తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇస్రో పిలుపు - ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి కల్గించేలా ఇస్రో కార్యక్రమాలు - తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తున్న ఇస్రో - దేశంలో ప్రముఖ ప్రాంతాల్లో నిర్వహణ

Published : February 28, 2026 at 12:22 PM IST
|Updated : February 28, 2026 at 1:04 PM IST
ISRO YUVIKA 2026 : 'చందమామ రావే - జాబిల్లి రావే' అని అమ్మ తన పిల్లలకు చంద్రున్ని చూపిస్తూ అన్నం పెడుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారులకు చంద్రుడన్నా, ఆకాశంలో మెరిసే నక్షత్రాలన్నా ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. దీంతో అంతరిక్షానికి సంబంధించిన విషయాలను చెబితే పిల్లలు ఆసక్తికరంగా వింటారు. ఇలా చిన్నారులకు పాఠశాల దశ నుంచే అంతరిక్షంపై అవగాహన కల్పిస్తే, భవిష్యత్తులో వారు ఆ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి విద్యార్థి దశలోనే అంతరిక్ష జ్ఞానం పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి సంవత్సరం యువ విజ్ఞాన కార్యక్రమాన్ని (యువికా) నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఇస్రో తన ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఇటీవల వందకు పైగా ప్రయోగాలను పూర్తి చేసుకుంది. దీంతో అగ్ర దేశాలకు దీటుగా పరిశోధనలు చేపడుతోంది. విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానాన్ని పంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
శిక్షణ ఎక్కడంటే? : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆంధ్రప్రేదేశ్లోని సూళ్లూరుపేట, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, మేఘాలయా రాష్ట్రంలోని షిల్లాంగ్, ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దరఖాస్తు విధానం ఇలా : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. దీనికోసం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://jigyasa.iirs.gov.in/yuvika
ఎంపిక విధానం : పై లింక్ అధారంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మరో లింక్ వస్తుంది. ముందుగా దీనిలో నిర్వహించే క్విజ్ పోటీలో పాల్గొనాలి. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా 10 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈ క్విజ్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు చదువుకు సంబంధించిన వివరాలనూ నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిలో పాల్గొన్న విద్యార్థుల 8వ తరగతి మార్కులకు 50 శాతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో చేరి ఉంటే మరో 5 శాతం, సైన్స్‌ఫెయిర్‌లో గతంలో పాల్గొని ఉంటే 10 శాతం, దీనితో పాటు గ్రామీణ విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చి చివరగా ఎంపిక చేస్తారు.
ఏప్రిల్ 13న తొలి జాబితా : మనం ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించి ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను ప్రకటిస్తారు. తర్వాత రెండో జాబితాను ఏప్రిల్ 20న విడుదల చేస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకునేందుకు చివరి గడువు తేదీ మార్చి 31. దీనిలో ఎంపికైన విద్యార్థులు మే 11 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా జరిగే కేటాయించిన ప్రాంతాల్లో యువికాలో పాల్గొంటారు. విద్యార్థుల భోజన, వసతి, రవాణాలకు అయ్యే పూర్తి ఖర్చును ఇస్రో భరిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలల్లో 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హులు.
ఇస్రో జైత్రయాత్ర : అంతరిక్ష సాంకేతికను సామాన్యుడి చెంతకు చేర్చేలా ఇస్రో అడుగులు వేస్తోంది. తక్కువ ఖర్చుతోనే అత్యంత కచ్చితత్వంతో వందలాది స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెడుతోంది. దీంతో ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగంలో ఇస్రో అగ్రగామిగా నిలిచింది. ఇప్పటికే ఇస్రో అనేక శాటిలైట్ కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాలకు అవసరమైన అనేక ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. అవి విజయవంతమై, వాటి పనులు నిర్వర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి జాడను గుర్తించింది. మొదటి ప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించి విజయపతాకం ఎగురవేసింది. అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీని ఇటీవల సొంతం చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే విజయాలు అనేకం.
చంద్రయాన్-4 మిషన్ లాంఛ్‌కు జోరుగా ఏర్పాట్లు- ల్యాండింగ్ సైట్ ఎంపిక చేసిన ఇస్రో

