ETV Bharat / state

పతంగుల పండగ వచ్చేసింది - గాలిపటాలు ఎగిరేసే సమయంలో ఈ జాగ్రత్తలు మరవకండి

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గాలిపటాల సందడి - పతంగులు ఎగురు వేసే క్రమంలో ప్రాణాలతో జాగ్రత్త - ఆనందం విషాదం కాకుండా చూసుకోవాలంటున్న పర్యావరణవేత్తలు, పోలీసులు

Precautions for Kites Flying
Precautions for Kites Flying (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 12:53 PM IST

|

Updated : January 11, 2026 at 9:22 AM IST

3 Min Read
Choose ETV Bharat

Precautions for Kites Flying : హలో పిల్లలూ బాగున్నారా! నేను మీ గాలిపటాన్ని. సంక్రాంతి సెలవులు వచ్చాయి కదా! ఇక మీరు నాతో ఆడుకోవడానికి ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కానీ మీరు నన్ను ఎగురవేసే క్రమంలో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. అన్నట్లు మీరే కాదు పశు పక్ష్యాదులకు ప్రాణాంతకంగా మారిన చైనా మాంజా జోలికి అస్సలు వెళ్లకండి. ఈ సంక్రాంతి సెలవు నేపథ్యంలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చా. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ సంతోషం, నా ఆనందం అనంతమవుతుంది.

ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది : సంక్రాంతి పండగ సంబురాలు మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు రావడంతో పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. చిన్నారుల చదువుల నిమిత్తం నగరాల్లో ఉన్న వాళ్లంతా ఈ పండగకు పల్లె బాట పడుతుంటారు. ఇక ఈ పండగ విషయానికొస్తే కనుమ రోజున గాలిపటాలు ఎగురవేయడమంటే పిల్లలకు ఎంతో సరదాగా ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్నారులు ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా పంతగులు ఎగురవేస్తూ, కేరింతలు కొడుతూ ఉంటారు.

సంక్రాంతి సందడి మొదలు : ఉమ్మడి వరంగల్​ జిల్లాలో మునుపెన్నడూ లేనిరీతిన గాలిపటాల సందడి మొదలైంది. సౌండ్​ బాక్సుల్లో సాంగ్స్ పెట్టుకుని మరీ ఆనందిస్తున్నారు. పంతగులు ఎగుర వేసే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పండగ మనందరి సొంతమవుతుంది. ఈ దిశగా పెద్దలు పిల్లలకు అవగాహన కల్పించాలి. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు. నింగిలో ఎగిరే క్రమంలో పిట్ట గోడ, విద్యుత్తు తీగలు, ముళ్ల కంచెల వద్ద జాగ్రత్తగా ఉండండి.

అప్రమత్తత కీలకం :

  • అప్పట్లో గాలిపటాలు ఎగుర వేయడానికి మైదానాలే దిక్కు. కానీ ఇప్పుడలా కాదు. భవనాలపైకి ఎక్కి ఎగుర వేస్తున్నారు. అలా అందరి చూపు దాని మీదే ఉంటుంది. ముంచుకొచ్చే ముప్పును పసిగట్టే స్థితిలో ఉండరు. మీలో ఒకరు రక్షణ బాధ్యత తీసుకోవాలి.
  • గాలిపటం మధ్యలో తెగితే పరుగులు తీయొద్దనే షరతు విధించుకోండి.
  • స్వీయ కట్టడితోనే సంబురాన్ని ఆస్వాదించే వీలుంటుంది.
  • చైనా మాంజా విక్రయాలపై నిషేధం ఉంది. ఎవరి దగ్గరైనా ఉంటే 100కి కాల్​ చేసి సమాచారం ఇవ్వండి. మీ పేర్లు గోప్యంగా ఉంచుతారు.

అలసత్వం వద్దు :

  • గతేడాది జనగామ జిల్లాలో జరిగిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఒకరికి చైనా మాంజా తగిలి కోసుకుపోయింది.
  • మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం చిల్కోడులో చైనా మాంజా దారంతో ఓ పక్షి గాయపడింది. నగరంలోనైతే ఓ సైనికుడు చైనా మాంజాతో గొంతు కోసుకుపోయి మృత్యువాతపడిన విషాదం ఓ చేదు జ్ఞాపకంగా మిగిలింది. అందుకే అలసత్వం వద్దు.

ఈ జాగ్రత్తలు అస్సలు మరవవద్దు :

  • రద్దీ ప్రాంతాల్లో, జన సంచారం ఉన్న చోట ఎగురవేయకూడదు. దారం రోడ్డుకు అడ్డుగా పడితే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మధ్యలో పతంగి తెగి పడితే పైకి చూస్తూ దాని వెంట వెళ్లకండి.
  • కరెంట్​ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. అనుకోకుండా అక్కడ చిక్కితే తీసే సాహసం చేయకూడదు. లేదంటే ప్రమాదం జరిగే అవకాశముంటుంది.
  • కొందరు చిన్నారులు భవనం పైభాగంలోకి వెళ్లి ఆడుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడతారు. తప్పదు అనుకుంటే పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూసుకోండి.
  • ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం మన రాష్ట్రంలో చైనా మాంజాను నిషేధించింది.
  • చైనా మాంజాకు బదులు సంప్రదాయ దారం వాడాలని పర్యవేరణ వేత్తలు, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
  • బిల్డింగులపై పతంగులు ఎగురవేసే సమయంలో సరైన ఎత్తులో ప్రహరీ ఉన్న భవనాన్నే ఎంచుకోవాలి.
  • కాటన్‌తో తయారు చేసిన మాంజాలను మాత్రమే వినియోగించాలి. చైనా మాంజాలు, మెటాలిక్‌ మాంజాలను అస్సలు వాడకూడదు.
  • తడి వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పొడి వాతావరణంలో మాత్రమే గాలిపటాలు ఎగరేయాలి.
  • తెగిపోయిన పతంగుల కోసం రోడ్లపై పరిగెత్తకూడదు. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ.
  • నిర్మానుష్య ప్రదేశాలు, ఆట స్థలాలు, తదితర అనువైన ప్రాంతాల్లో ఎగురవేయండి. ఆనందాన్ని పొందండి.
  • ఏదైనా ప్రమాదకర సంఘటన జరిగితే వెంటనే 1912 నెంబర్​కు కాల్​ చేసి, సమాచారం అందించాలి.

ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతి అంటే పతంగుల పండగే. పిల్లలకు సెలవులు కూడా రావడంతో ఎక్కడ చూసినా గాలి పటాల సందడే కనిపిస్తోంది. వీటిని ఎగురవేసే క్రమంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదమరిచి ఉన్నామంటే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే. ఇంట్లోని పెద్దలు సైతం పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. విద్యుత్ తీగలకు దూరంగా ఎగురవేయాలి. మా విద్యుత్ సిబ్బంది సైతం ఆటోల్లో తిరుగుతూ దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. - వెంకన్న, టీజీఎస్పీడీసీఎల్‌ హబ్సిగూడ సర్కిల్‌ ఎస్‌ఈ

బైకర్ మెడకు చుట్టుకున్న గాలిపటం మాంజా - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువకుడు

150 మిల్లీ గ్రాముల 'బంగారు' గాలిపటం - చూస్తే అవాక్కవ్వాల్సిందే!

Last Updated : January 11, 2026 at 9:22 AM IST