ETV Bharat / state

పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాల్చుతున్న యుద్ధం - గల్ఫ్‌లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు

సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం - ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలు - రాష్ట్రానికి వచ్చేందుకు ఎంబసీలను ఆశ్రయిస్తున్న వైనం - గల్ఫ్‌ దేశాల పరిధిలో దాదాపు 10 లక్షల మంది ప్రవాసాంధ్రులు

Telugu People Stranded in West Asia
Telugu People Stranded in West Asia (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 2:10 PM IST

4 Min Read
Choose ETV Bharat

Telugu People Stranded in West Asia : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షిపణులు, బాంబుల వర్షంతో భీతావాహ వాతావరణం నెలకొంది. బహ్రెయిన్, దుబాయ్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, అబుధాబి తదితర దేశాల్లో ఎప్పుడు, ఎటు వైపు నుంచి బాంబుల వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో అమెరికన్ స్థావరాలే కాకుండా నివాస సముదాయాలే లక్ష్యంగా కూడా దాడులు జరుగుతున్నాయి.

గల్ఫ్ దేశాల పరిధిలో దాదాపు 10 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. కువైట్​లో అత్యధికంగా 7 లక్షల మంది ఉంటున్నారు. బహ్రెయిన్​లో విద్యాలయాలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. దుబాయ్​లో బయట తిరగటం నిషేధించారు. ఖతార్​లో కంపెనీలు అన్ని మూత పడ్డాయి. కువైట్​లో నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఎవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, రాష్ట్రానికి చెందిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) అప్రమత్తమయ్యాయి. తగు సూచనలు జారీ చేస్తున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగుతుందేమో అన్న భయంతో అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు భారత రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు.

విధుల్లో ఉండగానే క్షిపణి దాడి: బహ్రెయిన్ విమానాశ్రయంలో ఏసీ మెకానిక్​గా కడప జిల్లా బద్వేలులోని లక్కవారిపల్లెకు చెందిన నాగరాజు పని చేస్తున్నారు. ఆయన విధుల్లో ఉండగానే విమానాశ్రయం పై క్షిపణి దాడి జరిగింది. ప్రాణాలతో బతికి బయట పడ్డారు. 14 రోజులు ఎవరూ బయటికి రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. అన్ని పనులను నిలిపి వేశారని తెలిపారు.

వారానికి సరిపడా సరుకుల్ని సిద్ధం చేసుకోమన్నారు: అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన శెట్టి సతీశ్ 9 ఏళ్లుగా బహ్రెయిన్​లో ఉంటూ గల్ఫ్ ఫార్మసీలో పని చేస్తున్నారు. ఆయన నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో బాంబుల వర్షం కురిసింది. పొగ ఎగిసిపడుతూనే ఉందని అన్నారు. దాడుల సమయంలో ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోందని తెలిపారు. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. వారానికి సరిపరడా సరుకుల్ని సిద్ధం చేసుకోమన్నారు. ఇక్కడ 50 వేల మంది వరకు తెలుగువారు ఉన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక్కకడి ఇండియన్ ఎంబసీ హెల్ప్​లైన్ నంబరు పెట్టి, మద్దతుగా నిలుస్తోందని అన్నారు.

ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన: నర్సీపట్నం చెందిన గోపాన శివప్రసాద్ బహ్రెయిన్​లోని అమెరికా ఎక్స్​ప్రెస్ కంపెనీలో పని చేస్తున్నారు. మేముంటున్న ప్రాంతానికి 6 కిలో మీటర్ల దూరంలో క్షిపణి, డ్రోన్ దాడులు హోరెత్తుతున్నారన్నారు. స్వస్థలానికి వచ్చేద్దామని బయలు దేరే సమయానికి డ్రోన్ దాడితో విమానాశ్రయం కూడా పాక్షికంగా దెబ్బ తింది. విమానాల రాకపోకల్ని నిలిపి వేశారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామన్నారు. మేమున్న చోటే రాజమహేంద్రవరానికి చెందిన పలువురు ఉన్నారు. ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ ఉంటున్నామని అన్నారు.

పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి: శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మునిరాజ్ అబుధాబిలోని గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నారు. యుద్ధ విమానాలు భారీ శబ్దంతో పై నుంచి వెళ్తుంటే చాలా భయమేస్తోందన్నారు. మేం సిటీకి దూరంగా ఉన్నాం. పరిస్థితి చక్కబడితే కంపెనీ వారు స్వస్థలాలకు పంపిస్తామని చెబుతున్నారు. ఇక్కడి పరిస్థితిని తెలియజేసేందుకు ఫోన్లకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని స్వస్థలాలకు తీసుకెళ్లాలి.

బయటికి రావడం నిషేధించారు: శ్రీకాకుళానికి చెందిన విశ్వేశ్ దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్నారు. "యుద్ధ వాతావరణం ఉండటంతో ఇక్కడ ప్రభుత్వం ఎవరిని కూడా బయటకు రావద్దని నిషేధాజ్ఞులు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇళ్లలేనే ఉండాలని అన్నారు. ఆదివారం అక్కడక్కడా బాంబులు పడ్డాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని" విశ్వేశ్ అన్నారు.

నిరంతరం సైరన్ల మోత: డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సాయి 2 ఏళ్లుగా కువైట్​లో పని చేస్తున్నారు. ''యుద్ధ నేపథ్యంలో కువైట్ అధికారులు సైరన్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. మేముండే ముతాలాలో రాత్రి క్షిపణి శకలాలు పడ్డాయి. భయం భయంగా బతుకుతున్నామని'' సాయి తెలిపారు.

ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాం: యుద్ధ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీఎన్​ఆర్​టీ సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలిసున్నామని ఎన్​ఆర్​ఐ టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అన్నారు. సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులను ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తగు సూచనలు ఇస్తున్నామన్నారు.

అబుధాబిలో చిక్కుకున్న వారిని ఒమన్ వరకు వాహనాల్లో తీసుకెళ్లి అక్కడి నుంచి విమానాల్లో హైదరాబాద్​కు 200 మందిని తరలించామన్నారు. ప్రవాసాంధ్రుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏపీఎన్​ఆర్​టీ, టీడీపీ ఎన్​ఆర్​ఐ విభాగం అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయా దేశాలు జారీ చేసే సూచనల్ని ప్రవాసాంధ్రులకు తెలియ జేస్తున్నామని అన్నారు.

  • ప్రత్యేక హెల్ప్​లైన్ నంబర్లు ఇవే: గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల భద్రత కోసం ఏపీఎన్​ఆర్​టీఎస్ ప్రత్యేక హెల్ప్​లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. 0863 2340678, 85000 27678 నంబర్లు 24 గంటలు కూడా అందుబాటులో ఉంటాయి.

మంత్రి నారా లోకేశ్ సాయం - గల్ఫ్​లో చిక్కుకున్న మహిళ క్షేమంగా ఇంటికి

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు: మంత్రి కొండపల్లి