హేళనలు ఎదురైనా వెనకడుగు వేయలేదు - బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న సోదరులు
పుట్టుకతోనే వినికిడి, మాట శక్తి కోల్పోయిన సోదరులు - జాతీయ స్థాయి బధిరుల బ్యాడ్మింటన్‌లో పతకాలు - ఛండీగఢ్‌లో జరిగిన సింగిల్స్, డబుల్స్‌లో రజతం - 2024లో రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం రామ్‌చరణ్ సొంతం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 2:00 PM IST
Inspiring Deaf Brothers Win Medals at National Badminton Championship: అన్నాదమ్ములిద్దరూ పుట్టుకతోనే మూగ, చెవిటి. అయినప్పటికీ కుమారులిద్దరినీ ఉత్తమంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు ఆ తల్లిదండ్రులు. సమాజం నుంచి ఎన్నో అవమానాలు, హేళనలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పిల్లలకి అండగా నిలిచారు. ఫలితంగా జాతీయ బధిర బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పతకాలు సాధించారు. అటు చదువు ఇటు క్రీడల్లోనూ రాణిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన బ్యాండ్మిటన్ బ్రదర్స్ స్ఫూర్తిదాయక పయణాన్ని ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారే ఏదైనా సాధించడానికి 100 సాకులు వెతుక్కునే క్రమంలో వినికిడి, మాట లోపంతో పుట్టిన అన్నాదమ్ములు అటు చదువు, ఇటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. పట్టుదలతో బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టి 3 ఏళ్లలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయ బధిర బాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటారు. ఈ ఏడాది అక్టోబర్‌లో మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారీ సోదరులు.
కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స: అన్నాదమ్ములు రామ్‌చరణ్, దిలీప్ కుమార్‌లది విజయనగరం జిల్లా గదబవలస స్వస్థలం. రామారావు, రామలక్ష్మి దంపతుల కుమారులు. పెద్ద కుమారుడికి వినికిడి, మాట లోపం అని తెలిసి బాధపడిన ఆ తల్లిదండ్రులు చిన్న కుమారుడు కూడా అదే సమస్యతో జన్మించడంతో మరింత కుంగిపోయారు. అయినా అధైర్య పడలేదు. కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స చేయించడంతో మిషన్ సాయంతో వినే అవకాశం లభించింది. స్పీచ్ థెరపీతో ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నారు. బ్యాండ్మింటన్‌పై ఆసక్తితో విజయనగరం ఇండోర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నారు.
మాట, వినికిడి లోపం కారణంగా ఈ ఇద్దరినీ ఎవరూ స్కూల్‌లో చేర్చుకోలేదు. పైగా మాటలతో అవమానించేవారు. వాటన్నింటినీ దిగమింగుకుని అన్నీ తానై పెంచింది తల్లి రామలక్ష్మి. చదువులో వెన్నంటే నిలిచి అక్షరాలు నేర్పించింది. స్పీచ్ థెరపీ ద్వారా కుమారులు మాట నేర్చుకోవడంలో అడుగడుగునా అండగా నిలిచింది తల్లి రామలక్ష్మి. వారితో పాటు స్పీచ్ థెరపీ సెంటర్‌కి వెళ్తూ ఇంగ్లీష్‌లోనే మాట నేర్పించింది. నేడు జాతీయ స్థాయిలో పతకాలు తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది.
'పిల్లల్ని బడిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. నార్మల్ స్కూల్‌లో వెయ్యకండి వారికి ఉండే ప్రత్యేకమైన పాఠశాలల్లో చేర్చమన్నారు. చాలా ఎగతాలి చేసేవారు. పిల్లల్లి బాగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలనుకున్నా. ఎలాగో కష్టపడి బడిలో చేర్పించా. అన్ని పాఠాలు ముందుగానే వాళ్లకు నేర్పిస్తాను. ఎన్నో కష్టాలను ఎదుర్కుని నేడు వాళ్లు బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నారు. పతకాలు సాధిస్తూ మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేేస్తున్నారు. ' -రామలక్ష్మి, తల్లి
అన్నకు తగ్గ తమ్ముడు: రామ్‌చరణ్, జిల్లా స్థాయిలోసాధారణ క్రీడాకారులతో తలపడి సింగిల్స్‌లో 3 స్వర్ణ పతకాలు డబుల్స్‌లో రజతం సాధించాడు. 2024లో రాష్ట్రస్థాయిలో రజతం కైవసం చేసుకున్నాడు. 2023 ఛండీగఢ్‌లో జరిగిన జాతీయ బధిర బ్యాండ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్‌లో రజత పతకాలతో మెరిశాడు. చదువులోనూ రాణిస్తూ ఇటీవల విడుదలైన టెన్త్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణిస్తున్నాడు చిన్న కుమారుడు దిలీప్. సాధారణ క్రీడాకారుల తో పోటీ పడుతూ 2025 జిల్లా స్థాయి అండర్-13 డబుల్స్ విభాగంలో పసిడి పతకం దక్కించుకు న్నాడు. ఛండీగఢ్‌లో జరిగిన జాతీయ స్థాయి బధిర బ్యాడ్మింటన్ పోటీల్లో డబుల్స్‌లో వెండి పతకం సాధించాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి కీర్తి తెస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
రామ్ చరణ్, దిలీప్ కుమార్‌ల ప్రతిభ పట్ల కోచ్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన వీరిని విజయనగరం డీఎన్డీఓ వెంకటేశ్వరరావు అభినందించారు. ఇప్పటికే మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఈ అన్నదమ్ములు మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తున్నారు.
స్కేటింగ్‌లో సత్తా చాటుతున్న చైత్రదీపిక - జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు

