ETV Bharat / state

లగ్జరీ లైఫ్‌ వదులుకుని పేద విద్యార్థులకు ఉచితంగా ఐటీ నైపుణ్యాలు నేర్పిస్తూ

ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం స్టార్టప్‌ ప్రారంభం - ఎడ్యునోవర్స్ టెక్‌ సొల్యూషన్స్‌ ప్రారంభించిన ఉష - బీటెక్‌ విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ - యువతకు స్కిల్స్‌ నేర్పించడమే లక్ష్యంగా స్టార్టప్‌ మొదలు

Story of Young Entrepreneur Usha
Story of Young Entrepreneur Usha (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 1:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Story of Young Entrepreneur Usha : లక్షల ప్యాకేజీ, ఐటీ ఉద్యోగం, స్థిరమైన లైఫ్. మధ్యతరగతి అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి? కానీ, తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఉష ఆలోచనలు వేరు. తనలాగే గ్రామీణ యువత కూడా ఐటీ రంగంలో రాణించాలనే లక్ష్యంతో, కేవలం 3,500 రూపాయల పెట్టుబడితో ఎడ్యునోవర్స్ టెక్ సొల్యూషన్స్ అనే స్టార్టప్‌ ప్రారంభించింది. చేతిలో ఉన్న లగ్జరీ లైఫ్‌ను వదులుకుని, పేద విద్యార్థులకు ఉచితంగా ఐటీ నైపుణ్యాలు నేర్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉష స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందినది ఉష. తండ్రి నిరంజన్ మెకానిక్. తల్లి సరస్వతి. కరోనా సమయంలో తండ్రిని కోల్పోవడం వల్ల కలిగిన బాధ నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ఉష అన్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ విభాగంలో 8 నెలల పాటు మంచి జీతంతో ఉద్యోగం చేశానని వివరించారు. అయితే, తన తోటివారు పడుతున్న ఇబ్బందులను చూసి, వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

మొదట్లో ఎదురుదెబ్బలు తప్పలేదు: చదువుకునే విద్యార్థులకు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉపయోగపడేలా ఒక అంకుర సంస్థ (స్టార్టప్​) స్థాపించాలని అనుకున్నా, చేతిలో పెట్టుబడి లేదని చెప్పారు. ఆ సమయంలో తన దగ్గర ఉన్న రూ.3,500లతోనే వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసి, దానికి ‘ఎడ్యూనోవర్స్‌ టెక్‌ సొల్యూషన్స్‌’గా పేరు పెట్టామని ఉష చెప్పారు. ఈ ప్రయాణంలో తన స్నేహితులు కూడా తోడయ్యారని, ఇంట్లోనే ఒక చిన్న గదిని ఆఫీసుగా మార్చుకుని, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్, మెంటార్‌షిప్స్‌ వంటివి ఏర్పాటు చేశామన్నారు. తమ ఆలోచన మంచిదే అయినప్పటికీ, మొదట్లో ఎదురుదెబ్బలు తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల చుట్టూ తిరిగి తమ కాన్సెప్ట్‌ను వివరించినప్పుడు, చాలా మంది తమను నిరుత్సాహపరిచారని ఆమె గుర్తు చేసుకున్నారు.

"పెద్ద పెద్ద కాలేజీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసినా చాలా మందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై కనీస అవగాహన, భవిష్యత్తుపై స్పష్టత ఉండట్లేదు. నేను ఎదుర్కొన్న ఇబ్బందులు వారు పడకూడదనే ఉద్దేశంతోనే 'ఎడ్యూనోవర్స్ టెక్ సొల్యూషన్స్' ప్రారంభించా. దీనిద్వారా బీటెక్, డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌షాపులు, సొంతంగా సాఫ్ట్‌వేర్‌ తయారుచేయడం అన్నింట్లోనూ శిక్షణ ఇస్తున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు సాధిస్తే వారితోనే నేరుగా ప్రాజెక్టులు చేయిస్తాం." - ఉష, ఎడ్యునోవర్స్ టెక్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకురాలు

1500 మంది విద్యార్థులకు శిక్షణ: ‘మీకెందుకు ఇదంతా, అవసరమా?’ అంటూ కొందరు నిరుత్సాహపరిచారని ఉష అన్నారు. దాంతో తమ కార్యాచరణలో ఏదో లోపం ఉందని గ్రహించమని చెప్పారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని రతన్‌ టాటా ఇన్నొవేషన్‌ హబ్‌లో చేరి, వారి మెంటార్‌షిప్‌ తీసుకోవడం తన కెరియర్‌లోనే అతిపెద్ద మలుపు అని ఉష హర్షం వ్యక్తం చేశారు. ఆ హబ్ సహాయంతో కాలేజీలను ఎలా సంప్రదించాలి, విద్యార్థులకు ఇచ్చే శిక్షణలో ఎలాంటి మెలకువలు పాటించాలి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలి వంటి అంశాలన్నింటినీ నేర్చుకున్నట్లు వివరించారు. దీనివల్ల తమ ప్లాట్‌ఫామ్‌ మరింత బలంగా తయారైందని, అలా తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు దాదాపు 1,500 మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ ఇస్తున్నమన్నారు. ఈ సంస్థను మరింత విస్తరించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని ఉష అన్నారు.

కట్టుబాట్లను దాటి కలల బాటలో - ఉష స్ఫూర్తిదాయక ప్రయాణం
ఐదుగురు విద్యార్థుల అద్భుత సృష్టి - ఏఐ సాంకేతికతతో వాహనాలు, మనుషుల లెక్కింపు