ETV Bharat / state

ధరణి డాక్యుమెంట్లపై విచారణ - ఆందోళనలో పలువురు తహసీల్దార్లు, డీటీలు

యాజమాన్య హక్కుల అక్రమ మార్పిడిపై కలెక్టర్లు సీరియస్‌ - అనుమానితులకు నోటీసులు - దళారుల ప్రమేయంపైనా దృష్టి - ఈ అక్రమంలో సాయం అందించిన మాజీ ధరణి ఆపరేటర్లు

Dharani Portal Loopholes And Backdoor Access
Dharani Portal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 7, 2026 at 10:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Investigation on Dharani Portal Backdoor Access Transactions : గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూ దోపిడీపై విచారణ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలను వేగవంతం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమం వెనుక కీలకంగా ఉన్న పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు. రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని విచారణ అధికారులు గుర్తించారు.

తహసీల్దారు, నాయబ్‌ తహసీల్దార్లు (డీటీ), ధరణి ఆపరేటర్లను ప్రశ్నించి అనుమానాలు బలపడినచోట సంజాయిషీ సమన్లు జారీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాజీ రెవెన్యూ ఉద్యోగులు, కొందరు దళారుల పాత్ర వెలుగు చూసినట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో భూ యజమానులకు తెలియకుండానే వారి భూములు ఇతరుల పేర్లపైకి మారడం క్షేత్రస్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.

సెల్‌ఫోన్‌కు ఓటీపీ రాకుండానే : ధరణి పోర్టల్‌లో పట్టా భూముల యాజమాన్య హక్కులు ఇతరుల పేర్ల మీదకు మార్చాలంటే భూ యజమానికి తెలియకుండా చేయడం అసాధ్యమైన పని. యజమాని ఆధార్, బయోమెట్రిక్, ఫోన్‌ నంబరు ఉంటేనే హక్కుల మార్పిడి పూర్తి అవుతుంది. యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ సంఖ్యను నమోదు చేశాకే కంప్యూటర్‌లో లావాదేవీ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు సైతం మస్కా కొట్టించి ఎకరాలకు ఎకరాలు ఇతరుల పేర్లపైకి అక్రమంగా మార్చేశారు.

వెలుగులోకి కొన్ని ఉదంతాలు :-

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌లో 1.18 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని ఏ మాత్రం యజమానికి తెలియకుండా వేరే వ్యక్తుల పేర్లపైకి ఎక్కించేశారు. నిషేధిత జాబితాలో (22 ఎ) ఉండే ఎసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌- మ్యుటేషన్‌ చేయడం అస్సలు సాధ్యం కాదు. పైగా యజమాని, అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా చేయడం కుదరదు. కానీ, ఇక్కడ ధరణి ఆపరేటర్, మరి కొంత మంది సిబ్బంది కలిసి టెక్నాలజీని ఉపయోగించి హక్కుల మార్పిడికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం దీనిపై జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్ పాటిల్ చర్యలు తీసుకున్నారు.
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు రైతులకు చెందిన భూమి వేరే వ్యక్తుల పేర్లపైకి మారింది. రైతులు దీనిని గుర్తించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమం బయటకు వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
  • రాజధాని హైదరాబాద్​కు ఆనుకుని ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కమర్షియల్​ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది.

పాత్రధారులపై ఆరా క్షేత్రస్థాయిలో అధికారుల్లో గుబులు : రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎన్‌ఐసీ, సైబర్‌క్రైం తదితర విభాగాలతో ఏర్పడిన దర్యాప్తు బృందం అక్రమార్కులు చేసిన అరాచకాలను వెలికితీస్తోంది. తప్పుడు దారిలో హక్కులు మార్చడానికి ధరణి, ప్రస్తుత భూభారతి పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌కు ఏ విధంగా గండి కొట్టారనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కొందరు మాజీ ధరణి ఆపరేటర్లు ఈ ప్రక్రియలో సాయం అందించినట్లు సమాచారం. అక్రమాల వెనుక ఉన్న పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర సిబ్బంది కొంత కలవరపాటుకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్‌ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్‌ లాగిన్‌లను, అక్రమ లావాదేవీల ఫుట్‌ప్రింట్స్‌ను సైబర్‌ ఎక్స్​పర్ట్స్​ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

ధరణిలో దొంగలు - 10 వేల ఎకరాలు స్వాహా!

భూ భారతి పోర్టల్​​లోకి చొరబడిన దొంగలు - రాత్రికి రాత్రే రూ.కోట్ల విలువైన భూముల మార్పిడి