కల్యాణదుర్గం ఈ-స్టాంప్ వ్యవహారంపై విచారణ - సీఐడీ దర్యాప్తు పురోగతి నివేదిక కోరిన హైకోర్టు
సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు - తక్కువ వాటిని అధిక విలువ గల స్టాంపులుగా మార్చి వినియోగించినట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలు - దర్యాప్తులో భాగంగా సుమారు 14 వేల లావాదేవీల పరిశీలన

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 18, 2026 at 10:00 AM IST
Inquiry Into The Kalyandurg E-stamp Issue : అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈ-స్టాంప్ విక్రయాల్లో జరిగిన అక్రమాలపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతి తెలియజేస్తూ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్ : ఈ-స్టాంప్ విక్రయాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కల్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప, ఆయన భార్య భార్గవి నిర్వహించిన ఈ -సేవా కేంద్రం ద్వారా అక్రమాలు జరిగినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేపై ఆరోపణలు : పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తక్కువ విలువ గల స్టాంపులను కొనుగోలు చేసి, వాటిని అధిక విలువ గల స్టాంపులుగా మార్చి వినియోగించినట్లు ఆరోపించారు. ఈ ప్రక్రియ ద్వారా బెంగళూరుకు చెందిన ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిల్ దాఖలు అనంతరం సీఐడీకి దర్యాప్తు : సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్ దాఖలు చేసిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో కేసు విచారణలో పారదర్శకతపై సందేహాలు ఉన్నాయని వాదించారు. సీఐడీ తరఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్. ప్రణతి, ఈ-స్టాంప్ అక్రమాలపై మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటివరకు పలువురు సాక్షులను విచారించామని, కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నామని వివరించారు.
14 వేల లావాదేవీల పరిశీలన : దర్యాప్తులో భాగంగా సుమారు 14 వేల లావాదేవీలను పరిశీలించామని, అందులో 36 దస్త్రాలు అనుమానాస్పదంగా గుర్తించినట్లు సీఐడీ వెల్లడించింది. ఆ పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, నివేదికలు అందిన వెంటనే అభియోగపత్రాలు దాఖలు చేస్తామని కోర్టుకు తెలియజేసింది. సీఐడీ సమర్పించిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు, దర్యాప్తు పురోగతిపై సమగ్ర స్థాయి నివేదికను తదుపరి విచారణలో సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది.
నాన్ జుడీషియల్ స్టాంపుల స్థానంలో ఈ-స్టాంపులు : గత ప్రభుత్వం నాన్ జుడీషియల్ స్టాంపుల స్థానంలో ఈ-స్టాంపులను ప్రవేశపెట్టింది. ఇందుకోసం స్టాక్ హోల్డ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ ఏజన్సీలను ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ నాయకులకు కట్టబెట్టింది. అనంతపురం, కర్నూలుకు సంబంధించి ఓ ప్రైవేట్ ఏజన్సీకి ఈ-స్టాంపులు విక్రయించే కాంట్రాక్టు అప్పగించారు.
2022వ సంవత్సరంలో ఈ-స్టాంపు వెండింగ్ ఏజంట్‌గా కర్నూలులోని ప్రైవేట్ ఏజన్సీ ప్రతినిధిగా అనుమతి తీసుకొని మీ సేవ నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ బాబు కళ్యాణదుర్గంలో స్టాంపులు విక్రయిస్తున్నాడు. రెండున్నరేళ్లలో 13 వేలకు పైగా స్టాంపులు విక్రయించిన ఎర్రప్ప వీటిలో 70 శాతానికిపైగా అధిక విలువ డినామినేషన్ స్టాంపులను నకిలీవి సృష్టించి వినయోగదారులకు విక్రయించాడు. ఫొటోషాప్ ద్వారానే ఈ-స్టాంపులను ఎడిట్ చేసి కోట్లలో కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.
కలకలం రేపుతున్న 'నకిలీ ఈ-స్టాంపు'ల కుంభకోణం - ముగ్గురు అరెస్ట్

