విస్తరిస్తోన్న 'ఇన్‌ఫ్లూయెంజా' వైరస్ - ఈ లక్షణాలు కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Influenza Is Spreading To Children : హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ చిన్నపిల్లల్లో వేగంగా విస్తరిస్తోంది. నిలోఫర్, పలు ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో నిండిపోయింది. ఇన్‌ఫ్లూయెంజాను సాధారణంగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Published : October 12, 2026 at 6:50 PM IST
|Updated : October 15, 2026 at 9:23 AM IST
Influenza Is Spreading To Children : హైదరాబాద్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారికి జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వచ్చాయి. మొదట అది సాధారణ జ్వరమే అనుకుని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స అందించారు. అయితే నాలుగు రోజులైన తగ్గకపోవడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన అలసట మొదలవడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. చివరకు పరీక్షలలో ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధరించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.
చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఇన్‌ఫ్లూయెంజా ఎ
- హైదరాబాద్ నగరమంతటా ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
- ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా ఎ రకం వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. నీలోఫర్‌తో పాటు పలు ప్రైవేట్ పిల్లల వైద్యశాలలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.
- 60 ఏళ్లు పైబడిన చాలా మంది ఆసుపత్రిలో చేరుతున్నారని, కొన్ని కేసులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాయని వైద్యులు నివేదిస్తున్నారు.
- ఈ అనారోగ్యాన్ని కేవలం సాధారణ జ్వరంగా కొట్టిపారేయడం ప్రమాదకరమని, ఎందుకంటే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లక్షణాలు ఇవే
- ఇన్‌ఫ్లూయెంజా సోకిన వ్యక్తులలో సాధారణంగా ఆకస్మికంగా అధిక జ్వరం, గొంతు నొప్పి, పొడి దగ్గు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- తుమ్మడం, దగ్గడం ద్వారా గాలిలోకి విడుదలయ్యే తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది.

ఇన్‌ఫ్లూయెంజాను కేవలం సాధారణ జ్వరంగా కొట్టిపారేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులకు, అలాగే మధుమేహం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ - ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి
సాధారణ జ్వరంగా భావిస్తే ముప్పే
- సాధారణ జ్వరానికి, ఇన్ఫ్లూయెంజాతో సంబంధం ఉన్న ప్రమాదకరమైన పరిస్థితికి మధ్య తేడాను గుర్తించడం అత్యంత కీలకమని వైద్యులు అంటున్నారు.
- మొదట్లో సాధారణ ఫ్లూ లాగా కనిపించినప్పటికీ కొందరిలో ఈ వైరస్ వేగంగా ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది.
- తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆయాసం పెరగడం, గురక, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ నొప్పి లేదా ఛాతీలో బరువుగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన నిద్రమత్తు, గందరగోళం, లేదా నిరంతర వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే
- చిన్న పిల్లలను బహిరంగ ప్రదేశాలకు, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉంచడం మంచిది.
- ఒకవేళ అలాంటి ప్రదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయితే, మాస్క్ ధరించాలి.
- సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
- కళ్లు, ముక్కు, నోటిని తరచుగా తాకడం మానుకోవాలి.
- మరిగించి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
- పోషకమైన ఆహారం, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

పదేపదే వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారా? - పార్కిన్సన్స్ వచ్చే ప్రమాదం!
నిశ్శబ్దంగా వ్యాపిస్తోన్న హెచ్1ఎన్1 వైరస్ - జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్స్

