ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు - ప్రమాణం చేయించిన గవర్నర్
ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు - మల్లికార్జునరావుతో ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ - ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 1:15 PM IST
Justice Mallikarjuna Rao Takes oath as AP Lokayukta : ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పలువురు న్యాయాధికారులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు లోక్‌భవన్‌కి తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావును ఐదేళ్ల కాలానికి లోకాయుక్తగా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని లోకాయుక్త ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ నియామకానికి ఆమోదం తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నేపథ్యం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు స్వస్థలమైన జస్టిస్ మల్లికార్జునరావు 1964 జనవరి 19న పుల్లేటికుర్రులో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీరామచంద్రమూర్తి, రమణ. పదో తరగతి వరకు నేదునూరులో, బీఎస్సీ అమలాపురంలో పూర్తి చేశారు. రాజమహేంద్రవరంలోని జీఎస్‌కేఎం న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1988లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
1994లో బాపట్ల జిల్లా పర్చూరులో అదనపు డిస్ట్రిక్ట్ మున్సిఫ్‌గా న్యాయ సేవలు ప్రారంభించిన ఆయన ధర్మవరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది మచిలీపట్నం, ఏలూరు జిల్లాల్లో పనిచేశారు.
2022 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మల్లికార్జునరావు. 2024 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 18న పదవీ విరమణ చేసిన ఆయన తాజాగా రాష్ట్ర లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఫిర్యాదు - కేసు నమోదులో నిబంధనలు పాటించాలన్న హైకోర్టు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన - తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి దక్కిన అరుదైన గౌరవం

