టీ కొట్టుతో ప్రారంభమై ప్రపంచ సుందరి పోటీల వరకు చేరింది
తెలంగాణలో నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీలకు క్రియేటివ్హెడ్గా సత్యనారాయణ - తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలపై ఎంపవరింగ్ బ్యూటీ ఇన్స్పైరింగ్ ఛేంజ్ పేరుతో ప్రచార చిత్రం - తొలి చిత్రంతోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు

Published : January 11, 2026 at 11:03 AM IST
Inspiring Story Dulam Satyanarayana : సుమారు పది సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించారు. తల్లి విజయ టీ కొట్టు వ్యాపారం నడుపుతూ అతనిని చదివించింది. ఆయన బాల్యమంతా టీ కొట్టులోనే సాగింది. చిన్ననాటి నుంచి అతనికి సినిమాలంటే ఆసక్తి. దీంతో యానిమేషన్ కోర్సు నేర్చుకోవాలని చెన్నై వెళ్లారు. అదే సమయంలో తనకు ఇష్టమైన దర్శకులు తీసిన సినిమాల డీవీడీలను కొని వాటిని చూస్తూ ఉండేవారు. వాటి ప్రభావంతో తానూ ఓ లఘుచిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. చివరికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే ఎంతటివారైనా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన నిరూపించారు.
దీనికోసం ఓ కెమెరాను అద్దెకు తీసుకుని లఘుచిత్రాలను తీయడం ప్రారంభించారు. అయితే వీటికి లభించిన గుర్తింపు ఆయనను ప్రపంచ సుందరి పోటీల వరకూ తీసుకెళ్లింది. ఆయనే మంచిర్యాలకు చెందిన సత్యనారాయణ. తెలంగాణలో జరిగిన 72వ ప్రపంచ సుందరి పోటీలకు ఆయన క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు.

ఆయన చిత్రాలకు ప్రపంచ స్థాయిలో పురస్కారాలు :
- వందకు పైగా లఘుచిత్రాలు : డీఎస్ఎన్ ఫిల్మ్స్ పేరుతో సత్యనారాయణ వందకు పైగా లఘుచిత్రాలు రూపొందించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రంపంచానికి రుచిచూపించాలనే తపనతో పర్యాటక ప్రదేశాలపై, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అనేక లఘు చిత్రాలు తీశారు.
- తొలి లఘుచిత్రంతోనే అంతర్జాతీయ గుర్తింపు : సత్యనారాయణ తాను తీసిన తొలి లఘుచిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పశ్చిమ బెంగాల్‌లోని దీవి లాంటి మౌషుని గ్రామ ప్రజలపై తీసిన ఈ డాక్యుమెంటరీకి 2008లో పుణె ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు లభించింది.
- అమెరికాలో ఫెలోషిప్ : నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల నేపథ్యంలో తీసిన డ్రెడ్‌ఫుల్ ఫేట్ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వాన్ని కదిలించింది. 2010లో ఏథెన్స్లో జరిగిన గ్రీస్ హెల్త్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2011లో అమెరికా అరిజోనాలోని స్కాట్స్‌డేల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ థియేటర్ నుంచి దర్శకత్వం కోర్సుకు ఫెలోషిప్‌ను సంపాదించి పెట్టింది.
- కార్నెల్ యూనివర్సిటీ ఫర్ కల్చరల్ స్టడీస్ లైబ్రరీలో స్థానం : 2013లో కూచిపూడి నాట్యకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మపై తీసిన అయామ్ సత్యభామ డాక్యుమెంటరీకి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఫర్ కల్చరల్ స్టడీస్ లైబ్రరీలో చోటు దొరికింది.
- అంతర్జాతీయ టూరిజం చిత్రోత్సవంలో : వెల్కమ్ టు తెలంగాణ పేరుతో రాష్ట్రంలోని జలపాతాలు, నదులు, చెరువులు తదితర పర్యాటక ప్రదేశాల పై తీసిన ప్రచార చిత్రానికి 2016లో పోర్చుగల్‌లో జరిగిన అంతర్జాతీయ టూరిజం చిత్రోత్సవంలో ఉత్తమ పర్యాటక చిత్రం పురస్కారం లభించింది.
- ప్రపంచ పర్యాటక చిత్రోత్సవంలో : 2019లో బతుకమ్మ, బోనాలు తదితర పండగలపై తీసిన గీతం జపాన్ ఒసాకాలో ప్రపంచ పర్యాటక చిత్రోత్సవంలో ఉత్తమ పురస్కారం అందుకుంది.
- 2023లో పోచంపల్లి గ్రామంపై తీసిన లఘు చిత్రానికి ఆఫ్రికాలో అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్లో రజత పురస్కారం లభించింది.
ప్రపంచ సుందరి పోటీలకు : రాష్ట్రంలో నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు ప్రభుత్వం సత్యనారాయణను క్రియేటివ్ హెడ్‌గా ఎంపిక చేసింది. ఈ పోటీల కోసం రాష్ట్రంలోని ప్రధాన సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలపై ఎంపవరింగ్ బ్యూటీ ఇన్స్పైరింగ్ ఛేంజ్ పేరుతో తీసిన ప్రచార చిత్రం బిలియన్ మందికి పైగా ప్రేక్షకుల పొగడ్తలను అందుకుంది. పోటీదారుల కోసం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందించారు. అందాల భామలకు తెలంగాణలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను చూపించడంతో పాటు వారిని అంతే అందంగా కెమెరాల్లో బంధించారు. మిస్ వరల్డ్ పోటీల దర్శకుడు స్టీవ్ డగ్లస్ మోర్లే, సంస్థ సీఈఓ జూలియా మోర్లేల ప్రశంసలు అందుకున్నారు.
చేతులు లేకపోయినా డోంట్ కేర్- 'ఛాయ్'తో తలరాతను మార్చుకున్న సంతోష్!

