ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్‌కు సాగునీరు విడుదల - హర్షం వ్యక్తం చేసిన రైతులు
ఇరిగేషన్‌పై ప్రభుత్వం నిర్ణయాలు రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్న మంత్రి కందుల దుర్గేశ్ - ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్‌కు సాగునీరు విడుదల - గోదావరికి జలహారతి ఇచ్చి బటన్ నొక్కి నీరు విడుదల

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2026 at 5:05 PM IST
|Updated : May 31, 2026 at 5:21 PM IST
Irrigation Water Released From Dhavaleswaram Barrage For Kharif: నీటిపారుదల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని మంత్రి కందుల దుర్గేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్‌కు ఆయన సాగునీరు విడుదల చేశారు. అనంతరం మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల మేలును కోరే ప్రభుత్వమని ప్రస్తావించారు. మంత్రి కందుల దుర్గేశ్‌తో పాటు కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేకపూజలను నిర్వహించారు. ఆపై గోదావరికి జలహారతి ఇచ్చి మీట నొక్కి నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాలువకు నీటి విడుదలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆయకట్టు రైతులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్‌కు సాగునీరు విడుదల: తుపానులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు సాగు విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. దీనికోసం గోదావరి డెల్టా కు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఒకరోజు ముందే సాగునీరు విడుదల చేసిందన్నారు. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి డెల్టాకు నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
రైతులు నాట్లు తొందరగా వేసుకోవాలని సూచన: ప్రస్తుతం తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని, 15 రోజుల్లో కాలువల మరమ్మతులు పూర్తి కాగానే దశలవారీగా మిగిలిన కాలువలకు నీరు విడుదల చేస్తామన్నారు. ముందస్తు నీటి విడుదల వల్ల ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ముందుగానే వరి సాగు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రైతులు నాట్లు తొందరగా వేసుకోవాలని, తద్వారా తుపానులు రాకముందే పంట త్వరగా చేతికందుతుందని మంత్రి కందుల దుర్గేశ్ ఈ సందర్భంగా రైతులందరికీ సూచించారు.
"తుపానులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు సాగు విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనికోసం గోదావరి డెల్టా కు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఒకరోజు ముందే సాగునీరు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి డెల్టాకు నీరు విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని, అయితే మరో 15 రోజుల్లో కాలువల మరమ్మతులు పూర్తి కాగానే దశలవారీగా మిగిలిన కాలువలకు నీరు విడుదల చేస్తాం. ముందస్తు నీటి విడుదల వల్ల ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ముందుగానే వరి సాగు చేసుకునే అవకాశం లభిస్తుంది. రైతులు నాట్లు తొందరగా వేసుకోవాలి. తద్వారా తుపానులు రాకముందే పంట త్వరగా చేతికందుతుంది"-కందుల దుర్గేష్, మంత్రి
రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఇక్కడి నీటి కాలుష్యాన్ని తగ్గించే విధంగా పంచాయతీ రాజ్ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరఫున వంద కోట్లు రూపాయలు ఇస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతన్నలందరూ నాట్లు వేసుకుని, పంట పండించుకోవడంతో పాటు సంక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేశ్ రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.
రేపు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల: మంత్రి దుర్గేష్

