ETV Bharat / state

దేశంలోనే పొడవైన గాజు వంతెన - విశాఖలో డిసెంబర్​ 1న ప్రారంభం

50 మీటర్ల పొడవు - ఒకేసారి 500 టన్నుల భారం మోసే కెపాసిటీ - నగరానికి వచ్చే పర్యాకులకు సరికొత్త అనుభూతి

kailasagiri Glass Bridge in Visakhapatnam
kailasagiri Glass Bridge in Visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 29, 2025 at 1:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kailasagiri Glass Bridge in Visakhapatnam: కూటమి ప్రభుత్వం టూరిజం రంగానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో పెద్దఎత్తున పర్యాటక ప్రాజెక్టులు చేపడుతోంది. పర్యాటక వనరులైన సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాల దగ్గర నుంచీ పురాతమైన కట్టడాల వరకు సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలున్న ప్రాంతాలతో పాటు వేర్వేరు చోట్ల విభిన్నమైన వాటికి మరింత గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ క్రమంలోనే విశాఖ పర్యాటకంలో కైలాసగిరి కీలకపాత్ర పోషించే విధంగా పొడవైన గాజు వంతెన నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. పర్యాకులకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. కైలాసగిరిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గాజు వంతెన డిసెంబరు 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన విశేషాలు గురించి తెలుసుకుందాం!

ఇక గాజు వంతెన విషయానికి వస్తే దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 40 MM మందం కలిగిన ల్యామినేటెడ్​ గాజు వినియోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేశారు. కైలాసగిరిపై 50 మీటర్ల పొడవుతో దీని నిర్మాణం పూర్తి అయింది. ఒకేసారి 500 టన్నుల భారం మోయగలదు. అయినా భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందికి మాత్రమే అనుమతించనున్నారు. దేశంలోనే నడిచేందుకు అత్యంత పొడవైన గాజు వంతెనగా ఇది పేరొందింది. ఈ వంతెనపై పర్యాటకులు ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. ఇది ఎంతో థ్రిల్ పంచేందుకు పర్యాటకులకు మరో రెండు రోజుల్లో అందుబాటుల్లోకి వచ్చేస్తుంది.

ప్రతిష్ఠాత్మకమైన గాజు వంతెనను ఎంపీ ఎం. శ్రీభరత్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నట్లు వీఎంఆర్​డీఏ ఛైర్మన్​ ఎంవీ ప్రణవ్​గోపాల్ తెలిపారు. ఈ వంతెన పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుందన్నారు. వీఎంఆర్​డీఏ, ఆర్​జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ.7 కోట్లతో దీన్ని నిర్మించారు. దేశంలో ఇప్పటివరకు 40 మీటర్ల పొడవైన గాజు వంతెనగా కేరళ గుర్తింపు పొందింది. అయితే దాన్ని తాము అధిగమించామన్నారు. రాత్రివేళల్లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్తు కాంతులతో మెరిసేలా తీర్చిదిద్దామని అన్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా పలుమార్లు పరిశీలించి మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రవేశ రుసుము ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, నిర్వాహకులతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: విశాఖలోని జిప్​లైనర్, స్కైసైక్లింగ్, రోప్‌వే, అద్దాల ఏసీ రైలుబండికి ఒడిశా, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు. ఇప్పుడు గాజు వంతెన కూడా అందుబాటులోకి రావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా వీఎంఆర్డీఏకు ఆదాయం కూడా సమకూరుతుంది. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

దేశంలోనే పొడవైన 'గాజు వంతెన' - ఎక్కితే ఇక గాల్లో తేలినట్టే!

విశాఖలో మరో పర్యాటక ఆకర్షణ - దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన