జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే మాకు ముఖ్యం: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ - సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి మెంబర్‌షిప్‌ను తీసుకున్న జనసేనాని, విరాళంగా రూ. 2 కోట్లను అందజేసిన వైనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 2:25 PM IST
Pawan Inaugurated Janasena Party Membership Drive: జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి మెంబర్‌షిప్‌ను తీసుకున్నారు. అంతేకాకుండా విరాళంగా రూ.2 కోట్లను పార్టీకి అందజేశారు.
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు: జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా పిలుస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
2021వ సంవత్సరంలో మొదటి విడత సభ్యత్వం కింద 150 మందితో పార్టీని ప్రారంభించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత దానిని 90,000కి పెంచామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందని, ఎన్నికల తర్వాత 12 లక్షల 98 వేల సభ్యత్వాలు సాధించామని వెల్లడించారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతోమంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని పవన్ పేర్కొన్నారు.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2026
•సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
•పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం… pic.twitter.com/QqWTmqbXPM
అలాంటి వారే పార్టీకి అవసరం: పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యమని పవన్ చెప్పారు. అలాంటి వారే పార్టీకి అవసరమ అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓటములకు వెన్నుచూపని నైజం: 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్ కల్యాణ్ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమిపాలయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో అరాచక పాలన సాగటం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది. జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి, గుంతలమయమైన రహదారులు వంటి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు.
జనసేన ఆవిర్భావ సమయంలో పవన్‌కల్యాణ్ వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు. పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు. సినిమా హీరోగా చరిష్మా, ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలే ఆయనకు ప్రధాన బలాలు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం కోసం ఇంకా చాలా కావాలి. రాజకీయ ఎత్తుగడలు, బలమైన నాయకులు, పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. వీటిపై సరిగ్గా దృష్టి సారించకపోవడం వల్ల జనసేన 2019 ఎన్నికల్లో విఫలమైంది.
చివరికి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్సార్సీపీ పంచన చేరారు. పార్టీ తరఫున పోటీచేసిన కొందరు నాయకులూ జనసేనను వీడివెళ్లారు. కష్టకాలంలోనూ పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు. 2024 ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగగా వందశాతం స్ట్రయిక్‌రేట్‌తో గెలుపొంది సరికొత్త చరిత్రను సృష్టించింది.
జనసేన ది రైజ్ అండ్ రూల్ - 12 ఏళ్ల విజయప్రస్థానం
పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం - 3 రోజులపాటు ప్లీనరీ

