ఒక్కో జిల్లాలో ఒక్కో థీమ్ - కోటి మందితో 'యోగాంధ్ర-2026'
జూన్ 21న రాష్ట్రవ్యాప్త వేడుక - అమరావతిలో 25,000 మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం - ప్రతి జిల్లాకూ ఒక ప్రత్యేక థీమ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2026 at 4:57 PM IST
International Yoga Day Celebrations In AP : ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని యోగా చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తోంది. యోగా ప్రాధాన్యం గురించి తెలిపేలా ఆసనాలు, ప్రయోజనాలు, సందేశాలు, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనేందుకు భారీ అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం "యోగాంధ్ర-2026" పేరుతో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
జూన్ 7 నుంచి 21 వరకు యోగా కార్యక్రమాలు : జూన్ 7 నుంచి జూన్ 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో పాటు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో 25,000 మంది భాగస్వామ్యంతో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం జరపనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు కోటి (10 మిలియన్ల) మంది ప్రజలను యోగా కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాంతానికి ఒక థీమ్ : ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కొత్తగా కార్యక్రమాన్ని నిర్వహించాలని పూనుకుంది. అందుకోసం ప్రతి జిల్లాకూ ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని లేదా సమూహాన్ని వారికి నచ్చిన థీమ్‌ను ఎంచుకుంటూ "యోగాంధ్ర" కార్యక్రమాన్ని వినూత్న రీతిలో నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉదాహరణకు NTR జిల్లాలో పోలీసు సిబ్బందితోనూ, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రతి ఒక జిల్లా నిర్వహిస్తుంది కాబట్టి, ప్రతి జిల్లా నుంచి 28 వినూత్న థీమ్‌లను చూసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా తప్పనిసరిగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం 1,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో యోగా పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. విద్యార్థులు, క్రీడాకారులు, మహిళా స్వయం సహాయక బృందాలు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశ్రామిక కార్మికులు, సమాజంలోని ఇతర వర్గాల ప్రజలు ఇందులో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
- పాఠశాలలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, స్టేడియాలు, గ్రామ సచివాలయాలతో సహా యోగా కార్యక్రమాలు జరిగే వివిధ వేదికల వద్ద తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు (కుర్చీలు), తాత్కాలిక షెల్టర్లు (షామియానాలు) వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించనున్నారు.
- "యోగాంధ్ర" కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. 100కి పైగా పర్యాటక ప్రదేశాలలో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను ప్రభుత్వం పర్యాటక శాఖకు అప్పగించింది.
- 14 రోజుల పాటు, 'యోగాంధ్ర' బ్యానర్‌పై సోషల్ మీడియా ప్రచారాలు, ప్రదర్శనలు, వాక్‌థాన్‌లు, అవగాహన కార్యక్రమాలు అధికారులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని సులభతరం చేయడానికి, ఒక వెబ్ పోర్టల్‌తో పాటు, AI-ఆధారిత నమోదు, ధృవీకరణ యాప్ అభివృద్ధి చేయనున్నారు. పాల్గొనేవారందరికీ డిజిటల్ ధృవపత్రాలు జారీ చేస్తారు.
రాష్ట్ర జిల్లాలు - వివిధ రకాల థీములు
- ఎన్టీఆర్ - పోలీసులు
- తూర్పుగోదావరి - ఖైదీలు
- అంబేడ్కర్ కోనసీమ - రైతులు
- విశాఖపట్నం - సైనికులు, మాజీ సైనికులు
- అన్నమయ్య- అంగన్వాడీ- ఆరోగ్య కార్యకర్తలు
- చిత్తూరు- వైద్యులు, వైద్యాధికారులు
- కృష్ణా- ఆటో, లారీ డ్రైవర్లు
- వైఎస్సార్ కడప - కుటుంబాల్లో అన్ని తరాలతో..
- శ్రీకాకుళం -మత్స్యకారులు
- అల్లూరి సీతారామరాజు -గిరిజనులు
- పల్నాడు - ఆశా, ఏఎన్ఎంలు
- కాకినాడ -ఉపాధ్యాయులు
- నెల్లూరు - రెసిడెన్షియల్ అసోసియేషన్, ఎన్జీవోలు
- పోలవరం - అటవీ ఉద్యోగులు,అటవీ కమిటీ సభ్యులు
- బాపట్ల -యువత, సాంస్కృతిక కళాకార
- విజయనగరం- ఉపాధి హామీ శ్రామికులు
- శ్రీ సత్యసాయి-వ్యాపారులు
- అనకాపల్లి-పారిశ్రామిక కార్మికులు
- ఏలూరు-విద్యార్థులు
- అనంతపురం-దివ్యాంగులు
- కర్నూలు-పారిశుద్ధ్య కార్మికులు
- తిరుపతి-సెలబ్రిటీలు
- నంద్యాల-యోగా అసోసియేషన్
- గుంటూరు-ఇంజినీరింగ్ విద్యార్థులు
- పశ్చిమ గోదావరి-అథ్లెటిక్స్, క్రీడా బృందాలు
- ప్రకాశం-డ్వాక్రా మహిళలు
- మార్కాపురం-పాడి రైతులు
- పార్వతీపురం మన్యం-వృద్ధులు
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించాలి: మంతెన సత్యనారాయణరాజు
'కలిసొచ్చిన అవకాశం, మర్చిపోలేని మధుర క్షణం' - 2 గంటలు జోరుగా, హుషారుగా!

