ETV Bharat / state

450 ఏళ్ల ఘన చరిత్ర - కోనసీమ ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా

జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు - మంత్రి దుర్గేష్, సృజనాత్మక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ తేజస్విని వెల్లడి

Jaggannathota Prabhala Theertham Declared State Festival
Jaggannathota Prabhala Theertham Declared State Festival (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 11:00 AM IST

|

Updated : January 9, 2026 at 1:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Jaggannathota Prabhala Theertham: తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలే. సంక్రాంతి అంటే రంగవల్లులు, పిండి వంటలు, భోగి మంటలు, కోడి పందాలు మాత్రమే కాదు. వీటితో పాటు కోనసీమ వాసులు కనుమ పండుగ రోజున జరుపుకొనే ప్రభల తీర్థం గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా జగ్గన్నతోటలో ప్రతీ ఏడాది నిర్వహించే ప్రభల తీర్థానికి లక్షల సంఖ్యలో జనం తరలివస్తుంటారు. వీటికి 450 ఏళ్లు ఘన చరిత్ర ఉంది. ఇంతటి విశిష్టత ఉన్న జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకలను రాష్ట్ర పండగగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి మండలి నిన్న (గురువారం) నిర్ణయం తీసుకుంది. ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సృజనాత్మక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్విని పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం వారిద్దరూ మాట్లాడారు.

450 ఏళ్ల ఘన చరిత్ర - కోనసీమ ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా (ETV)

‘జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రాచీన సంప్రదాయం. 450 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలు చూసేందుకు 5-6 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో ఆ రోజు కొలువు దీరతారని, వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారు అనేది కోనసీమ వాసుల నమ్మకం.

పర్యాటక ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తాం: ఈ 11 గ్రామాలతో పాటు ఇతర పల్లెలు, ప్రాంతాల నుంచి అనేక ప్రభలు జగ్గన్నతోటకు చేరుకుంటాయి. ఇప్పటికీ పాత సంప్రదాయం ప్రకారమే అధిక బరువు ఉండే ప్రభలను మోసుకుంటూ పొలాలు, తోటలు, కౌశిక నదిని దాటుకుంటూ అక్కడికి చేరుస్తారు. ఈ తీర్థం నిర్వహణను గతంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. రిపబ్లిక్‌ పరేడ్‌లో కూడా ఈ తీర్థం విశిష్ఠతను ప్రదర్శించిన విషయం తెలిసింది.

ఇప్పుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయనుంది. ప్రజలంతా ఈ తీర్థాన్ని సందర్శించాలి అని తేజస్విని కోరారు. మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ కోనసీమ యావత్తూ ప్రభల తీర్థాన్ని పెద్ద పండుగగా చేస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాటిని గుర్తించి, ప్రాధాన్యం కల్పిస్తోందని ఆయన అన్నారు. కోనసీమలోని పర్యాటక ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

'ఏకాదశ రుద్రులు ప్రభలు ఒకేసారి బయలుదేరి జగ్గన్నతోట ప్రాంతంలో ప్రభల తీర్థం జరుగుతోంది. కనుమ రోజున కోనసీమ అంతంటా అద్భుతమైన పండగ వాతావరణం నెలకొంటోంది. ప్రభల ఉత్సవాలు చేయడం వల్ల గ్రామంలో పంటలు బాగా పండుతాయని కోనసీమ వాసుల నమ్మకం.' - కందుల దుర్గేశ్, పర్యాటక శాఖ మంత్రి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో నిర్వహిస్తున్న జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ వెల్లడించారు. మలికిపురం గ్రామానికి మంగళవారం వచ్చిన ఆయనకు స్థానికులు వినతి పత్రం ఇవ్వగా ఈ మేరకు స్పందించారు.

450 సంవత్సరాల ఘన చరిత్ర: లక్షల మంది భక్తుల కోలాహలం మధ్య ఏటా వైభవంగా నిర్వహించే ప్రభల తీర్థానికి 450 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని, ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్వి, తాను వేర్వేరు సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లామని దుర్గేష్‌ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

రాష్ట్ర పండుగగా ప్రకటించడం గొప్పవరం: కనుమ పండుగ రోజున కోనసీమలో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కోనసీమలో 450 ఏళ్ల నుంచి ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నా గత ప్రభుత్వాలు ఈ వేడుకలను ప్రభుత్వ పండుగగా గుర్తించలేదని అన్నారు.

జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకల ప్రాధాన్యత, సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించిన ప్రభుత్వం ప్రభుత్వ పండుగగా జరపాలని నిర్ణయించినందన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం గొప్ప వరమని సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని తెలిపారు.

సంక్రాంతికి తగ్గేదేలే - ప్రత్యేక శిక్షణ, డైట్​తో కాలు దువ్వుతున్న పుంజులు

సంక్రాంతి బరిలో దిగేందుకు 'పందేం కోళ్లు' సిద్ధం - ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు

Last Updated : January 9, 2026 at 1:02 PM IST