ఓ వైపు తండ్రి మరణం - మరోవైపు పరీక్ష - పుట్టెడు దుఃఖంలోనే హాజరైన విద్యార్థి
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు - పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 కేంద్రాలు ఏర్పాటు - మొత్తం 10,57,899 మంది విద్యార్థులు - పరీక్షా కేంద్రాల వద్ద సమస్యలు ఏర్పడకుండా పోలీసుల పహారా ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 6:38 PM IST
|Updated : February 23, 2026 at 8:39 PM IST
Father Death Student Attempt Exam in Nellore District : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయ. తొలిరోజు జూనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థికి అగ్నిపరీక్షగా మారింది. ఒకవైపు కన్నతండ్రి మృతదేహనికి అంత్యక్రియలు, మరోవైపు పరీక్ష ఏం చేయాలో తోచని స్థితిలో ఆ బాధను గుండెల్లో నింపుకొని ఇంటర్ పరీక్ష హాజరయ్యాడు ఓ విద్యార్థి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు జూనియర్ ఇంటర్, మరుసటి రోజు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూలు ప్రకటించారు. నేటి నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 సున్నిత కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 10 లక్షల 57 వేల 899 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సమస్యలు ఏర్పడకుండా పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఇవాళ మొదలు ఇంటర్ పరీక్షలు మార్చి 24 వరకు జరుగుతాయని బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు.
విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థికి విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల, నమ్మకమే విజయానికి బాటలు వేస్తాయని గుర్తు చేశారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. తమ అందరి భవిష్యత్తు వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు. ఈరోజు నుండి మార్చి 18 వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు.
పుట్టెడు దుఃఖంలో : నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని కందల రాంసాయి అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి శివకుమార్ ఈనెల 23వ తేదీ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఓ వైపు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు, మరోవైపు పరీక్ష. ఇలాంటి సమయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఆ విద్యార్థి దుఃఖంలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు, కళాశాల కరస్పాండెంట్ మదరాబాషా, సన్నిహితుల సలహాతో పుట్టెడు దుఃఖంతోనే పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షా కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ విద్యార్థిని అందరూ ఓదార్చారు. తండ్రి ఆశయానికి తన విద్య భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పరీక్ష రాస్తున్నట్టు తెలిపాడు.
సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి: కడప జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలలో మొదలైన ఇంటర్ పరీక్షలకు తొలి రోజు 17 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేశారు. పరీక్ష కేంద్ర సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఏ ఒక్క విద్యార్థిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: పర్చూరు నియోజకవర్గాల్లో మొత్తం 688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్, ఐడీ కార్డు పరిశీలన అనంతరం మాత్రమే విద్యార్థులను లోపలికి అనుమతించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.
పోలీస్ సిబ్బంది విద్యార్థులను బైకులపై ఎక్కించుకుని: ఏలూరు జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 34,615 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు ఆలస్యం లేకుండా పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అణువుగా ఎక్కడెక్కడ వాహనాలు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది విద్యార్థులను బైకులపై ఎక్కించుకుని పరీక్షా కేంద్రాలకు చేరవేస్తున్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ: పల్నాడు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 814 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్ అధికారిని ఏర్పాటు చేశారు. అలాగే 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లతో ఎప్పటికప్పుడు పరీక్షలను విద్యాశాఖాధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లా మొత్తం 600 సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షించనున్నారు.
రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు: అనంతపురం జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. 48,146 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా ఉదయం 8:30కే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 124 కళాశాలలో ఉండగా, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 13,131 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం 12,756 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 40 పరీక్ష కేంద్రాలను ఉన్నత విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుక్షణం విద్యార్థుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.చంద్రశేఖర్ బాబు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.
అర మార్కు తక్కువైనా పర్లేదు - ఇంటర్ పరీక్షలలో సంస్కరణలు
పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారా? - ఈ టిప్స్ పాటించండి

