సరిలేరు మీకెవ్వరు : చలి వణికిస్తున్నా, మంచు కప్పేస్తున్నా తొణకరు, బెణకరు
చలికాలంలోనూ కోడికూతతోనే మేల్కొనే పల్లెలు - ఉదయం లేవగానే తమ రోజువారి విధుల్లో నిమగ్నమవుతున్న రైతులు - చలిని లెక్కచేయకుండా వార్తా పత్రికలను పంపిణీకి సిద్ధం చేస్తున్న యువకులు

Published : December 29, 2025 at 11:27 AM IST
Severe Cold Across Telangana State : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత వణికిస్తోంది. తెల్లారినా మంచుదుప్పట్లు తొలగి భానుడి కిరణాలు నేలను తాకేంత వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. కానీ కాలం ఏదైనా సరే కోడికూతతోనే మేల్కొని, తమ రోజువారి విధుల్లో నిమగ్నం అయ్యేవారున్నారని మీకు తెలుసా. వారు కూడా ముసుగు తన్నేసి ఇల్లు కదలనంటే పల్లె, పట్నం జనజీవనం ఒక్కసారిగా నిలిచిపోవాల్సిందే మరి. ఎముకలు కొరికే చలిలో కూడా ఈ శ్రామికుల జీవన పోరాటాన్ని ఈటీవీ భారత్ ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య పరిశీలించింది. వాటిలో కొన్ని మీకోసం.

అన్నదాతల అడుగులు : దుప్పటి ముసుగు, చేతిలో కర్ర పట్టుకుని కనిపిస్తున్న వీరంతా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెల్లి గ్రామానికి చెందిన రైతన్నలు. యాసంగి పొలం పనులు మొదలవ్వడంతో తెల్లవారుజామున 5 గంటలకే పొలం బాటపట్టారు. ఇలా రాష్ట్రంలోని లక్షల సంఖ్యలో కర్షకులంతా మంచు కురుస్తున్నా పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టడం, పంట పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించే పనులు చేసి, తిరిగి ఇంటికి చేరుకుంటామని రైతులు చెబుతున్నారు.

కాయగూరలు : వీరు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దుబ్బతండాకు చెందిన రైతులు. చిన్న శంకర్, పెద్దశంకర్, రాజు, మాన్‌సింగ్. మోటార్‌సైకిళ్లపై కిలో మీటర్ల దూరంలోని సూర్యాపేట మార్కెట్‌లో కూరగాయలు విక్రయించడానికి మబ్బులోనే బయల్దేరారు. ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది ఇలా తోటల్లోంచి సాయంత్రం కాయగూరలు కోసుకొచ్చి, తెల్లవారక ముందే తమకు సమీపాన ఉన్న మార్కెట్లలో, గ్రామాల్లోని వాడవాడ తిరుగుతూ అమ్మకాలు చేస్తున్నారు.

సమాచార దీపికలు : ప్రతి ఇంటి తలుపు తెరువక ముందే గడప ఎదుట వేసేందుకు చలిని లెక్కచేయకుండా న్యూస్ పేపర్లను సిద్ధం చేస్తున్న వీరు నల్గొండలోని పేపర్‌బాయ్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దాదాపు 1,300 మంది పేపర్ బాయ్స్ సైకిల్, బైక్‌పై ఊరంతా చక్కర్లు కొడుతూ జనానికి లోకజ్ఞానాన్ని చేరవేస్తున్నారు.

ఇళ్లకు పాలొచ్చే : ఇక్కడ వరుసలో నిల్చున్న వారు సూర్యాపేట జిల్లా నూతనకల్ పాలకేంద్రంలో పాలు పోసేందుకు ఉదయం 6 గంటలకు కిలోమీటర్ల దూరంలోని యడవెల్లి, గుండ్లసింగారం, వెంకేపల్లి, చిల్పకుంట్ల గ్రామాల నుంచి వచ్చిన పాడిరైతులు. ఉమ్మడి జిల్లాలో 2.14 లక్షల మంది పాడి రైతులు ఉదయం 5 గంటలకే పాలుపితికి సమీప కేంద్రాల్లో, పట్టణాల్లో ఇంటింటికి విక్రయాలు చేస్తున్నారు. సమయం దాటితే గేదెలు పాలు ఇవ్వవని, అందుకే చలిలోనే పితుకుతామని వారు చెబుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల దీప్తి : తీవ్రచలిలోనూ రోడ్లను ఊడ్చుతున్న వీరు నల్గొండలోని మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు. ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో దాదాపు 2,600 మంది నగరం నిద్ర లేవకముందే మెల్కొని రోడ్లను ఊడ్చి, చెత్తను శుభ్రం చేసే పనులను రోజువారీగా వేగంగా చేస్తున్నారు. చెవుల్లోకి ఇగం(చలి) రాకుండా టవల్స్‌ను కట్టుకుని, చేతులకు గ్లౌజులు, స్వెటర్లు లేకున్నా పనుల్లో నిమగ్నమవుతారు. వారి ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అక్కడి ప్రజల కోసం నిత్యం పాటుపడుతున్నారు.
రికార్డు స్థాయిలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు : ప్రస్తుత తరుణంలో రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏది తాకినా చేతులు ముడుచుకుపోయి, గజగజ వణికిపోతున్నాయి. ఉదయం లేవాలంటే చిన్న నుంచి పెద్దల వరకు చాలా బద్దకంగా ఉంటుంది. ఇంకా రాత్రి అయిందంటే చాలు అందరూ చలి తీవ్రతకు బయటకు వెళ్లడం లేదు. ఎన్నడూ లేనంతగా ఇటీవల తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా గత పదేళ్లలో లేని చలి తీవ్రత ఉంటోంది. ఉదయం పూట హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీనివల్ల వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంటోంది.
చలి చంపేస్తోంది బాబోయ్! : పదేళ్లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు - ఈ 2 రోజులు మరింత తీవ్రం
ఉదయం 10 దాటుతున్నా చలి పులి వదలట్లేదు! - మరో 3 రోజులు ఈ గజగజలు తప్పవు

