RTI సమాచారం రావడానికి దశాబ్ద కాలం - పీహెచ్‌డీ స్కాలర్‌కు ఎదురైన వింత అనుభవం
సామాన్యుడి చేతిలో వజ్రాయుధం సమాచారహక్కు చట్టం. అయినా ఇది సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, సమాచారం అందజేతతో దరఖాస్తుదారులకు అన్యాయం జరుగుతోంది.

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2026 at 11:47 AM IST
Kadapa PhD scholar RTI Queries Replay : ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాలను ప్రోదిచేయడమే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం పురుడు పోసుకుంది. మన దేశంలో సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005 నుంచి అమలవుతోంది. పౌరులు సర్కార్ చర్యలు, నిర్ణయాలు, ఖర్చుల గురించి సమాచారం కోరవచ్చు. కొన్ని సున్నితమైన సంస్థలు (రక్షణ, నిఘా) మినహా దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది. సమాచారాన్ని ఇవ్వడం సర్కార్ బాధ్యతయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ఇది ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

దీన్ని ఉపయోగించుకుని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడమేకాక అవినీతిని సైతం అరికట్టొచ్చు. పారదర్శకతను పెంపొందించే విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మన సమాచారం హక్కు చట్టం పేరుగాంచింది. సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా కీర్తి గడించింది. అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ చట్టం నీరుగారిపోతోంది. పత్రాల్లోని సమాచారం ప్రజల ముందుకొస్తే తమ అవినీతి పీఠాలు కదిలిపోతాయన్న భయం కొందరిదైతే, సామాన్యుల ప్రశ్నలకు తాము సమాధానమిచ్చేది ఏమిటన్న అహంభావం మరికొందరిది! ఫలితంగా కోరిన సమాచారమివ్వడంలో కాలయాపనలు, కొర్రీలు వేస్తున్నారు. దీంతో బ్రహ్మాస్త్రంగా భావించే ఈ చట్ట సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. తద్వారా సమాచారం అందజేతతో దరఖాస్తుదారులకు అన్యాయం జరుగుతోంది.

RTI Completes 21 Years : సమాచారం హక్కు చట్టం సెక్షన్ 6 ద్వారా వివిధ శాఖలకు అందే దరఖాస్తులను ప్రజా సమాచార అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. అయినా, నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. ఏటా చట్టంపై శిక్షణ పొందుతున్న సమాచార అధికారులు, నిబంధనలను మాత్రం క్షేత్రస్థాయిలో తుంగలో తొక్కుతున్నారు. ఇందుకు సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. తాజాగా ఓ రీసెర్చ్ స్కాలర్‌కు వింత అనుభవం ఎదురైంది. సమాచార హక్కు చట్టం ద్వారా 2015లో కోరిన సమాచారాన్ని ఏకంగా దశాబ్ద కాలం తర్వాత 2026లో వరుసగా రిజిస్టర్డ్, స్పీడ్ పోస్టుల ద్వారా అతనికి పంపడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) జర్నలిజం విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ తుమ్మలూరు సురేశ్‌బాబు ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్-2005 ఏ స్టడీ ఇన్ కడప డిస్ట్రిక్ట్’ అనే అంశంపై 2012లో పరిశోధన ప్రారంభించారు. తన పీహెచ్‌డీ రీసెర్చ్‌లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై సమాచారం కోరుతూ 2015లో సెక్షన్ 6(1) కింద దరఖాస్తులు చేశారు.


అప్పట్లో కొన్ని శాఖలు మాత్రమే స్పందించాయి. మెజారిటీ కార్యాలయాలు ఆ దరఖాస్తులను పట్టించుకోలేదు. దీంతో సురేశ్‌బాబు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారంతో తన పరిశోధనా గ్రంథాన్ని పూర్తి చేశారు. అనంతరం యూనివర్సిటీకి సమర్పించి 2017 సెప్టెంబర్ 5న యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) నుంచి అతను డాక్టరేట్ (పీహెచ్‌డీ) కూడా అందుకున్నారు. కానీ ఇక్కడే ఊహించని వింత అనుభవం ఎదురైంది. అయితే అప్పుడు దరఖాస్తు చేసినప్పుడు సమాచారం ఇవ్వని 46 శాఖల అధికారులు ఇప్పుడు గత రెండు నెలల నుంచి సమాచారం తెలియజేస్తూ సురేశ్‌బాబుకు రిజిస్టర్డ్, స్పీడ్ పోస్టులు పంపుతున్నారు. దీంతో ఈ చట్టం అమలులో వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణగా నిలిచింది.
లేని కారును సృష్టించి - నెలకు రూ. 25 వేల చొప్పున ఏడేళ్ల పాటు మోసం

