చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? - పోలీసులకు హైకోర్టు ఆదేశం
మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు - 18 రోజులుగా సాగుతున్న ముమ్మర గాలింపు - రంగంలోకి వందలాది మంది సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ - అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా లభించని ఆనవాళ్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 24, 2026 at 10:09 AM IST
High Court on Tuni Child Missing : కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యల వివరాలు, ప్రస్తుత దర్యాప్తు పరిస్థితిపై సమగ్ర స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. అదృశ్యమైన పిల్లల దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP) జ్ఞానేశ్వరి విషయంలో పాటించారా? లేదా? అనే విషయాన్ని చెప్పాలంది.
ఈ మేరకు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, తుని గ్రామీణ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం (నిన్న) ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు విఫలమయ్యారు పిటిషనర్ వాదన: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై రెండు వారాలు గడుస్తున్నా ఆచూకీ కనుగొనడంలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ న్యాయవాది జి.శ్రీకాంత్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు అనుసరిస్తున్న విధానాలను కోర్టు ముందు ఉంచేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్/న్యాయవాది శ్రీకాంత్ నేరుగా తన వాదనలను వినిపించారు.
సమయం కావాలన్న ప్రభుత్వ న్యాయవాది: పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (GP) జయంతి వాదనలు వినిపిస్తూ బాలికను కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు.
చిన్నారి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం: చిన్నారి జ్ఞానేశ్వరిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు అన్నారు. ఆయన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారి ఆచూకీ కోసం చేస్తున్న గాలింపు చర్యలు, దర్యాప్తుపై ఎప్పటికప్పుడు కమిషన్ ఆరా తీస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు వివిధ కోణాల్లో చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారని వివరించారు.
18 రోజులు గడుస్తున్నా దొరకని ఆధారం: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి 18 రోజులు గడుస్తున్నా, వందలాది మంది సిబ్బంది గాలిస్తున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు, ప్రత్యేక బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది సైతం రంగంలోకి దిగి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అదృశ్యమైన రోజున చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు శునకం కొన్ని రోజుల తర్వాత గ్రామానికి తిరిగి రావడం, ఆ వెంటనే అది మృతి చెందడం ఈ కేసులో పెను అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అపహరణ (కిడ్నాప్) కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
జల్లెడ పట్టినా దొరకని ఆధారాలు: చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్తులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి చుట్టుపక్కల ఉన్న కొండలు, తోటలు, చెరువులు, దట్టమైన అడవి ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ప్రత్యేక జాగిలాలు 'రాక్సీ', 'మ్యాక్స్'లను రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరాలను కూడా విస్తృతంగా వినియోగించారు. అయినప్పటికీ పాపకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లూ దొరకలేదు. ఒకవేళ చిన్నారిపై అడవి జంతువులు దాడి చేసి ఉంటే దుస్తులు లేదా ఇతర ఆధారాలైనా లభించేవని, కానీ కొండ ప్రాంతాల్లో ఎక్కడా క్రూరమృగాలు లేదా కొండచిలువల సంచార ఆనవాళ్లు కూడా కనిపించలేదని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరో కావాలనే పాపను అపహరించి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
కొలిక్కి రాని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు - శతవిధాలా ప్రయత్నిస్తున్న రెస్క్యూ టీమ్స్
13 రోజులైనా దొరకని ఆనవాళ్లు - పెంపుడు కుక్క మృతితో చిక్కుముడిగా మారిన 'జ్ఞానేశ్వరి' కేసు

