మండుతున్న ఎండలు - పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు
పదిరోజుల ముందుగానే రానున్న రోహిణి కార్తె - ప్రతాపం చూపనున్న భానుడు - ఉమ్మడి తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2026 at 10:35 PM IST
Intense Heat And Highest Temparatures in East Godavari District: మే నెల చివరి వారంలో రావాల్సిన కార్తె ఎండలు దాదాపు పది రోజుల ముందుగానే ప్రతాపాన్ని చూపనున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు మరింత ఎక్కువగా ఉక్కపోతకు గురికానున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తేమతో కూడినటువంటి గాలి తొలగిపోయి రాజస్థాన్ నుంచి వేడిగాలులుల త్వరితగతిన రావడంతో అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నట్లు ఎన్ఐడీఎం అధికారులు తెలిపారు.
ఎల్నినో ప్రభావం: గత 2015, 2023 వ సంవత్సరాల మాదిరి ఈ ఏడాది సైతం ఎల్నినో ప్రభావం ఉండటం మూలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెల 19వ తేదీ నుంచి 23 వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 40.9 నుంచి 46.4 డిగ్రీల సెల్సియస్ వరకు రానున్నాయి. గతం కన్నా రెండు డిగ్రీల అదనంగా వేడి పెరగనుంది. వేడిగాలులు ఎక్కువగా రావడంతో ఉక్కపోత అధికమవుతుంది. వాతావరణంలో తేమ 60 శాతం వరకు పెరిగి, ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి మరింత ఎక్కువ తీవ్రతతో కూడి ఉంటుంది.
వాతావరణంలో అనూహ్యమైన మార్పులు: ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో పలు మార్పులు వచ్చి అకాల వర్షాలు కురిస్తే దాని ప్రభావం కొద్ది సమయమే ఉంటుంది. మళ్లీ ఎండ తీవ్రత పెరిగినట్లయితే తేమగాలి వాతావరణంలో మిళితమై ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఎల్నినో ప్రభావం మూలంగా ఈ సంవత్సరం వర్షాలు తక్కువగానే ఉండే పరిస్థితులుండటం గమనార్హం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యన అత్యవసరమైతేనే గానీ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఎండదెబ్బ తగిలినా నిస్సత్తువ అనిపించినా కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యతో బయటపడే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ అధిక ఉష్ణోగ్రతల వేళ తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉందని సూచిస్తున్నారు.
ఉక్కపోత అధికం: సాధారణ పగటి సమయంలో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో 30-33 డిగ్రీలకు తగ్గకుండా ఉండిపోవడం వల్ల ఉక్కపోత మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. దీనికితోడు వడగాలులు, ఎండ తీవ్రత ప్రభావం ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, ఇతర శ్వాసకోస సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మండే ఎండలతో వడగాలులు, ఉక్కపోత - కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత
48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం - గురువారం వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు

