ETV Bharat / state

కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పరీక్షలు - రేపు మేడిగడ్డ వద్ద పురోగతిని పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్‌

పునరుద్ధరణ డిజైన్ల కోసం 13 రకాల పరీక్షలు - ఈ సీజన్‌లో పరీక్షలను పూర్తి చేసే దిశగా అధికారుల చర్యలు - కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీడబ్ల్యూపీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో పరీక్షలు

Kaleshwaram Project
Kaleshwaram Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 9, 2026 at 8:20 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kaleshwaram Project Works : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 రకాల పరీక్షలు పూర్తి చేయాల్సి ఉండగా, పునరుద్ధరణ డిజైన్ల కోసం అవసరమైన పరీక్షలను ఈ సీజన్‌లో పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రేపు మేడిగడ్ద వద్ద పురోగతిని పరిశీలించడంతో పాటు సమీక్ష నిర్వహించనున్నారు.

కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పరీక్షలు : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పరీక్షలు కొనసాగుతున్నాయి. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) సిఫారసులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు చోట్లా అవసరమైన పరీక్షలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీడబ్ల్యూపీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యత, పునాది స్థిరత్వంపై మొత్తం 13 రకాల సాంకేతిక పరీక్షలు, అధ్యయనాలు జరుగుతున్నాయి.

నెలాఖరులోగా పరీక్షలు పూర్తి చేయాలని గడువు : కాంక్రీట్ నాణ్యత, స్ట్రక్చరల్‌ ఇంటెగ్రిటీని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఎన్​డీటీ పరీక్షలు మూడు చోట్లా మొత్తం పూర్తయ్యాయి. గేట్ల మందం, స్థితిని అంచనా వేసే పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. వీటిని నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. బోర్‌హోల్ లాగింగ్ ద్వారా కాంక్రీట్ సాంద్రత, ఎలాస్టిసిటీ పరీక్షలు మూడు బ్యారేజీల్లో చేయాల్సి ఉంది. సీపేజ్ కారణాలు అన్వేషించి, విశ్లేషణ కోసం కీలకమైన జియో టెక్నికల్ అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

పరీక్షలు చేసే వాహనాల్లో సాంకేతిక సమస్యలు : మేడిగడ్డలో 37 పరీక్షల్లో 20 పూర్తికాగా, అన్నారంలో 20లో 6, సుందిళ్లలో 24లో 14 పూర్తయ్యాయి. పునరుద్ధరణ డిజైన్ల కోసం ఈ పరీక్షలు కీలకంగా భావిస్తున్నారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు ఈ పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పరీక్షల కోసం వినియోగిస్తున్న వాహనాలు, యంత్రాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అన్నారం వద్ద సమస్య అధికంగా ఉన్నట్లు సమాచారం.

ఎక్కువ సంఖ్యలో వేయాల్సి ఉన్న బోర్ హోల్స్ : కాంక్రీట్ కోర్ నమూనాల సామర్థ్య పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. త్రీడీస్ట్రెస్ అనాలిసిస్ కోసం అవసరమైన సమాచార సేకరణ జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ అధ్యయనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీకెంట్ పైల్స్ సామర్థ్యం నిర్ధారణ కోసం చేయాల్సిన జియో ఫిజికల్ పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. ఆనకట్టలకు ముందు, వెనక వైపు పెద్ద సంఖ్యలో బోర్ హోల్స్ వేసి క్రాస్‌హోల్, ప్యారలల్ సిస్మిక్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

ఈ తరహా ఒక్క మేడిగడ్డలోనే 417 బోర్ హోల్స్ వేయాల్సి ఉంటుంది. అన్నారంలో 162, సుందిళ్ల వద్ద 204 బోర్ హోల్స్ వేయాలి. ఎక్కువ సంఖ్యలో బోర్ హోల్స్ వేయాల్సి ఉన్నందున నీటి పారుదల శాఖ ఇంజనీర్లు ఈ విషయమై ఎన్​డీడబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ అనుమతి కోసం చూస్తున్నారు. రాఫ్ట్ కింద ఎక్కడ రంధ్రాలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ జియో ఫిజికల్ పరీక్షలు మేడిగడ్డలో 85కు గాను 63, అన్నారంలో 66కు గాను 53, సుందిళ్లలో 74కు గాను 52 పరీక్షలు పూర్తయ్యాయి.

నేల బలం, పీడన లక్షణాల పరీక్షలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇందుకోసం సీపీటీయూ పరికరాల సమీకరణ జరుగుతోంది. వన్ డీ హైడ్రాలిక్ మోడల్ అధ్యయనాలు మేడిగడ్డ, అన్నారం వద్ద పూర్తి చేసి సీడబ్ల్యూపీఆర్​ఎస్​కు వివరాలు అందించారు. సుందిళ్ల డేటా సమర్పించాల్సి ఉంది. టూడీ హైడ్రాలిక్ మోడల్ అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

మేడిగడ్డను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్‌ : వర్షాలు వచ్చి నదిలో ప్రవాహాలు పెరిగే వరకు వీలైనన్ని ఎక్కువ పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు రూపొందించేందుకు అవసరమైన పరీక్షలు పూర్తి చేసే అంశంపై ఎక్కువగా దృష్టి సారించారు. తద్వారా వచ్చే వర్కింగ్ సీజన్ వరకు డిజైన్లు సిద్ధం చేయవచ్చని భావిస్తున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు, ఇంజినీర్లతో కలిసి రేపు మేడిగడ్డలో పర్యటించనున్నారు. పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు మూడు ఆనకట్టల పరీక్షల పురోగతిని మంత్రి సమీక్షిస్తారు.

కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతీ అంత్యపుష్కరాలు - నేటి నుంచి జూన్‌ 1 వరకు

కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణ - నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు