క్యూలైన్లలో ఫ్యాన్లు - నిమిషాల్లోనే దర్శనం : మేడారంలో ఈసారి ఇబ్బందులుండవ్!
మేడారం జాతరకు ముమ్మరంగా అభివృద్ధి పనులు - సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు - లైన్లలో వేచి ఉండే భక్తులకు ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం - 20 నిమిషాల వ్యవధిలోనే దర్శనం

Published : January 9, 2026 at 1:11 PM IST
|Updated : January 9, 2026 at 1:28 PM IST
Development Works In Medaram : మేడారం ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు రావడంతో దానికి అనుగుణంగానే ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది.
వన దేవత సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. దేవతల దర్శనం పూర్తయిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈసారి క్యూలైన్ల నిర్మాణం వినూత్నంగా చేపడుతున్నారు. పది నుంచి ఇరవై నిమిషాల వ్యవధిలోనే దర్శనం జరిగేలా రూ.3 కోట్లతో జరగుతున్న క్యూలైన్ల నిర్మాణంపై ప్రత్యేక కథనం.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో : ఇంత వరకు జాతర గద్దెల ప్రాంగణానికి కుడి, ఎడమ, వెనక వైపు క్యూలైన్లు ఉండేవి. కాగా ఈసారి కుడి వైపున్న వరుసలను తొలగించి స్మృతివనం నిర్మిస్తున్నారు. ఎడమ వైపు ఉన్న వాటన్నింటిని తొలగించారు. మొత్తం ఐదు వరుసలను నిర్మిస్తున్నారు. ఈ వరుసల్లో ప్రవేశించిన భక్తులు సమారు 750 మీటర్లు నడిచి, గద్దె ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్య వరుసను పోలీసులు, వాలంటీర్ల కోసం వినియోగిస్తారు. దానికి కుడి వైపు ఉన్న రెండు, ఎడమ వైపు ఉన్న రెండు వరుసల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
వీటిపై నీడ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో షెడ్లు నిర్మిస్తున్నారు. లైన్లలో వేచి ఉండే భక్తులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గతంలో భక్తులు ఒక వరుస నుంచి మరో వరుసలోకి వెళ్లేందుకు ఇనుప బొంగుల మధ్య కొతం స్థలం ఉండేది. ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు.
వీఐపీల కోసం ప్రత్యేకంగా : దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల గవర్నలు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన వేలాది మంది ప్రముఖులు దేవతలను దర్శించుకొనేందుకు మహా జాతరకు వస్తుంటారు. వీరందరికీ వీఐపీ దర్శినం అందేలా చేయడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. గతంలో వీఐపీల కోసం ప్రత్యేకంగా ఒక వరుస ఉండగా, పైరవీల కారణంగా తొలగించారు. ఈసారి మాత్రం మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా వీఐపీ వరుసను పక్కాగా ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న సాయంత్రం మేడారం వెళ్లనున్నారు. తర్వాత రోజు ఉదయం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క ఇదివరకే వివరించారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల సమీక్షకు హాజరైన మంత్రులు పలు వివరాలను వెల్లడించారు. రూ.251 కోట్లతో జాతర ఏర్పాట్లు, సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం జరుగుతోందని, పనులు తుది దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
మాజీ సీఎంకు ఆహ్వానం : మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరకు రావాల్సిందిగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు సీతక్క, కొండా సురేఖలు గురువారం ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మంత్రులను కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. మంత్రులు జాతర ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. తమ ఇంటికి విచ్చేసిన మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. కేసీఆర్ - శోభ దంపతులు పసుపు, కుంకుమ, తలంబ్రాలు, వస్త్రాలతో సంప్రదాయ రీతిలో మంత్రులను సత్కరించారు. వారు అందించిన విందును స్వీకరించిన మంత్రులు, పరస్పర యోగాక్షేమాలు తెలుసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు.

