కష్టపడింది, కల నెరవేర్చుకుంది - పెళ్లి ఒత్తిడి తట్టుకొని కానిస్టేబుల్‌గా ఎంపికైన కల్పన
పోలీస్ కానిస్టేబుల్ అయిన వాచ్‌మెన్ కుమార్తె - పెళ్లి ఒత్తిడి తట్టుకోని చదువు కొనసాగించిన కల్పన - సొంతంగా సన్నద్ధమై కొలువు సాధించిన యువతి - యూట్యూబ్ క్లాసులు విని పరీక్షలు రాసిన కల్పన

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 25, 2025 at 10:42 PM IST
Inspiring Story of Constable Kalpana: చదువుకోవాలన్న పట్టుదల, తనని తాను నిరూపించుకోవాలన్న తపన ఉంటే చాలు ఏ పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చు. ఇందుకు నిదర్శనం ఆ యువతి. పదో తరగతి పూర్తయ్యాక పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. విద్య మాత్రమే జీవితంలో వెలుగులు నింపుతుందని నమ్మి ఉన్నత చదువులు చదివింది. తాజాగా పోలీస్ నియామకాల్లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపికైంది బాపట్ల జిల్లా చెందిన కల్పన.
పేద కుటుంబంలో పుట్టిన ఈ యువతి కల కానిస్టేబుల్. కానీ పదోతరగతి పూర్తవ్వగానే పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. చదువు కొనసాగించాలన్న ఒకే ఒక లక్ష్యంతో తల్లిదండ్రులతో మెుండిగా పోరాటం చేసింది. ఉన్నత విద్య అభ్యసించి పట్టుదల, సంకల్పంతో తన జీవితాన్ని తానే మార్చుకుంది. కఠిన సాధన చేసి కానిస్టేబుల్ అయింది.
నిర్థిష్ట లక్ష్యం నిర్దేశించుకోని ముందుకు : మైదానంలో పరుగులు తీస్తున్న ఈ యవతి కల్పన. బాపట్ల జిల్లా మిన్నెకల్లు స్వస్థలం. తండ్రి తన్నీరు సుబ్బయ్య ప్రైవేట్ కంపెనీలో వాచ్‌మెన్, తల్లి భ్రమరాంబ వ్యవసాయ కూలీ. వీరికి ఇద్దరు కుమార్తెలు. పాఠశాల విద్య అవ్వగానే పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. చిన్నమ్మాయికి కూడా అలానే చెద్దామని అనుకున్నారు. కానీ కల్పన ఎదిరించింది. ఉన్నత చదువులు చదువుకోవాలని తెల్చిచెప్పింది. ఆర్థిక ఇబ్బందులున్నా నిర్థిష్ట లక్ష్యం నిర్దేశించుకోని ముందుకు సాగింది.
'మేమిద్దరం ఆడపిల్లలం. మొదటి నుంచీ ఇబ్బందులు పడుతూనే చదువుకున్నాం. మా ఊరు నుంచి బస్సు సౌకర్యం లేదు. డిగ్రీ మూడు సంవత్సరాలు 4 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లి పూర్తి చేశాను. కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేక ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు వినేదాన్ని. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. జూన్ 1న జరిగిన మెయిన్స్ ఎగ్జామ్‌లో 135 మార్కులు సాధించి ఏపీ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాను. అమ్మనాన్న కృషి ఎంతో ఉంది. చాలా మంది ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్న, వాళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. మమ్మల్ని చదివించారు. ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే నా లక్ష్యం.' - కల్పన, కానిస్టేబుల్‌గా ఎంపికైన యువతి
యూట్యూబ్‌లో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని: నరసరావుపేటలో ఇంటర్‌లో చేరింది కల్పన. సొంతూరు నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజు సైకిల్‌పై ప్రయాణించి చదువుకుంది. డిగ్రీ పూర్తి చేసింది. తన కాళ్లపై తాను నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమైంది. కోచింగ్ తీసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో సొంతంగా ప్రిపరేషన్ చేసింది కల్పన.
పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకోని మరింత కఠినంగా శ్రమించింది కల్పన. రోజూ గ్రౌండుకు వెళ్లి రన్నింగ్‌తో పాటు వ్యాయామం చేసేది. వివిధ పత్రికలు చదివి వర్తమాన అంశాలపై అవగాహన పెంచింది. కొందరు నిపుణుల వీడియోలను యూట్యూబ్‌లో చూసి నోట్స్ తయారు చేసుకుంది. వారానికి ఓ సారి గుంటూరుకు వెళ్లి నమూనా పరీక్షలు రాసింది. అలా శ్రమించి మహిళా కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైంది కల్పన.
కుమార్తె కష్టం ఊరికే పోలేదని, తాను అనుకున్నట్లుగానే పోలీస్ ఉద్యోగం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. అబ్బాయిలకు తీసిపోకుండా కష్టపడే మనస్తత్వం ఉండటం వల్లే కల్పన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాయామ ఉపాధ్యాయురాలు అన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరును పిలవటం చాలా సంతోషంగా అనిపించిందని చెబుతోంది కల్పన.
ఓ వైపు కళా, మరోవైపు క్రీడలు - మల్టీ టాలెంటెడ్‌గా సత్తా చాటుతున్న అక్షర
రీల్స్‌కు బదులు యూట్యూబ్‌లో క్లాసులు - పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తున్నఅభ్యర్థులు

