ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు
షా రోబోటిక్స్ సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో శిక్షణ - మల్టీపర్పస్ ఆర్డినో నానో కిట్లు తయారు చేసిన విద్యార్థులు - శరీర ఉష్ణోగ్రత, ఒత్తిడిని అంచనా వేసే సెరినాటిక్ ఫ్యూచర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 25, 2026 at 11:59 AM IST
Inventions by Government School Students: పాఠశాల స్థాయిలోనే ప్రయోగాలు చేస్తున్నారు ఆ విద్యార్థులు. చదివేది 8,9,10 వ తరగతులు. ఆవిష్కరణల్లో మాత్రం అంతకు మించి ప్రతిభ చూపిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకొని వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత, ఒత్తిడి అంచనా వేసే మెషీన్లతో పాటు పలు ప్రాజెక్టులు రూపొందించారు. ఇంతకీ ఎవరా విద్యార్థులు? వారు తయారు చేసిన ఆ ఆవిష్కరణలేంటి ? వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
షా రోబోటిక్స్ తోడ్పాటు: ప్రస్తుతం 8, 9, 10వ తరగతి చదువుతున్న కృష్ణాజిల్లా నిడమానూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బడిలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ప్రయోగశాల ద్వారా శాస్త్ర, సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఆవిష్కరణలు చేస్తున్నారు. పిల్లల ఆసక్తిని గమనించి ఉపాధ్యాయులతో పాటు షా రోబోటిక్స్ సంస్థ తోడ్పాటు అందిస్తోంది.
శరీర ఉష్ణోగ్రత, ఒత్తిడిని అంచనా వేసే సెరినాటిక్ ఫ్యూచర్ ప్రమాదాల నివారణకు అబ్‌స్టకల్స్ అవైడింగ్ రోబోటిక్స్‌ని నిడమానూరు విద్యార్థులు రూపొందించారు. దివ్యాంగులు, ఒంటరి వృద్ధులకు పనికొచ్చేలా ట్రాలీ రోబోటిక్స్ ప్రాజెక్టుని తయారు చేశారు. దీని ద్వారా 500కిలోల బరువులను సులువుగా ఒకచోట నుంచి మరోచోటకి తరలించవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాప్ లలో సమాచారం, ప్రకటనల ప్రదర్శన కోసం వినియోగించే అధునాతన డిస్ ప్లే స్క్రోలింగ్ ఎల్ఈడీ కూడా నిడమానూరు విద్యార్థుల చేతుల్లో రూపు దిద్దుకున్నాయి.
'పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలోనూ తమ ప్రతిభతో సందర్శకులు, అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. ఈ విద్యార్థులు ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన విద్యా ఎక్స్‌పోలో తమ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.' -రమాదేవి, ప్రధానోపాధ్యాయురాలు
ఎన్నో ప్రయోగాలు, శాస్త్ర, సాంకేతికత కోసం పాఠశాలలోని అటల్ టింకరింగ్ ప్రయోగ శాలనే విద్యార్థులు వేదికగా చేసుకున్నారు. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్, బిగ్ బ్యాంగ్ సాంకేతికతను ఉపయోగించుకుని ప్రాజెక్టులు తయారు చేశారని మెంటర్ చెబుతున్నారు. అన్ని రంగాల్లో సాంకేతిక వినియోగం తప్పనిసరిగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయడం అభినందనీయం.
స్టార్టప్‌లకు వేదికగా విజయవాడ ఐడియాథాన్- విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు
యువత మేధస్సుకు సలామ్ - అద్భుత ఆవిష్కరణలకు వేదిక 'టెక్‌ట్రిక్స్ 2026' ఎక్స్‌పో

