రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు - వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
పొగమంచు కారణంగా రహదారులపై నిలిచిన వాహనాలు - రాకపోకలకు తీవ్ర అంతరాయం - నిలిచి ఉన్న వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 10:43 AM IST
Intensity of Cold and fog is Increasing Day by Day in AP: రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే వ్యత్యాసం లేకుండా కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్ర ప్రజలను చలి గజగజలాడిస్తోంది.
పొగ మంచు కమ్మేసి వాతావరణమంతా శ్వేతమయంగా మారింది. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారులను మంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరూ చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
దట్టంగా అలుముకున్న పొగమంచు: బాపట్లజిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాలను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో వాహనాలదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నారులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ప్రయాణం సాగాలంటే వాహనాల హెడ్ లైట్లు వెళ్లాల్సిందే, లేదంటే ప్రమాదమే. ఒంగోలు-కత్తిపూడి జాతీయ రహదారిపై మంచు ఆవహించటంతో వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. రైళ్లు కూడా నిదానంగా వెళుతున్నాయి.
వాహనదారులకు ఇబ్బందులు: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఉదయం 7 గంటల సమయంలోనూ మంచుపొరలు తొలగలేదు. అద్దంకి పట్టణం, గుండా నామ్ రహదారిపై విపరీతమైన పొగ మంచు ఉండటంతో వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. ఈ రహదారిపై నిత్యం భారీ వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. పొగ మంచు దట్టంగా ఆవరించటంతో ఎదురుగా వచ్చే వాహనానికి హెడ్లైట్లు ఏమాత్రం కనిపించడం లేదు. దగ్గరగా వచ్చే వరకు ద్విచక్ర వాహనాలు కనపడకపోవటంతో భారీ వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రాకపోకలకు అంతరాయం: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొగ మంచు ప్రభావంతో వాహనాలు రహదారులపై నిలిచిపోతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఉదయం 9 గంటల వరకు మంచు తీవ్రత తగ్గకపోవడంతో జనజీవనం స్తంభించింది.
జాగ్రత్తలు పాటించాలి: శీతల పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గోరు వెచ్చటి నీరు తాగితే మంచిది. మంచులో ఉదయం, రాత్రులు తిరగటం తగ్గించాలి. అవసరమైనపుడు ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, మాస్కులు ధరించాలి. చలికాలంలో తక్కువ మోతాదులో నీరు తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల పలు అనార్యోగ సమస్యలు వస్తాయి. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల లోపల పేరుకుపోయిన కఫం బయటకు వస్తుంది. న్యూమోనియా రాకుండా ఉండేందుకు చిన్నారులు, పెద్దలు టీకాలు వేయించుకోవాలి. శ్వాస సమస్యలు ఉన్నవారు ఉదయం సమయంలో చల్లటి గాలికి వాకింగ్ చేయడం కొద్ది రోజులు తగ్గించాలి అని వైద్యులు చెబుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్రంలో చలి బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. శీతాకాలంలో జాగ్రత్తలు పాటించకుంటే రక్తనాళాలు గడ్డ కట్టే ప్రమాదం పొంచి ఉంది. తద్వారా గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు వంటివి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రిలో వెళ్లాలి. సరైన చికిత్స చేయించుకోవాలి. ఎల్లప్పుడూ పోషకాహారాన్నే తీసుకోవాలని, ఈ సీజన్లో లభించే పండ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

