చదువుతోపాటు ఆటల్లోనూ శిక్షణ - ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్న విద్యార్ధులు
50కిపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10కి పైగా పతకాలు సొంతం చేసుకున్న విద్యార్థులు - చదువుకున్న కళాశాలలోనే ఉద్యోగం సాధిస్తున్న విద్యార్ధులు - జాతీయ స్థాయిలో పతకాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 7:07 PM IST
Jawahar Bharathi College For Studies And Sports : విద్యాలయం అంటే కేవలం విద్యకే పరిమితం కాదు. క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి విశ్వవిద్యాలయం దాన్ని నిజం చేస్తోంది. చదువుతోపాటు వాలీబాల్, బాస్కెట్ బాల్, ఖోఖో, కబడ్డీ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తోంది. అక్కడ తర్ఫీదు పొందిన విద్యార్థులు ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకోగా మరికొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు. మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొంతమంది చదువు అయిపోయిందా, ఏదో ఒక జాబ్ తెచ్చుకున్నామా, ఇక లైఫ్ సెట్ అయినట్లేనని అనుకుంటుంటారు. కానీ ఈ విద్యార్థులు అందుకు భిన్నం, పునాది బలంగా ఉండాలని నిర్ణయించుకుని పాఠశాల విద్య పూర్తికాగానే క్రీడారంగంలో రాణించాలనే స్ఫష్టమైన లక్ష్యంతో కళాశాలలో చేరారు. విశాలమైన మైదానంలో నైపుణ్యం కలిగిన కోచ్‌ల పర్యవేక్షణలో నిరంతరం సాధన చేశారు. ఫలితంగా జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. అంతేకాదు కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు.
చదువుతోపాటు క్రీడల్లోనూ : వీరంతా నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాల విద్యార్ధులు. వీరంతా గ్రామీణ నేపథ్యం కలిగిన వారే. ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఇక్కడి విశాలమైన మైదానంలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చిత్తూరు, విజయనగరం వంటి రాష్ట్రస్థాయిలోనే కాదు కేరళ, తమిళనాడు, భువనేశ్వర్ ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ మెడల్స్ సాధించారు.
"ఏడాది పొడవునా ఇక్కడ మహిళలు, పురుషుల జట్టులవారీగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తుంటారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు ఆటల్లో రాణిస్తున్నారు. శారీరకంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నేటి యువత అథ్లెటిక్స్ వైపు ఆసక్తి చూపాలి. నైపుణ్యం ప్రదర్శిస్తే ఉద్యోగ అవకాశాలూ ఉన్నాయి. ఆ దిశగా సాధన చేసి జాబ్ సంపాదించడమే నా లక్ష్యం" - తరుణ్, క్రీడాకారుడు
50కిపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని : సీనియర్లలాగే తాము పీఈటీ, పోలీస్, ఆర్మీ వంటి ఉద్యోగాల్లో తాము చేరాలని ఆసక్తి కనబరుస్తున్నారీ విద్యార్థులు. ప్రతి విద్యార్థి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు 50కిపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10కి పైగా పతకాలు సొంతం చేసుకున్నారు. సౌత్‌జోన్, స్టేట్ మీట్, జాతీయ స్థాయిలోనూ పతకాలు దక్కించుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహంతో ఈ పతకాలు సాధ్యమయ్యాయని క్రీడాకారుడు బాలాజీ అంటున్నాడు.
అవార్డులు, ఉద్యోగాలు : చదువుకున్న కళాశాలలోనే ఉద్యోగం సాధించడం పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం ఆనందంగా ఉందని కోచ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు వందలాది విద్యార్థులు బాస్కెట్‌బాల్, వాలీబాల్ వంటి క్రీడల్లో సత్తా చాటుతూ అవార్డులు, ఉద్యోగాలు సాధించడం పట్ల ప్రసాద్ రెడ్డి జవహర్ భారతి పీడీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులు తెలిపారు. స్పోర్ట్స్ వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, సమాజం పట్ల బాధ్యతగా ఉంటామని పేర్కొన్నారు.
ఇంటి వద్దకే నిపుణుల సేవలు - 'హోం ట్రయాంగిల్ యాప్' సర్వీసెస్
సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థుల ఆవిష్కరణలు - 'న్యూరల్ టోర్నడో' పేరుతో ప్రదర్శన

