ETV Bharat / state

దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ఈఓఎస్‌-ఎన్‌ 1 ఉపగ్రహా ప్రయోగానికి ఇస్రో సిద్ధం

భవిష్యత్తులో పునర్‌ వినియోగ రాకెట్ల తయారీకి ఈ ప్రయోగం కీలకం-ఇస్రో ఖాతాలో మరో వాణిజ్య ఉపగ్రహం-ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ నింగిలోకి

The EOS-N1 Satellite Launch
The EOS-N1 Satellite Launch (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 12:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

The EOS-N1 Satellite Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమయ్యింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన "ఈఓఎస్‌-ఎన్‌1" లేదా "అన్వేష" ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

వినూత్నంగా "కిడ్‌" రీ-ఎంట్రీ మోడల్​: ఈ మిషన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం 'కిడ్‌' ప్రయోగం. ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిన తర్వాత, రాకెట్‌ నాలుగో దశ (పీఎస్‌ 4)ను తిరిగి మండించి భూమి వైపు మళ్లిస్తారు. అప్పుడు స్పెయిన్‌కు చెందిన 'కిడ్‌' క్యాప్సూల్‌ రాకెట్‌ నుంచి విడిపోయి, భూ వాతావరణంలోకి ప్రవేశించి, దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో పడేలా ప్లాన్‌ చేశారు. భవిష్యత్తులో పునర్‌ వినియోగ రాకెట్ల తయారీకి ఈ ప్రయోగం కీలకం కానుంది.

న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్‌ ఇది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 64వ ప్రయోగం కాగా, రెండు స్ట్రాప్‌-ఆన్‌ మోటార్లు కలిగిన డీఎల్‌ వేరియంట్‌లో ఇది 5వ మిషన్‌ కావడం విశేషం. గత ఏడాది మేలో జరిగిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 వైఫల్యం తర్వాత జరుగుతున్న ప్రయోగం కావడంతో ఇస్రో దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

మిషన్​లో ఆసక్తికరమైన అంశాలు : ఈ ప్రయోగం ద్వారా మొత్తం 16 పేలోడ్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం ఈఓఎస్‌-ఎన్‌1. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హైపర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం, సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఈ ప్రధాన ఉపగ్రహంతో పాటు భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్‌ తదితర దేశాలకు చెందిన 15 చిన్న ఉపగ్రహాలు కూడా నింగిలోకి వెళ్లనున్నాయి.

రాకెట్‌ సాంకేతిక వివరాలు

ఎత్తు: 44.4 మీటర్లు

బరువు: 260 టన్నులు

దశలు: ఘన, ద్రవ ఇంధనాలతో కూడిన 4 దశలు.

వేరియంట్‌: రెండు స్ట్రాప్‌-ఆన్‌ మోటార్లు కలిగిన పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌ రకం.

అంతరిక్ష ప్రయోగాలలో తన మార్క్​ చూపిస్తున్న ఇస్రో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో కలికితురాయిగా చెప్పుకొదగినది ఎల్‌వీఎం-3 ఎం-6 రాకెట్‌ సాయంతో అమెరికాకు చెందిన 6,100 కిలోల బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని గత నెల శ్రీహరికోట నుంచి దిగ్విజయంగా నింగిలోకి పంపింది. ఎల్‌వీఎం-3కి ఇది వరసగా తొమ్మిదో విజయం. పైగా, 52 రోజుల వ్యవధిలోనే రెండు ప్రయోగాలను అనుకున్నట్లుగా పూర్తిచేయడం ఇస్రో సమర్థతకు తార్కాణంగా నిలిచింది. ఇదే ఉత్సాహంతో వచ్చే మార్చి నాటికి మరిన్ని ప్రయోగాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమవుతోంది. 'గగన్‌యాన్‌'లో భాగంగా ఒక రోబోను ఆకాశంలోకి తీసుకెళ్లనుంది. ప్రైవేటు రాకెట్‌నూ ప్రయోగించనుంది.

అతిపెద్ద శాటిలైట్లను రోదసిలోకి తరలించాలంటే స్పేస్‌ఎక్స్, ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ లాంటివే గుర్తుకొచ్చే ఈ రోజుల్లో ఇస్రో సాధించిన ఘనత అంతరిక్ష విపణిలో ఇండియా స్థానాన్ని పటిష్ఠపరుస్తోంది. ఇస్రోపై ప్రపంచదేశాల్లో నమ్మకాన్ని ఇనుమడింపజేసి రాబోయే రోజుల్లో వాణిజ్య ప్రయోగాలకు మరింత ఊతమిస్తుంది. తద్వారా దేశీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మరిన్ని కొత్త పుంతలు తొక్కే వీలుంది. ఇస్రో విజయ పరంపరను గమనిస్తున్న చాలా దేశాలు వాటి ఉపగ్రహ ప్రయోగాలకు ఇండియానే ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతవరకు 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షానికి చేర్చింది. తద్వారా దేశానికి నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్జించి పెట్టింది. ఇస్రో వెచ్చిస్తున్న ప్రతి రూపాయికి రెండున్నర రెట్ల ప్రతిఫలం వస్తుండటం ఆ సంస్థ అద్భుత పనితీరుకు నిదర్శనం.

తిరుమల పవిత్రతపై పక్కా ప్రణాళికతో దాడి - ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనా?

"ఇంగితజ్ఞానం లేనివాళ్లు రాజకీయాలు చేస్తే ఏం మాట్లాడాలి?" - జగన్‌పై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు.