ETV Bharat / state

ధరణిలో దొంగలు - 10 వేల ఎకరాలు స్వాహా!

ధరణి పోర్టల్‌పై విచారణలో సంచలన విషయాలు - 10 వేల ఎకరాలపై దొడ్డిదారిన హక్కుల మార్పిడి - భూదోపిడీకి సీసీఎల్‌ఏలోని ఇద్దరి సహకారం - పోలీసుల అదుపులో పలువురు అక్రమార్కులు

Investigation on Dharani Portal
Investigation on Dharani Portal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 5, 2026 at 7:59 AM IST

3 Min Read
Choose ETV Bharat

Investigation on Dharani Portal : ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని 10 వేల ఎకరాల భూములకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ అక్రమాలకు సీసీఎల్​ఏలోని ఇద్దరు సహా జిల్లాల్లో కొందరు సహకరించినట్లు తేల్చారు. పోలీసులు పలువురు అక్రమార్కులను అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది.

పట్టా భూముల్లోనూ వేల ఎకరాల దోపిడీ : సాగు భూముల రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల పోర్టల్‌ ధరణిలో 10 వేల ఎకరాల అక్రమాలు చోటు చేసుకుంది. పోర్టల్‌లోని లొసుగుల ఆధారంగా విలువైన భూములున్న ప్రాంతాల్లో వేల ఎకరాలకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేశారు. ప్రధానంగా ఎకరా కోట్ల ధర పలికే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతోపాటు సిద్దిపేట, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాల్లో భూఅక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ భూదోపిడీకి సీసీఎల్​ఏకు సంబంధించిన ఇద్దరు సహకారం అందించినట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల్లోని సిబ్బంది సైతం వారి బాటలో నడిచినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ధరణిలో సాధారణంగా జరిగే ప్రక్రియ లేకుండా, దస్త్రాలను వాడకుండా భూములపై యాజమాన్య హక్కులు మారినట్లు పలు జిల్లాల్లో కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై సాంకేతిక, రెవెన్యూ చట్టాల నిపుణులతో అధ్యయనం చేయించి, ప్రాథమిక సమాచారం సేకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైబర్‌ క్రైం, ఐటీ విభాగాల వారితోనూ పరిశీలింపజేసింది. ఈ క్రమంలో పెద్దఎత్తున భూముల హక్కులు దారి మళ్లినట్లు గుర్తించింది. మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ రెండు రోజుల క్రితం ఐఏఎస్‌ అధికారులు, సైబర్‌ క్రైం, ఐటీ, ఎన్‌ఐసీ తదితర విభాగాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు దస్త్రాలను పరిశీలించగా ఎసైన్డ్, ప్రభుత్వ, మిగులు, భూదాన్‌ భూములతోపాటు వివాదాల్లో ఉన్న పట్టా భూముల్లోనూ వేల కొలది ఎకరాల దోపిడీ జరిగినట్లు తేల్చారు.

పాత సాఫ్ట్‌వేర్‌ కొనసాగుతున్న సమయంలోనూ : మేడ్చల్‌ జిల్లా రావెల్‌కోల్‌లోని నాలుగు పార్శిళ్లలో ఎకరాల కొద్దీ భూములు వేరే వారి పేర్లపైకి మారినట్లు గుర్తించారు. ఒకచోట 16 ఎకరాలు, మరోచోట 15.28 ఎకరాలు ఇతరుల పేర్లపైకి మారినట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో, సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలంలో విలువైన భూములు, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో కొన్ని పట్టా భూములు ఇతరుల పేర్లపైకి మారాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమం ఆనుపానులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా మార్పు చేర్పులు జరగలేదు.

ధరణి పోర్టల్‌ సాంకేతికతలోని లొసుగులను గుర్తించిన పలువురు వ్యక్తులు అక్రమానికి తెరలేపినట్లు తెలిసింది. మీ-సేవా, తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు దస్త్రాలు ఏవీ రాకున్నా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో వివిధ కార్యాలయాల్లోని సిబ్బంది సాయం తీసుకుని హక్కులను మార్చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ తతంగంలో హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌- సీసీఎల్​ఏ కార్యాలయానికి చెందిన ఇద్దరి హస్తం ఉన్నట్లు విచారణ బృందం తేల్చింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కంప్యూటర్‌ పరిజ్ఞానమున్న మరో వ్యక్తి సహకారంతోనూ కొన్ని భూములపై హక్కుల మార్పిడి జరిగినట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌ భూభారతిగా మారిన తర్వాత పాత సాఫ్ట్‌వేర్‌ కొనసాగుతున్న సమయంలోనూ కొన్ని జిల్లాల్లో హక్కులను మార్చినట్లు అనుమానిస్తున్నారు.

ధరణి ఆపరేటర్లకు నోటీసులు : విచారణ బృందం గుర్తించిన అనుమానితుల్లో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మాజీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. పలు ఆన్‌లైన్‌ సెంటర్ల నిర్వాహకులు, గ్రామస్థాయి సిబ్బంది, దళారులు సైతం ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ఎలాంటి దరఖాస్తులు, వినతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలను గుర్తించారు. ఇందుకు బాధ్యులైన తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు అందజేసినట్లు తెలిసింది.

భూ భారతి పోర్టల్​​లోకి చొరబడిన దొంగలు - రాత్రికి రాత్రే రూ.కోట్ల విలువైన భూముల మార్పిడి

ధరణి పోర్టల్‌లో కోడ్‌ ఆడిటింగ్‌ - ఇక అక్రమాలకు చెక్