ఈ చిన్నారిది లక్కీ హ్యాండ్ - డ్రా తీస్తే తమ కుటుంబానికే వచ్చిన ఇందిరమ్మ ఇంటి టోకెన్
ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా ప్రక్రియలో ఆసక్తికరమైన సన్నివేశం - టోకెన్ తీసిన బాలుడి కుటుంబాన్నే వరించిన అదృష్టం - వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Published : August 28, 2026 at 5:36 PM IST
Interesting Incident Indiramma Flats Lucky Draw : హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు నేడు లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి లక్ష్మీగూడలో ఆసక్తికరమైన సన్నివేశం ఎదురైంది. లక్కీ డ్రా టోకెన్‌ను ఓ బాలుడితో తీయించగా ఆ చిన్నోడి కుటుంబాన్నే ఇల్లు వరించడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన వీడియోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
చాలా అరుదు ఇలాంటి సన్నివేశాలు : పేదల సొంతింటి కల తీర్చాలనే ఈ ప్రభుత్వ సంకల్పానికి, దేవుడి ఆశీస్సులు తోడైనట్టు చిన్నోడు తీసిన లక్కీ డ్రాలో వారి కుటుంబానికే (జరపుల లక్ష్మీ) టోకెన్ రావడం తమ అందరినీ ఆనందానికి, ఆశ్చర్యానికి గురిచేసిందని మంత్రి చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు, చిన్న పిల్లలు దేవుళ్లతో సమానమని ఆయన గుర్తుచేశారు. చిన్నారులు స్వచ్ఛమైన మనసు కలిగినవారని ఆ దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కల నేరవేరుతున్నందున ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా బతకాలని, ఆ ఆడబిడ్డను ఆశీర్వదించానని మంత్రి వీడియోను షేర్ చేశారు.
నాలుగు రోజుల పాటు లక్కీ డ్రా : మరోవైపు, నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఈ లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని, అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన చేసి వీరిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలో తొలి విడతలో భాగంగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
లక్కీ డ్రాతోనే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు - మరో 10 రోజుల్లో రెండో విడత : పొంగులేటి
మాకు ఏం లేదు - అయినా ఇందిరమ్మ ఇల్లెందుకు రాలేదు? - హౌసింగ్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ

