విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ - గగనతలంలో సందడి చేసిన హెలికాప్టర్లు, విమానాలు
విశాఖ బీచ్ రోడ్‌లో ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ - ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్ - మిలాన్ 2026ను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి - సందర్శకులను ఆకట్టుకున్న యుద్ధనౌకల విద్యుద్దీపాలు, బాణసంచా వెలుగులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 10:47 PM IST
International City Parade held in Visakha Beach: విశాఖ బీచ్ రోడ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మిలాన్ 2026ను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. నావికాదళాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి మిలాన్ 2026 ప్రయత్నిస్తోందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఏడాది 74 దేశాల భాగస్వామ్యంతో మిలాన్ 2026 ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యంత సమగ్రమైన ఎడిషన్‌గా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఇది భారత్‌పై ప్రపంచ సముద్ర సమాజం ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.
భారత నౌకాదళం నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకల సమీక్ష(ఐఎఫ్ఆర్), మిలన్ 2026, ఇండియన్ ఓషన్ నేషన్స్ సింపోసియంల సందర్బంగా జరిపిన అంతర్జాతీయ సిటీ పరేడ్ దాదాపు రెండున్నర గంటల పాటు వీక్షకులను ఆకట్టుకుంది. నేవీ ఆపరేషన్ డెమో లో హెలికాప్టర్, యుద్ధ విమాన విన్యాసాలు చూపరులను గగుర్పాటు కలిగించాయి. సముద్రంలో కొలువుదిరిన యుద్ధ నౌకలకు సమీపంలో మైరైన్ కమాండోలు చేసిన సాహస కృత్యాలు నౌకాదళ శౌర్యానికి దర్పణంగా నిలిచాయి. గగనతలంలో 60 కిపైగా నౌకాదళ హెలికాప్టర్లు, విమానాలు రకరకాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
సీ క్యాడేట్ కోర్ (scc) బాలికల బృందం చేసిన నృత్యంతో ఉత్సాహభరితంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ బీచ్ రోడ్‌లో వేల మంది ఆసక్తి కరంగా తిలకించారు. 8కి పైగా దేశాల నుంచి నేవీ బ్యాండుల వాయిద్యాలు, 45కి పైగా బృందాలతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సాగింది. కొరుకొండ స్కూల్ విద్యార్ధుల బృందం, నేవీ చిల్డ్రన్ పాఠశాల బ్యాండు, ఎన్సీసీ, ఎస్సీసీ బృందాల కవాతు ప్రదర్శన, ఎపీఎస్పీ, గ్రౌహౌండ్స్ బృందాలు పరేడ్కి హాజరయ్యాయి. ఆస్ట్రేలియా, మాల్డీవ్స్, బంగ్లదేశ్, ఫ్రెంచ్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, మయన్మార్, ఫిలిఫైన్స్, రష్యా, షీషెల్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం నేవీ బృందాలు పరేడ్‌లో పాల్గోన్నాయి. శ్రీలంక నేవీ బ్యాండ్ సారేజహాసే అచ్చా గీతాన్ని అలపించడం విశేషం.
అలరించిన కళారూపాల ప్రదర్శన: వివిధ కళారూపాల ప్రదర్శన అందరిని అలరించాయి. కూచిపూడి, థింసా, గరగలు, కోలాటం, తప్పెటగుళ్లు, గ్రామీణ నృత్యాలు, డప్పు,కొమ్ము నృత్యాలు, పులివేషాలు, డోలు కళాకారులు, అమ్మెరు భక్త తాండవం, వీర శైవ భక్త సంప్రదాయ ప్రదర్శన, జానపద పురాణఘట్టాల గ్రామీణ కళారూపాల ప్రదర్శనలు సాగాయి. పర్యాటక శాఖ శటక ప్రదర్శన, తొట్ల కొండ నమూనా, గిరిజన ప్రాంత అందాలతో రూపకల్పన చేయగా, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ శకటం, వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా శకటం అందరిని ఆలోచింపజేసింది. నేవీ బ్యాండ్ వాద్యగోష్టి, బ్యాండ్ బృందం విన్యాసాలు ఇందులో అన్నింటికి మించి నేవీ కంటిన్యూటీ డ్రిల్ అకట్టుకునేలా సాగింది.
ఈసందర్భంగా నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి మాట్లాడుతూ 74 దేశాలు ఈ ఉత్సవంలో భాగస్వామయ్యాయన్నారు. ఆంధ్రుల ఆతిథ్యం ప్రపంచానికి అంతటికి తెలిసిందనంటూ ప్రసంసించారు. వివిధ దేశాల నేవీల మధ్య సంబంధాలు, దేశాలకు మంచి స్నేహ బంధాలను పటిష్టం చేస్తాయన్నారు. మారిటైం నేషన్‌గా భారత్ బాధ్యతను నేవీపై ఉంచిన నమ్మకాన్ని ఈ కార్యక్రమాలు మరింత పెంచుతున్నాయని అన్నారు. నేవీలన్నింటిని సమైక్యంగా పనిచేయడానికి మిలన్ తోర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తూర్పు తీరంలో విశాఖ నౌకాయాన బంధాలకు ఒక కీలక స్తావరమని ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నేవీలతో సత్సంబంధాలు నెరపడమే భారత్ లక్ష్యంగా ఐఎఫ్ఆర్, మిలన్ వంటి కార్యక్రమాల లక్ష్యమనిచెప్పారు. విశాఖ గ్లోబల్ మారిటైం సిటీగా మరో మారు ఈ ఉత్సవాలు నిలిపాయని గవర్నర్ నజీర్ అన్నారు. సముద్రాలు స్నేహబంధాలకు, వాణిజ్య, శాంతి బంధాలకు వారధులుగా నిలవాలని అకాంక్షించారు. రక్షణ దళాలకు, ప్రజలకు ఉన్న బంధాన్ని ఐఎఫ్ఆర్, మిలన్ 2026 సందర్భంగా జరిగిన ఈ అంతర్జాతీయ ఉత్సవం మరో మారు రుజువు చేస్తోందన్నారు.
వందేమాతరం పూర్తి గేయాన్ని, జాతీయ గీతం జనగణమన నేవీ వాద్య బృందం అలపించింది. అనంతరం సముద్రంలో యుద్ద నౌకల విద్యుద్దీపాలంకరణ దేదీప్యమానంగా సాగింది. బాణాసంచా వెలుగులలో సముద్రం ఉప్పొంగింది. గగన తలంలో రంగురంగుల బాణాసంచా వెలుగు జిలుగులు చూపరులను అకట్టుకున్నాయి. లేజర్ షో, నేవీ డ్రోన్ షో ఔరా అనిపించేలా సాగాయి.
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కి ఫుల్ డ్రస్ రిహార్సల్స్ - పాల్గొన్న 45 బృందాలు
విశాఖ తీరంలో ప్లీట్ రివ్యూ - యుద్ధనౌకల పరేడ్‌ను తిలకించిన రాష్ట్రపతి ముర్ము

