ETV Bharat / state

'కాళేశ్వరం లోపాలకు నేను ఏ విధంగా బాధ్యుడినో చెప్పాలి' : హైకోర్టుకు నివేదించిన కేసీఆర్

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ - కాళేశ్వరం లోపాలన్నింటికీ తనెలా బాధ్యుడో చెప్పాలని వెల్లడి - ఏ ప్రాతిపదికన కమిషన్‌ నిర్ధారించిందో చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ

KCR FILE PETITION IN HIGH COURT
KCR FILE PETITION IN HIGH COURT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 8:23 AM IST

|

Updated : February 28, 2026 at 10:45 AM IST

4 Min Read
Choose ETV Bharat

KCR Petition in HC against PC Ghosh Commission Report : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రణాళిక, డిజైన్ లోపాలన్నింటికీ తనను బాధ్యుడిగా జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఎలా నిర్ధారించిందో చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టుకు నివేదించారు. సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని పిటిషన్‌లో తెలిపారు. తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా నిర్ధరణ ఉన్నప్పుడు, అందుకు గల ప్రాతిపదికను సెక్షన్ 8 బీ, సీ ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉందన్నారు. పిటిషనర్‌కు వ్యతిరేకంగా అభియోగాలు మోపిన వారి వివరాలు చెప్పలేదన్న కేసీఆర్, వాంగ్మూలం ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఏర్పాటు చేసిన కమిషన్‌తో పాటు అదిచ్చిన నివేదికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.

ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో చెప్పాలి : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రణాళిక, డిజైనింగ్‌తో సహా అన్నింటికీ ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఏ ప్రాతిపదికన నిర్దారించిందో చెప్పాల్సిన అవసరం ఉందని కేసీఆర్ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా నిర్ణయించడం సరికాదని, దానికి సంబంధించిన ఆధారాలను అందించి వివరణ తీసుకున్నాకే నిర్ధారణకు రావాల్సి ఉందన్నారు. కమిషన్‌ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. కాళేశ్వరం బ్యారేజీల న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ కేసీఆర్, హరీశ్‌ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్‌, మాజీ ఐఏఎస్ ఎస్‌కే జోషీలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ విచారణ ప్రక్రియ సరైన విధివిధానాల ప్రకారం జరగలేదన్నారు. కమిషన్ ఏర్పాటు జరిగినపుడు నోటీసులు జారీ చేయొచ్చని, అందులో ఎవరైనా వచ్చి తమ వద్ద ఉన్న సమాచారం అందించవచ్చన్నారు. అదేవిధంగా ఎవరికైనా నోటీసులు, సమన్లు జారీ చేసే అధికారం సైతం కమిషన్‌కు ఉందన్నారు. అందులో భాగంగానే పిటిషనర్లకు సెక్షన్‌-5 కింద సాక్షిగా నోటీసు జారీ చేశారన్నారు. అయితే జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ సాక్షిగా పిలిచి, దోషిగా అభియోగాలు మోపిందన్నారు.

ఫిర్యాదు చేసిన వారి వివరాలు సైతం చెప్పలేదు : ప్రాజెక్టు స్థలాన్ని మార్చాలన్న సలహాలను పట్టించుకోకుండా స్థల ఎంపిక నుంచి ప్రాజెక్ట్ డిజైన్, టెండర్ల ఖరారు వరకు అన్నింటికీ కేసీఆర్ బాధ్యులని జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికలో నిర్ధారించిందని దామా శేషాద్రి నాయుడు తెలిపారు. ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం, సమయం వృథా అయిందని, కేవలం కమిషన్‌ వద్దనున్న ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే నిర్ణయానికి వచ్చిందన్నారు. పిటిషనర్‌ వ్యక్తిత్వం, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిర్ధారణ ఉన్నప్పుడు అందుకు ప్రాతిపదిక ఏంటో సెక్షన్‌ 8 బీ, సీ ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉందన్నారు. అభియోగాలకు సంబంధించి వివరణలు కోరాల్సి ఉందని, అంతేగాకుండా పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు సైతం చెప్పలేదన్నారు. వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశం పిటిషనర్‌కు ఇవ్వాలన్నారు. కమిషన్‌ ఆధారపడిన ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన ఒక్క కాగితం సైతం పిటిషనర్‌కు ఇవ్వలేదన్నారు. ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్‌ నిర్వహించడమే పిటిషనర్‌కు చేసిన మేలుగా చెబుతోందన్నారు. గతంలోనూ ప్రభుత్వం ఓ కమిషన్‌ ఏర్పాటు చేసిందని, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయాన్ని పరిగణించాలన్నారు. ప్రస్తుతం కేసు సీబీఐకి అప్పగించినందున విచారణ నిష్పలమన్న వాదన సరికాదని కోర్టుకు తెలిపారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రద్దు చేయాలి : విచారణ అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలను నిర్ధారించుకోకుండా అధికారులు ఒక బృందంగా ఏర్పడి 60 పేజీల సంక్షిప్త నివేదికను రూపొందించారని కేసీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ సంక్షిప్త నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి, మంత్రులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా మీడియాకు వెల్లడించారన్నారు. విచారణ కమిషన్ నివేదిక సమర్పించినట్లయితే దాన్ని అసెంబ్లీలో చర్చకు ఉంచాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా, పిటిషనర్‌కు కాపీ అందించకుండానే మీడియాకు వెల్లడించడం వెనక రాజకీయ కారణాలున్నాయన్నారు. అందువల్ల రాజకీయ దురుద్దేశాలతో ఏర్పాటు చేసిన కమిషన్‌తో పాటు అదిచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు.

ఐఏఎస్ స్మితా సభర్వాల్ తరఫున సీనియర్ న్యాయవాది జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయాల్లో ఆమె పాత్ర ఏమీ లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే విధులు నిర్వహించారని, ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. ఎస్​కే జోషి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది తరుణ్ రెడ్డి జ్యుడీషియల్ విచారణ చేసే పరిధి కమిషన్‌కు లేదన్నారు. విధుల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసినట్లు వెల్లడించారు. పిటిషనర్ల వాదన ముగియడంతో ప్రభుత్వ వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్ వస్తున్నారా? - ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత

కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు - హరీశ్​రావు, ఈటలకు కూడా

Last Updated : February 28, 2026 at 10:45 AM IST