ETV Bharat / state

YUVA: డీఎస్పీ సాయిచరణ్ - 50 సార్లు ఫెయిల్ అయినైనా పట్టు వదల్లేదు

DSP Saicharan Interview - ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది అతడి చిరకాల స్వప్నం. ఆ లక్ష్యసాధనలో ఏకంగా 50 పరీక్షలు ఫెయిల్​ అయ్యాడు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి 12 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు.

Saicharan, DSP
డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకున్న సాయిచరణ్​ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 13, 2026 at 5:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

DSP Saicharan Interview : సామాన్య మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది అతడి చిరకాల స్వప్నం. ఆ లక్ష్య సాధనలో ఒకటీ రెండు కాదు ఏకంగా 50 పరీక్షల్లో వైఫల్యం ఎదురైన అతడిని ఏమాత్రం కుంగదీయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించి ఏకంగా 12 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు నల్గొండకు చెందిన సాయిచరణ్. చిన్నప్పటి నుంచి తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి చలించిపోయి, సమాజానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో గ్రూప్-1లో విజయం సాధించి డీఎస్పీ కొలువు దక్కించుకున్నాడు. తెలంగాణ పోలీస్ అకాడమీలో 46 వారాల పాటు కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని డీఎస్పీగా విధుల్లో చేరబోతున్న సాయిచరణ్​ను ఈటీవీ భారత్ పలకరించింది.

మీ బ్యాగ్రౌండ్​ ఏంటి?

నా పేరు సాయిచరణ్​. మాది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట పట్టణంలో పుట్టి పెరిగాను. అక్కడే పదో తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ట్రిబుల్​ ఐటీ బాసరలో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్​ ప్రోగ్రామ్​ను పూర్తి చేశాను. నాకు ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ ఉండేది. మా నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు మమ్మల్ని ప్రోత్సహించారు. ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడూ చెప్తుండేవారు. నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. అలా నేను ప్రభుత్వ ఉద్యోగాల వైపు వచ్చాను. 2016 నుంచి నేను యూపీఎస్సీ ప్రిపేరేషన్​ను మొదలుపెట్టాను. వరుసగా 10 నుంచి 11 జాబ్​లు తెచ్చుకున్నాను. ఇది పన్నెండో ఉద్యోగం. గతంలో నేను లేబర్​ ఇన్​స్పెక్టర్​​గా సెంట్రల్​ గవర్నమెంట్​లో పనిచేశాను.

మీరు 12 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ క్రమంలో మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నారు?

మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగమనేది చిరకాల స్వప్నంలాగా ఉంటుంది. దానికి అనుగుణంగా నేను చాలా కష్టపడ్డాను. ప్రతి పరీక్షను నేను ఫైనల్​ మ్యాచ్​గా తీసుకుని రాశాను. ఆ క్రమంలో నేను ఈ ఉద్యోగాలను సాధించాను.

మీకు అమ్మానాన్నల ప్రోత్సాహం ఎలా ఉండేది?

వాళ్లు ఉన్నారు కాబట్టే ఈరోజు నేను ఉన్నాను. నేను ప్రిపేర్​ అయ్యే సమయంలో సమాజం, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ అక్క-బావ, అమ్మానాన్న నా తోడుగా ఉండటం వల్లనే నేను గ్రూప్​-1 ను సాధించాను.

భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు?

ప్రజాసేవే నా లక్ష్యం. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాగే నేను చూసిన అన్యాయాలు నన్ను కలిచి వేశాయి. అందుకే కచ్చితంగా నేను ప్రజలను ఆదుకుంటాను. ప్రజలు ఎదుర్కొనే కష్టాలు నావి అనుకుని కృషి చేస్తాను.

సివిల్స్​కు సన్నద్ధమయ్యే యువతకు మీరు ఏం సందేశం ఇస్తారు?

నేను 11 ఉద్యోగాలు కొట్టాను. అంతకుముందు నేను 50 పరీక్షలు రాశాను. అవన్నీ నేను ఫెయిల్​ అయినవే కదా. ఫెయిల్​ అవ్వడమనేది సాధారణం. ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమయ్యేటప్పుడు స్థిరత్వమనేది ఉండాలి. చాలామంది విసిగిపోయి ప్రిపేరేషన్​ను వదిలేస్తారు. ఇది నేను గమనించాను. అలా కాకుండా ఎన్ని అవరోధాలు ఎదురైనా వేచిచూడాలి.

YUVA: హైదరాబాద్​ కేంద్రంగా తొలిసారి మొబైళ్ల తయారీ - 'మివి బ్రాండ్'​ ప్రత్యేకతలు ఇవే!