరాబాద్ టు ముంబయి - బుల్లెట్ ట్రైన్‌కు అంతా రెడీ!
"ప్రకృతి అందాల నడుమ హైస్పీడ్ రైలు ప్రయాణం" - హైదరాబాద్ టూ బెంగళూరు అడుగులు ముందుకు

