ETV Bharat / state

ఈవీ రంగంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ - ఇప్పటికే 21 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా థియరీతో పాటు ప్రాక్టికల్స్‌ - ISIEINDIA సహకారంతో ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు - ఈవీ వాహనాల తయారీ, నిర్వహణ, మరమ్మతులపై తర్ఫీదు

Jobs for 21 Engineering Students in EV Sector
సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా థియరీతో పాటు ప్రాక్టికల్స్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 2:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

Jobs for 21 Engineering Students in EV Sector: విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈవీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఈ అవకాశాలను ముందుగానే గుర్తించిన కృష్ణా జిల్లా గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ద్వారా విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తోంది. ఫలితంగా ఇంజినీరింగ్ పూర్తికాకముందే 21 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఈవీ రంగంలో తమ కెరీర్‌కు బలమైన పునాది వేసుకున్నారు. ఆ విశేషాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌తో పాటు ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. ఈ అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునేలా ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ISIEINDIA సహకారంతో ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తోంది. ఈవీ రంగంపై ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులకు మూడో సంవత్సరం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, బ్యాటరీ ప్యాకింగ్, స్పాట్ వెల్డింగ్, వోల్టేజ్ కంట్రోల్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అవగాహన కల్పిస్తున్నారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, వాహన తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నారు.

ఈవీ రంగంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ - ఇప్పటికే 21 మంది విద్యార్థులకు ఉద్యోగాలు (ETV Bharat)

పట్టు సాధిస్తున్న విద్యార్థులు: ఈవీ వాహనంలో కీలకమైన కంట్రోలర్, బ్యాటరీ, మోటార్ అనుసంధానంపై కూడా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందుతోంది. పవర్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, వాటి ఆపరేషన్స్, పవర్ అనాలిసిస్‌తో పాటు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల పనితీరును ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఈవీ వాహనాల తయారీ, నిర్వహణ, మరమ్మతుల్లో విద్యార్థులు పూర్తి స్థాయి నైపుణ్యం పొందుతున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రాక్టికల్ శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. బ్యాటరీ ప్యాక్, లిథియం అయాన్ సెల్స్, బీఎంఎస్ అమరికతో పాటు వైరింగ్ ఫాల్ట్స్ గుర్తించడం, మోటార్ కంట్రోల్ సర్క్యూట్ల డయాగ్నోస్టిక్స్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సిగ్నల్స్ ట్రాకింగ్ వంటి అంశాలను స్వయంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా పాత పెట్రోల్, డీజిల్ వెహికల్స్‌ ను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే లైవ్ ప్రాజెక్టులపైనా విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు.

'ఈ శిక్షణతో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమలో ఎదురయ్యే వాస్తవ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతోంది. ఇప్పటివరకు 40 మందికి పైగా విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా శిక్షణ పొందగా, 21 మంది ఇప్పటికే ఉద్యోగాలు సాధించారు. శిక్షణ సమయంలోనే ప్రాజెక్టులు రూపొందిస్తూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.ఈవీ రంగంలో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులను ముందుగానే సిద్ధం చేయడమే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రధాన లక్ష్యం. విద్యార్థులకు తరగతి గది పరిజ్ఞానంతో పాటు ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్నాం.' -కళాశాల యాజమాన్యం

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

స్టెతస్కోప్​కి గుడ్​బై - 'ఫ్రోత్ అండ్ ఫ్రెండ్స్' పేరుతో కేఫ్​ ఏర్పాటు

సాఫ్ట్‌వేర్‌ వదిలాడు - స్టార్టప్​తో గెలిచాడు