కుమార్తె స్ఫూర్తితో కుంచెపట్టిన తల్లి - అద్భుత చిత్రాలకు ప్రాణం
చిత్రలేఖనంలో రాణిస్తున్న తెనాలికి చెందిన గృహిణి - కుమార్తె స్ఫూర్తితో ఇంటివద్దనే చిత్రలేఖనం సాధన - వైవిధ్య చిత్రాలకు రూపకల్పన చేస్తున్న ఇరువురు - డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తల్లీకూతుళ్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2026 at 4:20 PM IST
Inspiring Journey of Housewife Anusha in Painting from Guntur District : నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉండాలే కానీ కళలకు వయసు అడ్డుకాదని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గృహిణి అనూష. చిత్రలేఖనంలో రాణిస్తున్న కుమార్తె స్ఫూర్తితో కుంచెపట్టి అనతికాలంలోనే అద్భుత చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఇటీవల కుమార్తెతో కలిసి డ్రాయింగ్ లోయర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చిత్రకళలో రాణించాలంటే ఎంతో ప్రతిభతోపాటు ఓపిక ఉండాలి. అన్నింటికి మించి బొమ్మలు వేసేందుకు విలువైన సమయం కేటాయించాలి. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కళాకారిణిగా ప్రత్యేకత చాటుకుంటున్నారు అనూష. కుమార్తె చిత్రలేఖనంలో రాణించడం చూసిన అనూష తను కూడా ఆ కళను ఎలాగైనా నేర్చుకోవాలనుకుంది. కుమార్తె డ్రాయింగ్ పుస్తకాల్లోని బొమ్మలను ఇంటి వద్దే సాధన చేయడం మొదలుపెట్టింది.
ఏడాదిపాటు కుమార్తెతో డ్రాయింగ్ తరగతులకు : ఈ క్రమంలోనే అనూషకు డ్రాయింగ్ పరీక్షలు రాయాలన్న ఆలోచన కలిగింది. అందుకుగాను దాదాపు ఏడాదిపాటు కుమార్తెతో డ్రాయింగ్ తరగతులకు హాజరైన అనూష చిత్రకళలో మంచి నైపుణ్యం సాధించారు. పెన్సిల్, క్రేయాన్స్, ఆయిల్ పాస్టెల్స్ వంటి విభాగాల్లో కుమార్తెతో కలిసి పోటాపోటీగా వైవిధ్య చిత్రాలకు రూపకల్పన చేసి చిత్రకారిణిగా తనదైన ముద్ర వేశారు. అనంతరం డ్రాయింగ్ లోయర్ పరీక్షలు రాసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హయ్యర్, టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసి డ్రాయింగ్ టీచర్ కావాలనేది తన లక్ష్యమని అనూష ఈ సందర్భంగా తెలిపారు.
"నాతో పాటు అమ్మ సైతం డ్రాయింగ్స్ కొద్ది కొద్దిగా వేస్తూ ఆసక్తి కలిగింది. దాంతో మా చిత్రలేఖనం గురువు వెంకటకృష్ణ వద్ద నాతో కలిసి శిక్షణ తరగతులకు హాజరై చిత్రలేఖనాన్ని నేర్చుకుంది. నాతో కలిసి డ్రాయింగ్ లోయర్ పరీక్షల్లో మా అమ్మ అనూష ఉత్తీర్ణత సాధించింది. ఆయిల్ పాస్టెల్స్ వేయడమంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. అవి చూడటానికి చాలా బాగుంటాయి. వేయడానికి సైతం చాలా సులభంగా అయిపోతుంది. చూసేందుకు కూడా పెయింటింగ్లానే అనిపిస్తుంది. చిత్రలేఖనంలో ఎక్కువ బహుమతులను గెలుచుకోవాలని అనుకుంటున్నాను. అందుకుగాను భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పరీక్షలను రాసి అందులో ఉత్తీర్ణతను సాధించేందుకు కృషి చేస్తున్నాను. అందరికంటే భిన్నంగా, కొత్తగా డ్రాయింగ్స్ వేయాలని నేను అనుకుంటున్నాను. దాని కోసం బాగా సాధన చేసి అమ్మ కంటే బాగా వేయడానికి ప్రయత్నిస్తాను." - జోషిక, చిత్రకారిణి
"మా కుమార్తె జోషిక చిత్రలేఖనం నేర్చుకోవడం చూసి క్రమంగా నాకు కూడా ఆసక్తి కలిగి డ్రాయింగ్స్ క్లాసులకు హాజరై మెలకువలను తెలుసుకున్నాను. ఈ శిక్షణలో మా చిత్రలేఖనం గురువు వెంకటకృష్ణ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఇందులో లోయర్ పరీక్షలను రాశాను. అనంతరం హయ్యర్ పరీక్షలను రాయాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు ఇంటర్ పూర్తయిన తర్వాత నాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత నా భర్త ప్రోత్సాహంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆపై పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు డ్రాయింగ్ శిక్షణలో తర్ఫీదు పొందుతున్నాను." - అనూష, జోషిక తల్లి, చిత్రకారిణి
"జోషికకు చిత్రలేఖనం అంటే ఎంతో ఆసక్తి. ఎంత కష్టమైన డ్రాయింగ్ అయినప్పటికీ సాధన చేసేంత వరకు విడిచిపెట్టదు. జోషిక తల్లిదండ్రులు తన ఆసక్తిని గమనించి నా వద్ద శిక్షణలో చేర్చారు. ఆ తర్వాత జోషిక నా వద్ద 9వ తరగతి వరకు డ్రాయింగ్ సాధన చేసింది. 8వ తరగతిలో లోయర్ పరీక్ష రాసింది. ప్రస్తుతం హయ్యర్ పరీక్షలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో జోషిక తల్లి అనూషకు సైతం చిత్రలేఖనంపై ఆసక్తి ఉంది. దాంతో ఆమెకు సైతం చిత్రలేఖనం తర్ఫీదును ఇవ్వడం జరిగింది."-వెంకటకృష్ణ, చిత్రలేఖనం గురువు
స్కేటింగ్‌లో సత్తా చాటుతున్న చైత్రదీపిక - జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు
నగరాల్లో హాస్టల్స్, రూమ్స్ దొరకడం లేదా? - 'పీజీఫై' యాప్‌తో బ్యాచిలర్ కష్టాలకు చెక్

