ETV Bharat / state

అవి సహజ మరణాలు కావు - జంగారెడ్డిగూడెం ఘటనపై సిట్‌ నివేదిక

మృతుల శరీరాల్లో మిథైల్‌ ఆల్కహాల్‌ నమూనాలు - దర్యాప్తు సంస్థలపై నాటి పాలకుల ఒత్తిడి తెచ్చారని వెల్లడి - ఈ కేసుల్ని ఐపీసీ 304 (2) కింద విచారించాలన్న సిట్

Etv Bharat
Etv Bharat (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 9:39 AM IST

|

Updated : December 29, 2025 at 11:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

Jangareddygudem Adulterated Liquor Deaths Case: వైఎస్సార్సీపీ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజమరణాలు కావనీ, మిథైల్‌ ఆల్కహాల్‌ కలిసిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్‌ నివేదికలో తేల్చింది. మృతుల శరీరాల్లో అతి ప్రమాదకర మిథైల్‌ ఆల్కహాల్‌ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికల విశ్లేషణలో స్పష్టమైనట్లు పేర్కొంది.

అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైన ఈ కేసులను కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ ఎమౌంటింగ్‌ టూ మర్డర్‌ (ఐపీసీ 304 (2)) సెక్షన్‌ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా సిట్ నిర్ణయించింది. నాటుసారాలో మిథైల్‌ ఆల్కహాల్‌ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, వారి వైఫల్యమూ ఉందని గుర్తించింది.

నివేదికలో ప్రధానాంశాలు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిశోర్‌ నేతృత్వంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సహాయ కమిషనర్‌ కేవీఎన్‌ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ పి. ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఏర్పాటైన సిట్‌ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలో ప్రధానాంశాలను పొందుపరిచింది.

పాలకుల ఒత్తిడికి లొంగిన పోలీసులు: జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు మొత్తం 25 మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందారు. వీరంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందే నాటుసారా తాగారు. ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదులందగా వీటిని అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేశారు.

ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని దర్యాప్తు చేయలేదు. మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలకు పంపినప్పటికీ ఆ నివేదికలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. మృతుల కుటుంబీకులు, ఎక్సైజ్‌ అధికారులు, సారా విక్రేతలు సహా ఎవరినీ విచారించలేదు. అప్పటి పాలకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గి దర్యాప్తును అటకెక్కించారు.

సైకలాజికల్‌ అటాప్సీతో నిర్ధరణ: మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు? తాగిన తర్వాత ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు? గతంలో వారికి అనారోగ్య సమస్యలున్నాయా? మద్యం తాగే అలవాటు ఎన్నాళ్లుగా ఉంది? గతంలో సారా తాగినప్పుడు వాంతులు, విరేచనాలు, తల తిరగడం లాంటి అనుభవాలు ఉన్నాయా? అని మృతుల కుటుంబీకుల్ని సిట్‌ ప్రశ్నించగా, అంతకుముందు తమ వారిలో అలాంటి లక్షణాలేవి చూడలేదని వారంతా వాంగ్మూలను ఇచ్చారు. సైకలాజికల్‌ అటాప్సీలో భాగంగా ఈ వివరాలు సేకరించారు. వీటన్నింటినీ విశ్లేషించాక అవి సహజ మరణాలు కావని తేల్చారు.

సహజ మరణాలని జగన్‌ సర్టిఫికెట్లు: నాటుసారా తాగిన తర్వాత బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్లు మసకబారిపోయి చూపు కోల్పోవడం, వాంతులు, తల తిరగడం, ఆయాసం, ముఖమంతా నల్లగా మారిపోవడం, నాలుక తెల్లబడిపోవడం వంటి లక్షణాలతో మరణించారు. ప్రాణాలొదిలేయడానికి కేవలం కొన్ని గంటల ముందు తమకు ఏదో అయిపోతోందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వారి కుటుంబసభ్యుల వద్ద మృతులు తల్లడిల్లిపోయారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారి కళ్ల ముందే విలవిల్లాడుతూ ప్రాణాలొదిలారు.

సిట్ విచారణలో అసలు గుట్టురట్టు: కల్తీ సారా మృతుల్లో దాదాపు 35-45 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నాటుసారా తాగడం వల్లే వారు చనిపోయారంటూ మృతుల కుటుంబసభ్యులు ప్రధానంగా ఆరోపించాయి. కానీ అవన్నీ సహజ మరణాలేనని నాటి ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చెప్పారు.

అంతేకాకుండా అనారోగ్యం, ఇతర రకాలైన కారణాలతో జంగారెడ్డిగూడెంలో నెలకు 90 మంది సాధారణంగా చనిపోతుంటారంటూ గత పాలకులు తీసిపడేశారు. అప్పటి పోలీసు, అధికార యంత్రాంగం కూడా పాలకులకు వంతపాడటంతో ఈ చావుల వెనకున్న చీకటి కోణాలు బయటకురాలేదు. కానీ కూటమి ప్రభుత్వం సిట్‌ వేసి, విచారించడంతో అసలు గుట్టు ఇప్పుడు రట్టయ్యింది.

నాణ్యమైన బ్రాండ్లు దొరక్కే: వైఎస్సార్సీపీ పాలనలో నాణ్యమైన, ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, నాసిరకం బ్రాండ్లను అధిక ధరలకు కొనాల్సి రావడంతో కూలీలు, పేదలు నాటుసారాకు అలవాటు పడ్డారు. దీంతో కల్తీ, నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. వాటిని అధికార యంత్రాంగం నిర్మూలించలేదు.

పారిశ్రామిక అవసరాలకు గాను ఉపయోగించే మిథైల్‌ ఆల్కహాల్‌ దుర్వినియోగం కాకుండా, దాన్ని రవాణా చేసే వాహనాలకు జీపీఎస్​ను ఏర్పాటు చేయాలి. తద్వారా ఇది పక్కదారి పట్టకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది.

ఏలూరు జిల్లాలో కల్తీ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్

వైఎస్సార్సీపీ గాయాలు - 'కల్తీ మద్యం' మరణ మృదంగానికి వీధినపడ్డ 25 కుటుంబాలు

Last Updated : December 29, 2025 at 11:51 AM IST