ETV Bharat / state

ఆందోళన వద్దు - ఇజ్రాయెల్​లో తెలుగు ప్రజలంతా సురక్షితంగానే ఉన్నారు : తెలంగాణ అసోషియేషన్

ఇజ్రాయెల్‌లో ఉన్న తాము సురక్షితంగా ఉన్నామని తెలంగాణ అసోసియేషన్ ప్రకటన - మిసైల్ దాడులు జరగడానికి ముందే బంకర్లలోకి వెళ్లాలని సూచన - త్వరలోనే యుద్ధం ముగిసిపోతుందని ఆశాభావం

ISRAEL TG PRESIDENT ON WAR
ISRAEL TG PRESIDENT ON WAR (AP)
author img

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 4:52 PM IST

|

Updated : March 4, 2026 at 5:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Israel TG Association President On Telugu People Safety : అమెరికా, ఇజ్రాయెల్​పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలటరీ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ పైనా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండేలా హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్​లో ఉన్న తమ వారు ఎలా ఉన్నారో అనే ఆందోళనలు ఆయా కుటుంబాల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్​లో ఉన్న తెలుగువారి పరిస్థితి గురించి ఇజ్రాయెల్ తెలంగాణ అసోషియేషన్​ అధ్యక్షుడు గంగాధర్​ వివరించారు. ఇక్కడ తామంతా సురక్షితంగా ఉన్నామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్​ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఈటీవీ, ఈటీవీభారత్​తో పంచుకున్నారు.

ప్రశ్న : ఇజ్రాయెల్, ఇరాన్​ దాడులు, ప్రతిదాడుల వేళ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

గంగాధర్ : శనివారం ఉదయం నుంచే ఇజ్రాయెల్​పై క్షిపణి దాడి మొదలైంది. ఇక్కడ తరచూ సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్​ క్షిపణులు, రాకెట్లతో దాడి చేస్తోంది. ​ఈ దేశానికి ఐరన్​డోమ్ వ్యవస్థ, లేజర్ టెక్నాలజీ ఉండటం వల్ల ఇరాన్​ పంపిన క్షిపణులను భూభాగంపై పడకుండా కూల్చేశారు. క్షిపణిదాడి సమయంలో ఇజ్రాయెల్​లో ఉన్న ప్రతిపౌరుడికి అలర్ట్​ మెసేజ్​ వస్తుంది. అలాంటి సమయాల్లో బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నాం. అందువల్ల మన తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. సురక్షితంగా ఉన్నారు.

ప్రశ్న : యుద్ధం ఇలాగే కొనసాగితే తెలుగు వారి పరిస్థితి ఏంటి?

గంగాధర్ : మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందీ లేదు. హమాస్​పై దాడి జరిగినప్పుడు కూడా మేం ఇక్కడే ఉన్నాం. అప్పుడు భారత ప్రభుత్వం కొన్ని ఫ్లైట్లను ఏర్పాటు చేసి పౌరులను స్వదేశానికి తరలించింది. అప్పుడు కొంతమంది మాత్రమే వెళ్లారు. మిగతా వారంతా ఇక్కడే ఉన్నారు. ఇండియన్​ ఎంబసీ వారు మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు.

ప్రశ్న : నెతన్యాహు కార్యాలయం, ఇంటిపై దాడి చేశామని ఇరాన్​ చెబుతోంది. దాని గురించి ఏమైనా తెలుసా?

గంగాధర్ : నెతన్యాహు ఇంటిపై దాడిచేశారనేది అవాస్తవం. అసలు అలాంటి అవకాశమే లేదు. మరోవైపు ఇక్కడి ప్రజలకూ ఎలాంటి ఇబ్బంది లేదు. బంకర్లు ఉండటం వల్ల మేం సురక్షితంగా ఉన్నాం.

ప్రశ్న : ఇజ్రాయెల్​లో తెలుగు వారు ఎక్కడెక్కడ ఉంటారు?

ఆంధ్రాకు సంబంధించిన వారు ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వేల మంది పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. మన తెలుగువారు టెల్​ అవీవ్, హైఫా, రమత్ గన్, బేనీద్దాన్​లో తెలుగువారు ఎక్కువమంది ఉంటారు.

ప్రశ్న : ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారులు, పోలీసుల నుంచి మీకు ఎలాంటి సహాయం లభిస్తుంది?

జవాబు : ఇజ్రాయెల్​, భారతీయ పౌరుల భద్రతకు ఇక్కడి అధికారులు, పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. మీద్వారా మరో కీలక విషయాలన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ తెలుగు ప్రజల భద్రతపై కొన్ని మీడియా సంస్థలు అనవసర దుష్ప్రచారాలు చేస్తున్నాయి. అదంతా అవాస్తవం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్​ ప్రభుత్వం బంకర్లలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఎవరకీ చిన్న గీత కూడా పడలేదు.

ప్రశ్న : యుద్ధం ఎక్కువరోజులు కొనసాగితే అక్కడి తెలుగు ప్రజలకు అసోషియేషన్ ద్వారా ఎలాంటి సహాయం అందిస్తారు?

గంగాధర్ : ఇంతకు ముందు అలాంటి పరిస్థితి లేదు. ఇకపైనా ఎదురవ్వదని భావిస్తున్నాం. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే ఇజ్రాయెల్ తెలంగాణ అసోషియేషన్​ తరఫున సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అసోషియేషన్ ద్వారా నిధులు సమకూర్చుకుని సహకారమందిస్తాం. యుద్ధం సమాచారాన్ని మన తెలుగు ప్రజలు ఉన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరవేస్తున్నాం. వాళ్ల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. సరిహద్దుల్లో ఉన్నవారితో కూడా టచ్​లో ఉన్నాం.

గల్ఫ్​లో బాంబుల వర్షం - తెలంగాణలోని వలసకార్మికుల కుటుంబాల్లో అలజడి

పశ్చిమాసియాలో భీకర యుద్ధం - హైదరాబాద్​లో భయాందోళనలు

Last Updated : March 4, 2026 at 5:12 PM IST