ETV Bharat / state

'భూ భారతి'తో రూ.కోట్లు కొల్లగొట్టిన నెట్ సెంటర్ నిర్వాహకుడు - ఇలా ఏ'మార్చాడు'

భూ భారతి పోర్టల్‌లో లొసుగును కనిపెట్టి ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడి దందా - జనగామలో ఓ వ్యక్తి ఫిర్యాదుతో వెలుగులోకి - నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

INTERNET CENTER OWNER SCAM
INTERNET CENTER OWNER SCAM (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 2:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bhu Bharati Portal Scam : భూముల రిజిస్ట్రేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్​ను కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. ఆ పోర్టల్​లో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే? : భూ భారతి పోర్టల్‌లో ఓ లొసుగును ఆసరాగా చేసుకుని ఓ ఇంటర్‌నెట్‌ సెంటర్ నిర్వాహకుడు సైబర్‌ మోసానికి తెర తీశాడు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా తక్కువ నగదు పంపుతూ రెవెన్యూ శాఖకు రావాల్సిన రూ.కోట్ల సొమ్మును కాజేశాడు. ఇంటర్నెట్‌ సెంటర్​ల నిర్వాహకులు భూభారతిలో స్లాట్లను బుక్‌ చేస్తూ, భూముల రిజిస్ట్రేషన్‌ సొమ్మును నెట్‌ బ్యాంకింగ్‌ విధానం ద్వారా చెల్లిస్తుంటారు. ఒక్కోసారి రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం, అంత మొత్తం ఖాతాల్లో లేకపోవడం లాంటి సమస్యలతో జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డు వైపు ఉన్న మూడు కేంద్రాల నిర్వాహకులు యాదగిరిగుట్టకు చెందిన ఓ ఇంటర్నెట్‌ నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్నారు.

రూ.లక్షకు రూ.5 వేల కమీషన్ తీసుకుని : ఇంటర్​ నెట్ సెంటర్ నిర్వాహకుడు రూ.లక్షకు రూ.5 వేల కమీషన్‌ తీసుకొని వారికి సంబంధించిన స్లాట్లకు భూ భారతి పోర్టల్‌ ద్వారా రెవెన్యూ శాఖ (సీసీఎల్‌ఏ)కు నగదు చెల్లించే వాడు. అయితే పోర్టల్‌లో ‘ఎడిట్‌’ ఆప్షన్‌ను కనుగొన్న అతను, తక్కువ డబ్బులను చెల్లించి మిగతాది కాజేయడం మొదలుపెట్టాడు. ఉదాహరణకు రూ.1,50,000 చెల్లించాల్సి ఉంటే, దాన్ని రూ.1,500గా మార్చి చెల్లించేవాడు. ఈ విషయం సీసీఎల్‌ఏ అధికారులకు కూడా తెలిసేది కాదు. మూడు రోజుల కిందట ఓ ఇంటర్‌నెట్‌ కేంద్రం నిర్వాహకుడు తను బుక్‌ చేసిన స్లాట్‌కు తక్కువ డబ్బులు చెల్లించినట్లుగా గుర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు : తమకు అందిన ఫిర్యాదు మేరకు వరంగల్ సీసీఎస్​ పోలీసులతో కలిసి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు యాదగిరిగుట్టకు చెందిన నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నాడు? ఇప్పటి వరకు ఇలా ఎన్ని చేశాడు? అనే అంశాలపై అతడిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అతను జనగామతో పాటు యాదాద్రి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లుగా తెలిసింది. పోలీసులు రేపోమాపో నిందితుడి అరెస్టును చూపించి, పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లుగా సమాచారం. గురువారం జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్​లు జనగామ తహసీల్దారు ఆఫీస్​కు వెళ్లి భూభారతి పోర్టల్‌ను పరిశీలించారు.

మార్చినాటికి నూతన పోర్టల్​ అందుబాటులోకి : సర్వే, స్టాంపులు, రెవెన్యూ శాఖలకు సంబంధించి భూముల సమాచారమంతా ఒకేచోట తెలుసుకునేలా మార్చి నాటికి కొత్త భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇటీవల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయేతర, దేవాదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర భూముల వివరాలన్నీ ఈ పోర్టల్‌లో పరిశీలించవచ్చని తెలిపారు. రెవెన్యూ శాఖ అందుబాటులోకి తీసుకురానున్న పూర్తిస్థాయి భూ భారతి పోర్టల్​ తెలంగాణ ప్రజలకు ఇక బహుళ ప్రయోజనకారిగా మారబోతుందన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే దాదాపు కొలిక్కి రాగా, కొన్నిరోజులు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లుగా సమాచారం. కొత్త పోర్టల్​ అందుబాటులో వచ్చినట్లయితే పలు రకాల సేవలు ఒకే చోట లభ్యం కానున్నాయి. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కానుంది.

ఈ ఏడాదే కొత్త భూభారతి పోర్టల్​ - ఇంతకీ ఏ నెలలోనో తెలుసా?

'భూ భారతి' అప్​గ్రేడ్​ వెర్షన్​ - ఇక అన్ని భూ సేవలు ఒకేచోట