'న్యాయం చేయండి' - కలెక్టర్‌ను కోరిన రాధా గాయత్రి తండ్రి
న్యాయం చేయాలని మసూరీ కలెక్టర్‌ను ఆశ్రయించిన గాయత్రి తండ్రి - కలెక్టర్ ఆశిష్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చి విశాఖకు వచ్చిన సుధాకర్ - రాధా గాయత్రి ఐఫోన్ లాక్ తీయడానికి ప్రయత్నాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 1:45 PM IST
Software Engineer Radha Gayatri Case : విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి మృతి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలంటూ గాయత్రి తండ్రి మసూరీ కలెక్టర్ ఆశిష్ చౌహాన్‌ను ఆశ్రయించి వినతిపత్రం ఇచ్చారు. గాయత్రి కేసు దర్యాప్తు చేస్తున్న విచారణాధికారి సంపూర్ణానంద్ గైరోలా ఆమె ఐఫోన్ లాక్ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లుడిపై గాయత్రి తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సుధాకర్ ఫిర్యాదుతో శ్రీచరణ్‌పై హత్యా నేరం కింద మసూరీలో కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత శ్రీచరణ్ కనిపించకుండా వెళ్లిపోయారు.
పథకం ప్రకారమే శ్రీచరణ్ హత్య: ఉత్తరాఖండ్‌లోని మసూరీలో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసులో వేళ్లన్నీ ఆమె భర్త శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, తెల్లారేసరికి భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని శ్రీచరణ్ చెప్పినవన్నీ కట్టుకథలేనని రాధా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
భర్త అనుమానమే ఆమె పాలిట శాపంగా మారిందని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు సైతం శ్రీచరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రాధా గాయత్రిని ముందస్తు పథకం ప్రకారమే శ్రీచరణ్ హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాధాగాయత్రి మృతి కేసులో న్యాయం చేయాలని స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
లోతుగా దర్యాప్తు జరగాలి: టెకీ రాధాగాయత్రి మృతి కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని తమ కుమారుడుకు సూచించినట్లు అతడి తండ్రి దుర్గాప్రసాద్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రాధాగాయత్రి అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మసూరీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీచరణ్ తండ్రి స్పందించారు.
‘‘శ్రీచరణ్-రాధా గాయత్రి సంతోషంగా ఉండేవారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియడం లేదని శ్రీచరణ్ తండ్రి అన్నారు. రాధాగాయత్రి ఇంట్లో చాలా సరదాగా కబుర్లు చెప్పేదన్నారు. కోడలి కంటే మంచి ఫ్రెండ్ చనిపోయిందనే బాధపడ్డారు. ఈ అంశంలో లోతుగా దర్యాప్తు జరగాలి, మృతికి కారణాలు తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక రావాలి అని శ్రీచరణ్ తండ్రి అన్నారు. తప్పెవరిదో నిర్ణయించడానికి ధర్మాసనం ఉందని దుర్గాప్రసాద్ అన్నారు.
అసలేం జరిగిదంటే: విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన సుధాకర్, సత్యవతి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె రాధాగాయత్రి, తండ్రి ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి. చిన్నతనం నుంచి గాయత్రి చదువులో చురుకుగా ఉండేది. 6 నుంచి 10 వరకు పెందుర్తిలో, ఎంకామ్, ఎంబీఏ ఏయూలో పూర్తిచేసింది. సోషియాలజీలో పీహెచ్‌డీ చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో దిల్లీలో ఉద్యోగానికి ఎంపికైంది. గతేడాది నవంబర్ 8న విశాఖకు చెందిన శ్రీచరణ్‌తో ఆమెకు వివాహమైంది.
ఇద్దరూ గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. దంపతులు విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. ఈనెల 21, 22 తేదీల్లో తన పుట్టింట్లో వ్రతం, ఇతర పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మే 17 కల్లా వస్తానని గాయత్రి చెప్పింది. ఇంతలో ఏమైందో కానీ మే 15న గాయత్రి ముస్సోరిలోని ఓ హోటల్ రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'ముమ్మాటికీ మా అల్లుడు సైకో' - టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రుల ఆవేదన

