'నకిలీ మద్యం కేసులో జోగి సోదరులదే ముఖ్యపాత్ర' -ఛార్జిషీట్‌లో సిట్ కీలక వివరాలివే
సాంకేతిక ఆధారాలతో జోగి, అద్దేపల్లి మైత్రీబంధం గుట్టురట్టు - నకిలీ మద్యం వ్యవహారంలో కలిసే కుట్రకు పాల్పడ్డారని తేల్చిన సిట్- కాల్ డీటైల్ రికార్డ్స్ (సీడీఆర్)ను విశ్లేషించిన సిట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 1:30 PM IST
Jogi Ramesh in AP Fake Liquor Case : నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు తమకు తెలియదని వారితో సంబంధం లేదని జోగి సోదరులు బుకాయించినా సిట్ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. ఇవి జోగి, అద్దేపల్లి సోదరుల బంధాన్ని బయటపెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్, రాము ముఖ్యపాత్ర పోషించారని కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లో సిట్ పేర్కొంది. ఫోన్, వాట్సప్ కాల్స్‌లో తరచు మాట్లాడుకునేవారని తేలింది.
టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలో : ఈ కేసులో నిందితుల కాల్ డీటైల్ రికార్డ్స్ (సీడీఆర్)ను సిట్ విశ్లేషించింది. ఇందులో ఎక్కువమంది నిందితుల టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడినుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక, కుట్రకు తెరతీశారని తేలింది. కాల్ రికార్డులు, కామన్ లొకేషన్లు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి.
2025 ఏప్రిల్ 7న.. జనార్దన్‌రావు (ఏ1), జగన్మోహన్‌రావు (ఏ2), రవి (ఏ4), జోగి రమేష్ (ఏ18), రాము (ఏ19)లు ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారు. 2025 మే 5న.. ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం టవర్ లొకేషన్ పరిధిలో ఏ1, ఏ2, ఏ4, ఏ18, ఏ19 ఉన్నారు. 2025 జూన్ 6, జులై 17, జులై 27 తేదీల్లో వీరంతా ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్‌లో ఉన్నారు. - 2025 సెప్టెంబరు 23న.. ఏ1, ఏ18, ఏ19లు ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ, ఏఎన్‌ఆర్ బార్ టవర్ల పరిధిలో ఉన్నట్లు సీడీఆర్ డేటాలో తేలింది.
ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ - ఒకే లొకేషన్ : 2023 అక్టోబరు 19 నుంచి 2025 సెప్టెంబరు 13 వరకు జోగి రాము, అద్దేపల్లి జనార్దన్‌రావు మధ్య 16 ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్‌రావు నుంచి రాముకు ఫోన్ వెళ్లింది. అదే సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్‌లో ఉన్నారు. 2024 అక్టోబరు 1న, 2025 సెప్టెంబరు 1న, 2025 సెప్టెంబరు 13న ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయాల్లోనూ జోగి రమేష్ అదే లొకేషన్‌లో ఉన్నట్లు తేలింది.
పెద్దఎత్తున లావాదేవీలు : అద్దేపల్లి జనార్దన్‌రావు (ఏ1), అద్దేపల్లి జగన్మోహన్‌రావు (ఏ2) జోగి రమేష్ (ఏ18), అతని సోదరుడు రాము (ఏ19) మధ్య పెద్దఎత్తున లావాదేవీలు సాగాయి. జోగి రమేష్ ఆదేశాల మేరకే రాము నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. విడతలవారీగా రూ.45.06 లక్షలను అద్దేపల్లి సోదరులు రాముకు అందించారు.
యూపీఐ లావాదేవీ : 25.10.2020న అద్దేపల్లి జనార్దన్‌రావు ఎస్‌బీఐ ఖాతా నుంచి జోగి రాముకు రూ.2వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశారు.
చెల్లింపుల రూటింగ్‌లో రవి పాత్ర కీలకం : ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్‌రావు (ఏ1), జగన్మోహన్‌రావు (ఏ2)కు, మిగిలిన నిందితులకు మధ్య ఎన్.రవి (ఏ4) ఆర్థిక మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇద్దరి తరఫున చెల్లింపులను పర్యవేక్షించారు. స్పిరిట్, ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్‌లకు, మూతలు, సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమార్, ధారబోయిన ప్రసాద్ నకిలీ లేబుళ్లను తయారు చేసి సరఫరా చేసిన తలారి రంగయ్య, తాండ్ర రమేష్, అల్లాబక్ష్, చెక్కా సతీష్‌లకు యూపీఐ, బ్యాంకుఖాతా బదిలీల ద్వారా నగదు పంపారు.
నేరుగా అందజేసిన లావాదేవీలు : 1.9.22న జనార్దన్‌రావు.. ఏఎన్‌ఆర్ బార్ ఖాతా నుంచి రూ.20 లక్షలు డ్రా చేశారు. 21.9.22న జోగి రాముకు జనార్దన్‌రావు ఫోన్ చేసి.. ఇబ్రహీంపట్నం వద్ద ఈ మొత్తాన్ని అందజేశారు.12.11.22న జనార్దన్‌రావు రాముకు ఫోన్‌చేశారు. మర్నాడు రూ.2.84 లక్షలను జగన్మోహన్‌రావు రాముకు అందజేశారు. 3.3.23న జోగి రాముతో జనార్దన్‌రావు మాట్లాడారు. 14.3.23న జగన్మోహన్‌రావు రూ.5 లక్షల నగదును ఖాతా నుంచి డ్రా చేసి రాముకు ఇచ్చారు. 19.10.23, 20.10.23, 23.10.23 తేదీల్లో జోగి రాముతో జనార్దన్‌రావు మాట్లాడాడు. 25.10.23న జగన్మోహన్‌రావు బ్యాంకుఖాతా నుంచి రూ.4 లక్షలు డ్రా చేసి.. ఆ మొత్తాన్ని జోగి రాముకు అందించారు. 20.2.24న, 8.4.24న జోగి రాముతో ప్రధాన నిందితుడు మాట్లాడారు. ఏఎన్‌ఆర్ బార్ ఖాతా నుంచి రూ.9.20 లక్షలు 5.3.24న డ్రా చేసి జోగి రాముకు ఇచ్చారు. 1.9.25, 9.9.25, 13.9.25 తేదీల్లో జనార్దన్‌రావు తిరిగి రాముతో కాంటాక్ట్ అయ్యారు. రూ.4 లక్షలు ఇచ్చారు.
స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి ఖాతాలోకి భారీ మొత్తాల్లో నగదు మళ్లింపులు -సిట్ నిర్ధారణ
నకిలీ మద్యం కేసు - జోగి రమేష్ సోదరుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

