ఈసీ నోటీసులకు సమాధానం చెప్పండి - కల్వకుంట్ల కవితకు సూచించిన దిల్లీ హైకోర్టు
పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత - తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరిన కవిత - ఈసీ నోటీసుకు ముందు సమాధానం చెప్పాలన్న హైకోర్టు

Published : July 7, 2026 at 1:50 PM IST
|Updated : July 7, 2026 at 2:57 PM IST
Kavitha Approaches Delhi High Court : టీఆర్ఎస్ పేరు విషయంలో ఎన్నికల కమిషన్ అభ్యంతరాలపై కల్వకంట్ల కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టీఆర్‌ఎస్ పేరును తన పార్టీ పేరుగా ఖరారు చేయాలని పిటిషన్లో ఆమె విజ్ఞప్తి చేశారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం ముందుగా జూన్ 23న ఈసీ ఇచ్చిన నోటీసుకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ సమయంలో ఆదేశాలు జారీచేస్తే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేని తెలిపింది.
అప్పుడే కోర్టుకు రండి : టీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్‌పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయని కోర్టు గుర్తు చేసింది. అభ్యంతరాలు ఏమీ ఇవ్వలేదని, వ్యక్తిగతంగా వాదనలకు అవకాశం ఇవ్వలేదని కవిత న్యాయవాదులు వాదించారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని ఈసీ తెలిపింది. టీఆర్‌ఎస్ అనేది ఒకే పేరుగా కనిపిస్తుందని ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, తెలంగాణ రక్షణ సమితి పేరు టీఆర్‌ఎస్‌కు అర్థం వచ్చేలా ఉందని హైకోర్టు పేర్కొంది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని, ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు న్యాయస్థానం సూచించింది.
ఆ పేరుకు విశిష్టమైన ప్రత్యేక గుర్తింపు వచ్చింది : టీఆర్ఎస్ పార్టీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. తమ అభ్యంతరాల్లో కీలక అంశాలను ప్రస్తావనకు తీసుకువచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పేరు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, 14 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఆ పేరుకు విశిష్టమైన ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొంది.
పార్టీ పేరు మారి భారత రాష్ట్ర సమితిగా మారినా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు తమ పార్టీని టీఆర్ఎస్గానే పరిగనిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో అదే సంక్షిప్త నామాన్ని మరో రాజకీయ పార్టీకి కేటాయిస్తే ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కవిత పార్టీ పేరుపై ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు, శ్రేణులు, అనుచరులవే భారీ స్థాయిలో అభ్యంతరాలు వెళ్లాయి. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు వాడడంపై రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాజ్య సమితి పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలోనూ టీఆర్ఎస్ : కవిత పార్టీ ప్రకటనకు ముందే టీఆర్ఎస్ పేరుపై మరో అప్లికేషన్ ఈసీకి చేరింది. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన సంస్థ-టీఆర్ఎస్ సంక్షిప్త నామాన్ని కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ సంస్థ తరఫున దయానంద్ మహాదేవ్ మామ్ డ్యాల్ అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి అప్లై చేసినట్లు సమాచారం.
కవితకు ఈసీ లేఖ : కవిత ఏప్రిల్ 25న ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కోరుతూ కవితకు లేఖను రాసింది. అభ్యంతరాలపై లేఖను పంపిన ఈసీకి తెలంగాణ రక్షణ సేన సమాధానాలు పంపింది.
కవితకు టీఆర్‌ఎస్ పేరు దక్కేనా? - పార్టీ పేరుపై కొనసాగుతున్న ఉత్కంఠ
TRSపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు - వేరే పేరు సూచించండి : కవితకు ఈసీ లేఖ

