ETV Bharat / state

గుడ్​న్యూస్​ - టీటీడీలో పలు పోస్టుల భర్తీకి, ప్రమోషన్లకు పచ్చజెండా

ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామకాలు, సర్వీసు నిబంధనల సవరణలు - ప్రమోషన్లకు ఎట్టకేలకు మోక్షం - పాలకమండలి ఆమోదంతో ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు

Tirumala Tirupati Devasthanam Good News for TTD Employees
Tirumala Tirupati Devasthanam Good News for TTD Employees (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 2:36 PM IST

|

Updated : January 9, 2026 at 4:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tirumala Tirupati Devasthanam Good News for TTD Employees : తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామకాలు, సర్వీసు నిబంధనల సవరణలు, ఉద్యోగోన్నతుల వ్యవహారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బర్డ్‌ ఆసుపత్రి, ఎస్వీ గోశాల, వైద్యవిభాగం, ఆలయ కైంకర్యాల విధుల్లో కీలక మార్పులు చేస్తూ పాలకమండలి ఆమోదముద్ర వేసింది. పలు ప్రతిపాదనలకు డిసెంబర్‌ 16న జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. తుది ఉత్తర్వుల కోసం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.

టీటీడీ గోశాలలో కొత్త కొలువులు : ఎస్వీ గోసంరక్షణ శాలలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (2), గోశాల మేనేజర్‌ (2), డైరీ సూపర్‌ వైజర్‌ (6), డైరీ అసిస్టెంట్‌ (2) చొప్పున మొత్తం 12 పోస్టులను సృష్టించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పోస్టులకు పాలిటెక్నిక్‌ (అనిమల్‌ హస్బెండరీ) లేదా తత్సమాన అర్హతతో పాటు వెటర్నరీ అసిస్టెంట్‌గా 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి చేశారు. ఈ కొత్త పోస్టుల వల్ల ఏటా రూ.1.05 కోట్ల అదనపు భారం పడుతుందని, దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే భరిస్తుందని స్పష్టం చేశారు.

ప్రమోషన్‌ ఛానల్​ లేక పోస్టుల అప్‌గ్రేడ్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య విభాగంలో 30 ఏళ్లుగా ఒకే హోదాలో పని చేస్తున్న సిబ్బందికి తీపి కబురు అందింది. ప్రమోషన్‌ ఛానల్​ లేక స్తబ్దుగా ఉన్న పలు పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక ఎంఆర్‌ఐ, డిజిటల్‌ మమోగ్రఫీ వంటి పరికరాల నిర్వహణ కోసం ఉన్న ‘రేడియోగ్రాఫర్‌’ పోస్టును ‘చీఫ్‌ రేడియోగ్రాఫర్‌’గా పెంచారు. ఫిజియోథెరపిస్ట్‌ పోస్టు కూడా అప్‌గ్రేడ్‌ చేసినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.

కైంకర్యపరుడి పోస్టుకు తాళ్లపాక సంకీర్తనల్లో ప్రావీణ్యం : తాళ్లపాక కైంకర్యపరుడు, మణ్యం దార్‌ పోస్టుల నియామక నిబంధనలను ఖరారు చేశారు. ఈ పోస్టులకు తమకు వంశపారంపర్య హక్కు కల్పించాలంటూ సంబంధిత కుటుంబాలు చేసిన విజ్ఞప్తులను బోర్డు తిరస్కరించింది. 1987 చట్టం ప్రకారం ఈ అభ్యంతరాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. తాళ్లపాక కైంకర్యపరుడి పోస్టుకు తాళ్లపాక సంకీర్తనల్లో ప్రావీణ్యం సర్టిఫికెట్‌ ఉండాలి. 40 ఏళ్లు మించకూడదు. మణ్యం దార్‌ పోస్టుకు 8వ తరగతి పాసై, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి.

బర్డ్, ఆయుర్వేద ఫార్మసీలో : బర్డ్‌ ఆసుపత్రిలో రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఆర్థోపెడిక్స్‌ లేదా అనస్థీషియాలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అర్హతను నిర్ణయించారు. శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు బీఏఎంఎస్‌ లేదా బి.ఫార్మసీ (ఆయుర్వేద) డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలని సవరణ చేశారు.

గత పాలనలో చెల్లని పట్టాలు : శ్రీవారి భక్తులకు సేవలందిస్తున్న టీటీడీ ఉద్యోగులకు గూడు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన వైఎస్సార్సీపీ నేతలు, ఓట్ల కోసం ఎన్నికల ముందు పట్టాలిస్తున్నామంటూ నాటకాలు ఆడి ప్రలోబాలకు గురి చేశారు. ఉద్యోగుల సొమ్ముతోనే స్థలాలిచ్చే ప్రక్రియ పూర్తి చేయలేక చేతులెత్తేశారు. దీంతో గూబ గుయ్‌మనే ఫలితం రావడంతో ఆ ఊసే ఎత్తడం లేదు. చెల్లని పట్టాలు ఇస్తున్నారని తెలిసినా సాటి ఉద్యోగుల్ని ఏమార్చిన అధికారులు ప్రశ్నించే సాహసం చేయలేక చతికిలపడ్డారు. కనీసం తుడా అనుమతి కూడా లేని పట్టాలు పంచారనే వైనాన్ని కూటమి నేతల ఎదుట గోడు వెళ్లబోసుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు చేసిన పాపాన్ని కూటమి ప్రభుత్వం కడిగితే తప్ప తమకు న్యాయం జరగదని అభిప్రాయం సాధారణ ఉద్యోగుల్లో నెలకొంది.

దొంగలతో కుమ్మక్కై స్వామివారి సొమ్ము దోచుకున్న పోలీసులు - బయటపడనున్న అక్రమార్కుల జాతకాలు

పరకామణి కేసు - వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది: హైకోర్టు

Last Updated : January 9, 2026 at 4:20 PM IST