73 సార్లు తప్పించుకున్న అంతర్రాష్ట్ర దొంగ - చివరకు ఓ మహిళ కంప్లైంట్‌తో చిక్కాడిలా
ఏడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర కేటుగాడు అరెస్ట్ - ఏటీఎంల వద్ద జనాలను బురిడీ కొట్టిస్తున్న రామారావు - తెలుగు రాష్ట్రాల్లో సుమారు 73 సార్లు మోసాలు

Published : May 1, 2026 at 4:41 PM IST
Man Involved in 73 Crimes Arrested in Hyderabad : మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? ఎవరైనా వచ్చి సాయం చేస్తామంటున్నారా? అయితే జాగ్రత్త! మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రూ.లక్షలు దోచుకుని పోతాడతను. పెద్ద చదువులే చదివాడు కానీ, చేసేది మాత్రం హైటెక్ మోసాలు. ఏడేళ్లుగా పోలీసులకే దొరక్కుండా మాయాజాలం చేస్తున్న ఆ అంతర్రాష్ట్ర కేటుగాడి ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి బెట్టింగ్‌ల కోసం బాధితులను ఆ కేటుగాడు ఎలా బురిడీ కొట్టించాడో ఇప్పుడు చూద్దాం.
అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని టెక్నాలజీతో మాయాజాలం చేస్తూ ఏడేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళను నిందితుడు ఇలానే బోల్తా కొట్టించాడు. బాధితురాలు కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎంకు రూ.ఒక లక్ష డిపాజిట్ చేయడానికి రాగా మాటలతో మాయ చేశాడు.
విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు : బాధితురాలు సాయంత్రం వరకు డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఏటీఎం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సికింద్రాబాద్‌లోని జేబీఎస్ డార్మిటరీలో తలదాచుకుంటున్నట్లు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన రామారావును నిందితుడిగా గుర్తించారు. నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద మరొకరిని మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి తెలిశాయి. తెలంగాణలో ఈ ఏడాదిలో నిందితుడిపై 8 కేసులను నమోదు చేసినట్లు గుర్తించారు.
''ఓ లేడీ ఏటీఎం వద్దకు రూ.లక్ష క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చింది. నిందితుడు ఆమె వద్ద నుంచి రూ.లక్ష తీసుకొని నిఫ్టీ ద్వారా ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తానని ఆమెను నమ్మించి ఒక ఫేక్ మెసేజ్ చూపించి ఆ డబ్బుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా నిందితుడు రామారావు అలియాస్ శ్రీరామ్ ఏటీఎం వద్దకు వచ్చే వారికి మాయమాటలు చెప్పి నమ్మిస్తాడు. ముందుగా నిందితుడు ఏటీఎం డిపాజిట్ సెంటర్స్ టార్గెట్ చేసుకుంటాడు. అక్కడ ఎవరైతే డిపాజిట్ చేయడానికి వస్తారో వాళ్లను ఎంపిక చేసుకొని మాయమాటలు చెప్పి, క్యాష్ తీసుకొని వెళ్తాడు'' - శిల్పవల్లి, ఖైరతాబాద్ డీసీపీ
73 సార్లు మోసం చేసి నగదు కాజేసిన నిందితుడు : రామారావు 2018 నుంచి 2025 మధ్య కాలంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు 73 సార్లు ప్రజల దృష్టి మళ్లించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో అనేక అప్పులు చేశాడు. బెట్టింగ్‌కు అలవాటు పడి ఇలా మోసాలు చేయడంలో ఆరి తేరాడు. నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి కొట్టేసిన సొమ్మును దాచుకున్న అతని బ్యాంక్ ఖాతాలోని రూ.2 లక్షల 40 వేల నగదును వెంటనే ఫ్రీజ్ చేయించారు. ఏటీఎంల వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు నగదు చేతికి ఇవ్వవద్దని పోలీసులు విజ్జప్తి చేస్తున్నారు. మీ అధికారిక బ్యాంక్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాతే లావాదేవీలు జరపాలని సూచించారు. అపరిచితులకు మీ ఫోన్ నంబర్, పిన్, ఓటీపీలు చెప్పవద్దని కోరారు.
''అతను ఇంజినీరింగ్ చదివి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు డబ్బులు ఎక్కువగా ఉపయోగించి వాటిని తిరిగి కట్టడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు. ఆ తర్వాత మరో చిన్న జాబ్ చేసుకుంటూ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. అలా బెట్టింగ్ వ్యసనంలో పడి ఖర్చుల కోసం 2018 నుంచి ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టాడు'' - శిల్పవల్లి, ఖైరతాబాద్ డీసీపీ
ఏకంగా ATMనే ఎత్తుకెళ్లిపోయారు - అదీ పోలీస్‌స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలోనే
దొంగగా మారిన డ్రైవర్ - రోజుకు రూ.2 లక్షలతో లగ్జరీ లైఫ్ - చివరికి ప్రేయసి కారణంగా?

