ఒక రోజు కస్టడీకి ఎమ్మెల్సీ అనంతబాబు - కీలక సమాచారం రాబట్టనున్న పోలీసులు
ఒక రోజు కస్టడీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు - కాకినాడ పోలీసులకు అనుమతి ఇచ్చిన మొబైల్ కోర్టు - రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్‌లో ఉన్న అనంతబాబు-అనంతబాబు నుంచి రేపు కీలక సమాచారం రాబట్టనున్న పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2026 at 4:04 PM IST
Kakinada Mobile Court Grants one Day Custody of Anantha Babu : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబును విచారించేందుకు కాకినాడ పోలీసులకు ఒక రోజు కస్టడీకి మొబైల్ కోర్టు అనుమతినిచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై ఏప్రిల్ 24న అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఏప్రిల్ 25న మొబైల్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి అనంతబాబుకు 14రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
రిమాండ్‌లో ఉన్న అనంతబాబును విచారించేందుకు తమకు అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తాజాగా ఒకరోజు కస్టడీకి అనుమతినిచ్చింది. రేపు(మంగళవారం) ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడకు అనంతబాబును తరలించనున్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లేదా డీఎస్పీ కార్యాలయంలో అనంతబాబును విచారించి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు.
బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు వాయిదా : మరోవైపు డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను చంపుతానని బెదిరించడం ద్వారా బెయిల్ నిబంధనలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉల్లంఘించినందున ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది. తీర్పును ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య అనంతరం 218 రోజులపాటు జైల్లో ఉన్న అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
ఇటీవల సాక్షులను బెదిరించినందున బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు పిటిషన్ వేయగా ఇప్పటికే వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పు వస్తుందని అంతా ఆశించారు. అయితే సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న అనంతబాబు తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు జడ్జి వాదనలు విన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వవద్దని స్పెషల్ పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు.
సాక్షులకు అనంతబాబు వీడియో కాల్ : తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే చంపి శవాలు దొరకకుండా చేస్తానంటూ సాక్షులను అనంతబాబు వాట్సప్ వీడియో కాల్ ద్వారా బెదిరించారని డబ్బిచ్చి ప్రలోభాలకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని న్యాయమూర్తిని పీపీ కోరారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న అనంతబాబు తరపు న్యాయవాదులు సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబు ప్రమేయం ఎక్కడా లేదని కోర్టుకు తెలిపారు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు.
తాజాగా అనంత బాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న కాకినాడ మొబైల్ కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతినిచ్చింది.
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా - కస్టడీ కోరిన పోలీసులు
'తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే చంపి శవాలు మాయం చేస్తా' - అనంతబాబు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు

